26, జూన్ 2024, బుధవారం

సీతాఫలం - రామాఫలం

 *(1948 మార్చ్ నెల చందమామలో ప్రచురించిన కథ)*


🌿"సీతాఫలం  - రామాఫలం"🌿

🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

 

        అబ్బాయిలు, అమ్మా యిలూ! మీలో అందరికీ సీతాఫలం, రామాఫలం అంటే తెలుసా? యెప్పుడన్నా తిన్నారూ? అందరూ తిని ఉండరనుకుంటాను. నిజమేనా ? పై ఆకారంలో భేదం ఉన్నా లోపల గింజలు, రుచీ , సమానంగానే ఉంటాయి. పేర్లను బట్టి చూస్తే వీటి పుట్టుక లో ఏదో గమ్మత్తు ఉండితీరాలని మీలో తెలివైన వాళ్లబుద్ధికి తడుతుంది. నిజమే, ఆ గమ్మత్తేమిటో కాస్త జాగ్రత్తగా చదవండి తెలుస్తుంది.


శ్రీ రామచంద్రమూర్తి రావణా బ్రహ్మను చంపి, సీతాదేవిని తీసుకుని అయోధ్యకు వచ్చి, పట్టాభిషేకం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందేగా. ఆయన పట్టాభిషేకమౌతుంటే సామంతరాజులూ, బంధువులూ స్నేహితులూ, భక్తులు మొదలయిన వారంతా తలా ఒక కానుక తీసుకువచ్చారు. అందులో వానరరాజు సుగ్రీవుడూ, రాక్షసరాజు విభీషణుడూ, దేవతల రాజు ఇంద్రుడూ కూడా బహుమతులు....అంటే శుభసమయంలో చదివించటానికి, ప్రపంచములో గొప్పవైన వజ్రాలు, మణులు, రత్నాలు ఆదిగాగల అపురూపపు వస్తువులు తీసుకువచ్చారు. ఇక సామంత రాజులు, రాజాధిరాజులూ ఏదో ఒక గొప్ప వస్తువు తీసుకువచ్చారు. ఇంకా భక్తులూ, జ్ఞానులు అందరూ కానుకలు తెచ్చారు.


అందరిలోకీ పరమ భక్తుడెన ఆంజనేయస్వామి పట్టాభిషేకం మూడు రోజులుందనగా మొదలు పెట్టాడు ఆలోచన, ఏమి కానుక సమర్పించుదామా అని. శ్రీ రామచంద్రమూర్తికి పరమ ప్రియమైనదీ, యెవ్వరూ తేనిదీ తీసుకురావాలని ఆయన వూహ. ఏ వస్తువును గురించి ఆలోచించినా యెవరో ఒకరు తేనే తెచ్చారు. ఆంజనేయస్వామికి ఏమీ పాలుపోలేదు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. రేపు ప్రొద్దున పట్టాభిషేకం - అట్టే సమయం లేదు. తెల్లారేలోపుగా ఆ కానుకేదో నిర్నయించి తీసుకు రావాలి. చప్పున యేదో జ్ఞాపకం వచ్చి లేచాడు హనుమాన్. తక్షణం రివ్వుమంటూ బ్రహ్మదేవుని దగ్గరకు పోయి వాలాడు. హనుమంతుడు తొందరగా వేళగాని వేళ హనుమంతుడు రావడం చూచి అదరిపడ్డాడు బ్రహ్మ.  ఏంకొంప మునిగిందో దేముడా అని భయపడి, కుర్చీ వేసి కూర్చోమన్నాడు.


ఉహూ, కూర్చోలేదు హనుమంతుడు. “చాలా తొందర పనిమీద వచ్చాను. రేపు శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం. ఆయనకు కానుకగా సమర్పించటానికి సీతాదేవికి, శ్రీరామచంద్రమూర్తికి పరమ ప్రియమైనది సృష్టించి యిస్తేగాని వీలు లేదు. అంతవరకూ నిన్ను వదిలేది లేదు" అన్నాడు.


అసాధ్యుడనీ, పట్టినపట్టు విడిచేరకంగాదని, బ్రహ్మకి తెలుసు. అయినా అర్ధరాత్రివేళ యీ కోతి పీడ యేమిటి అనుకున్నాడో ఏమో, బాగా ఆలోచించి అంతకుముoదు సృష్టిలో లేనివి, అతి మధురంగా ఉండేవీ, రెండు పళ్లు సృష్టించి వాటికి సీతాఫలము, రామాఫలము అని పేరు పెట్టి వీటినియివ్వరా నాయనా, మీ రామచంద్రుడు చాలా ఆనందిస్తాడు' అని యిచ్చాడు.


తక్షణం భూలోకానికి వచ్చాడు హనుమాన్.

పట్టాభిషేక సమయమయింది. హనుమాన్ ఎక్కడున్నాడా అని అయోధ్యంతా వెతికిస్తున్నాడు శ్రీ రామచంద్రుడు. యేమైనా కోపమొచ్చి అలిగాడేమో అనుకున్నాడు తనలో, హనుమంతుడంటే పరమ ప్రేమ ఆయనకు. పట్టాభిషేకం జరుగుతున్న సంతోషమే లేదాయన ముఖంలో.


ఇంతలో హనుమంతుడు వచ్చాడంటె వచ్చాడన్నారు అందరు. హనుమంతుడు సరాసరి శ్రీరామచంద్రుడి పాదాలవద్ద వాలి రెండు చేతులతో రెండు ఫలాలూ సీతా రాముల పాదాలవద్ద ఉంచి సీతాఫలము, రామాఫలము అని నమస్కారం చేశాడు.


శ్రీరామచంద్రుడు హనుమంతుడ్ని కౌగలించుకుని మూడు రోజులనుండి కనపడటం లేదు, ఎక్కడున్నా వోయి హనుమాన్?” అని అడిగాడు. హను మంతుడు జరిగిన కధంతా చెప్పాడు.


శ్రీరామునితో కూడా సభంతా ఆశ్చర్య పోయారు, హనుమంతుని భక్తి, శక్తికి. తరువాత ఆ ఫలాలు రెండూ విడదీసి పెద్దలందరికీ పంచి పెట్టారు ప్రసాదంలాగా, అవి తిని వాటి మధురానికి అంతా ఆశ్చర్యపోయి, హనుమంతుడ్ని పొగడుతూ , గింజల్ని జాగ్రత్తగా పాతి పెట్టి మొక్కలు మొలిపించి కాయలు కాయించి అందరికీ సీతారామ ప్రసాదంలాగా పంచి పెట్టారు. శ్రీ రామ చంద్రుడు సీతాదేవీ ఎక్కువగా సంతోషించారు, హనుమంతుని భక్తికి, ప్రతిభకీ ఆ నాటి నుంచీ ఈనాటి వరకూ మనం తింటున్నాం యీ ఫలాలను. హనుమంతుడ్ని ఒక్కసారైనా తలుచుకోము అవి తింటున్నప్పుడు. ఇక నుంచి అవి తింటున్నప్పుడు అవి "సృష్టింపించి భూలోకానికి తెచ్చి అందించిన హనుమంతుడ్ని తలుచుకుంటుండండి సుమా.

కామెంట్‌లు లేవు: