23, సెప్టెంబర్ 2024, సోమవారం

*శ్రీ శంకరాచార్య చరిత్రము 20

 _*శ్రీ శంకరాచార్య చరిత్రము 20 వ భాగము*_ 

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐


*పరకాయప్రవేశము: శంకరుల వివరణ*


ఆ నిర్ణయం తీసు కోవడమే తడవు ఉభయభారతి శంకరు నిపై ఈ విధంగా ప్రశ్నల వర్షం కురిపించింది: "శంకరాచార్యా! స్త్రీ పురుషుల మధ్య కామకళ శుక్ల పక్ష మందెట్లుండును? కృష్ణ పక్షమందు ఎట్లుండును అట్టి కళ లెన్ని? వాని స్వరూపమేమి నీకు తెలిసిన వివరించెదవా. 


చటుక్కున వచ్చిన ప్రశ్నలకు సమాధానము చెప్పిన ఒక చిక్కు, చెప్పకున్న మరొక చిక్కు ఇది ఒక కుయుక్తితో చేసిన పన్నాగము. ప్రత్యుత్తర సమయంలో నీ అనుభవ మేమి అనే ప్రశ్న వస్తుంది. అందు వలన ఈ యుక్తికి పై యుక్తియేసమాధానము కాగలదని తలచాడు శంకరుడు. "దేవీ! నాకు మూడు మాసముల వ్యవధి కావలెను. వాద మధ్యమున ఇట్లు వ్యవధి తీసికొనుట సనాతన సంప్రదాయ బద్ధముకదా! ఈగడువు గడచిన పిమ్మట మన వాదము తిరిగి నడచును గాక!" అని పలికారు శంకరులు. ఉభయభారతి అంగీక రించడంతో నాటి పరిషత్సభ వాయిదా పడింది.


సభ ముగిసిన తరువాత శంకరులు శిష్యగణముతో కూడి నదీతీరాన ఉన్న ఉద్యానవనం చేరుకు న్నారు. వేకువనే లేచి కాలకృత్యములు తీర్చు కొని తెల్లవారగనే శంకరులు గగన మార్గాన పయనమై పోతున్నారు. ఒక అరణ్యంలో ఆ ప్రాంతా న్ని పాలించే అమరకు డనే మహారాజు వేటకు వెళ్ళి మరణించగా రాజు మృతదేహము చుట్టూచేరి రాజు భార్యలు నూర్గురు రోదనము చేయడం చూచారు శంకరుడు. ఆ దృశ్యాన్ని తన శిష్యుడైన పద్మపాదు నకు చూపించి "పద్మపాదా! పతి వియోగం భరించలేక ఆ రాణులు విలపిస్తు న్నారు. నేను ఆ రాజు శరీరంలో ప్రవేశిస్తే వారి దుఃఖం పోతుంది. పాప మా రాజు తన పుత్రుని కి యువరాజ పట్టాభి షేకం కూడ చేయలేదు. నేనా రాజు శరీరంలో ప్రవేశిస్తే ఆ పని కూడా పూర్తి చేసినవాడను అవుతాను. నేను ఆ కాంతామణులతో విహ రించి ఆ కళల విశేషాల్ని తెలిసి కొన వచ్చును గదా? నేను కేవలం సాక్షీ భూతుడనై వ్యవహరిస్తాను కాబట్టి నాకు ఎట్టి దోషమూ ఉండదు” .


గురువుగారి మాటలను విన్న పద్మపాదుడు నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే తేరుకొని గురువుతో ఇలా అంటాడు: "స్వామీ! మీకు చెప్పదగ్గ వాడను కాను. పరకాయ ప్రవేశము కానిదని విన్నాను. దీనికి అనేక దృష్టాంతాలున్నాయి. ఒకపుడు మత్స్యేంద్రు డనే మహానుభావుడు తన శరీరమును భద్రంగా కాపాడమని తన శిష్యుడు గోరక్షకుని కడ పెట్టి మృతుడైన రాజు శరీరంలో ప్రవేశించి ఆ రాజ్యాన్ని వైభవంగా పాలించడం మొదలు పెట్టాడు. ఆతని పాలనలో మున్నెన్నడు చూడని మహావైభవం ప్రాప్తించిం ది ఆదేశానికి. ప్రతిభా వంతులైన మంత్రులకు అనుమానం వచ్చింది. మరణించి బ్రదికిన రాజుకు అంతకు ముందు తమకు తెలిసిన రాజుకు శరీరంలో తక్క ఏ విధమైన సామ్యమూ కానరావడం లేదు. ఇదివరకు రాజు ఒక లాగున ఇప్పుడు వేరొక లాగున ఉన్నారు. ప్రతిభా పాటవాలతో బహు ధర్మాలెరిగిన వాడిలా ధర్మపరిపాలన చేస్తున్న ఈతడు మన అసలు రాజు కాదు. ఎవరో సమర్థుడు రాజు శరీరంలో ప్రవేశించి ఉంటాడని నిశ్చయించు కొన్నారు మంత్రులు కలిసి. 


ఈ వార్త తెలిసిన రాణులు అతనిని ఇతోధికంగా సంతోష పెట్టేలాగున వర్తించడం తో, మత్స్యేంద్రుడు భోగలాలసుడైనాడు. ఇదిచూచిన గోరక్షకుడు తన గురువు మహాత్ముడు ఇలా అయిపోయాడని చింతించి ఉపాయంతో రాజాంత:పురం చేరి మెలమెల్లగా గురువుకు పూర్వస్మృతి కలిగించా డు. తన శరీరాన్ని శిష్యుడు భద్రంగా దాచి ఉన్నాడు కాబట్టి తిరిగి మత్స్యేంద్రుడు స్వశరీ రంలో చేరగలిగాడు. గురుదేవా! విషయాను రాగం ఎంతటి వారి నైనా లొంగదీయును. జ్ఞానాన్ని నాశనం చేసి మూర్ఖుణ్ణి చేయును. మీకు చెప్పదగిన వాడను కాను. కాని చెప్పకుండా ఉండ లేకున్నాను. లోకోద్ధర ణార్థం పరమ పావన మైన బ్రహ్మచర్య వ్రతం చేపట్టిన మీకు ఇదేమి వైపరీత్యము? ఈ మాటలు మీతో అనుటకు తమరు నాయందు చూపిన అవ్యాజమైన కరుణ, వాత్సల్యమే బలాన్ని ఇచ్చింది. ధర్మసంస్థా పకా! ఆలోచించుడు” అని దీనంగా వేడు కొన్నాడు పద్మపాదుడు శంకర స్వామిని. ప్రియశిష్యుని భయం పోగొట్టడానికి శంకరులు ఇలా చెప్పారు: “పద్మపాదా! నీవు చెప్పిన దానిలో పొరపాటు ఇసుమంత కూడా లేదు. ధర్మాసక్తి కలవారు ధర్మరక్షణకే ఎప్పుడూ పాటు పడతారు. శాస్త్రము లలో ఈ విషయమై విధినిషేధములున్న మాట వాస్తవమే. ఆ నిషేధములు ముక్తి పొంద వలసిన వారికే వర్తిస్తాయి. ముక్తులైన వారికి ఆ నిషేధము లతో పని లేదు. సంకల్ప రహితులకు విషయాసక్తు లుండవు. కోరికలు లేని మనస్సు సర్వదా పరిశుద్దమే. సంకల్పములే లేని వారికి కోరికలు మొలకె త్తవు. ముక్తి నొందిన వానిని ఎవరూ ఏమీ చేయలేరు. శ్రీకృష్ణుడు అనేక వేల గోపకాంత లతో శృంగార లీలలు సల్పినా ఆయన సదా బ్రహ్మచారిగాకొనియాడ బడుతున్నాడు. విధి నిషేధాలకు అతీతమైన పరతత్వమున్నది. ఉపనిషత్తులలో వజ్రయోలి యోగ మను నది ఉన్నది. అది పరకాయప్రవేశము వంటిది. ఆ యోగము నొందినవాడు యోగ భ్రష్టుడు కాడు సరి కదా మహాతేజస్సుతో విరా జిల్లుతుంటాడు. పరకాయప్రవేశములోని అనుభూతులు

ఏమియు సత్యములు కావు. అవి కేవలము లీలలు. శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి. సంకల్పరహితుడు. నేనూ అంతే. సందేహము విడనాడుము".


మరల వివరిస్తున్నాడు శంకరుడు శిష్యునికి: "పద్మపాదా! అవతార పురుషుడు సర్వాతీతుడు.


వర్ణాశ్రమధర్మములు, కర్మవిధులు అన్నీ పరిత్యజించి పరమాత్మే తానన్న నిశ్చయంతో పరిపూర్ణుడై, మాయాతీతుడై శాశ్వతానందంలో తేలియుండును. పద్మపాదా! అజ్ఞాన మున్నంతవరకు ప్రకృతి సత్యమనీ, కర్మఫలము లు నిజమనీ తోస్తుంది. జ్ఞానము కలుగగానే అవి యెల్ల మిథ్య యనీ స్వప్నతుల్యములనీ తెలుస్తుంది. దీనిని నేను చేస్తున్నాను, దీన్ని నేను అనుభవిస్తు న్నాను అనే భావన లేని వానికి ఏదియు అంటదు. తత్త్వవేత్త సుకృత దుష్కృతము లకు లోబడడు. అట్టివానికి విశ్వప్రేమ ఉండును. ఏ జీవిని అతడు హింసించడు. ఒకవేళ అలా చేసినా దానికి అంతర్భాగమైన

కారణముంటుంది. ఇందులకు ఒక దృష్టాంత మున్నది. వినుము. 


త్వష్టకుమారుడు విశ్వరూపుడనే వాడు ద్వాదశాదిత్యులలో ఒకడు. ఆతడు మహాగర్వంతో లోకాలను పీడించడం మొదలు పెట్టాడు. అది చూచి దేవేంద్రుడు తన వజ్రాయుధంతో అతణ్ణి చీల్చి చెండాడి ముక్కలు ముక్కలుగా చేసి కాకులకు గ్రద్దలకు ఆహారంగాపారవేశాడు. అంత చేసినా దేవేంద్రునికి ఏమీ కాలేదు. జనకమహా రాజు అనేక యజ్ఞ యాగాదులు, దాన ధర్మాలు చేసినవాడు. కాని అనునిత్యం తత్త్వజ్ఞానియై కర్మ ఫలితాలను పొందక పరమ నిత్యమైన మోక్షానందమే పొందాడు" అని బోధించాడు శిష్యుని సందేహ నివృత్తి కోసం.


*శంకరుని పరకాయ ప్రవేశము:*


గగనవీధిలో శిష్య సమేతంగా ప్రయాణించి ఒకచోట పర్వత శిఖరం మీదకు చేరిన తర్వాత ఒక గుహను సమీపించి దానిని మూయడానికి అనువైన రాతి పలక నొకటి సంపాదించు కొన్నారు. 


శంకరాచార్యుడు తన శరీరాన్ని ఆ గుహలో భద్రపరచి జాగరూకత తో కాపాడమని శిష్యు లకు ఆదేశించారు. తాను తిరిగి వచ్చే వరకు ఏమరుపాటు లేకుండా ఉండమని చెప్పి యోగశక్తితో స్వశరీరాన్ని విడిచి అమరకమహారాజు మృతశరీరంలో బ్రహ్మ రంధ్రంగుండా ప్రవేశిం చాడు. వెను వెంటనే ప్రాణవాయువును ప్రవేశపెట్టి ఆపాద మస్తకము సంచరించు నట్లొనరించారు. ప్రాణము రాగానే రాజు శరీరం కదలడం మొదలుపెట్టింది. కండ్లు తెరచి కూర్చొన్నాడు. రాజకాంతలు, పరివార ము సంతోష సంభ్రమా లతో కోలాహలంగా అయింది. పురములోని వార్త తెలిసి దివ్య మంగళధ్వనుల మధ్య వేదపారగులు స్వస్తి వచనములు చెప్పు చుండగా దివ్య వాహనంపై రాజును పురప్రవేశము చేయిం చారు మంత్రి సైన్యాధ్యక్ష ప్రముఖులు. కొలదిరోజుల తరువాత అమరకమహారాజు మంత్రులు, దండ నాయకులు, సేనాధి పతులు, సామంతులు, న్యాయాధీశులు, కవి పండిత గాయక ముఖ విద్యాధికులు, వివిధ కళాప్రపూర్ణులు, ఉన్న నిండు కొలువును ఏర్పరచి అందరికీ ఆదేశ మిచ్చాడు: “ఈ రోజు నుండి మనము క్రొత్త దీక్షతో రాజ్యాన్ని అన్ని విధాల ఉత్తమ రాజ్యంగా నడపు తుండాలి. రాజశాస నాన్ని ప్రజలందరూ విధిగా గౌరవించి పాటించాలి. దేశంలోనికి శత్రువులు చొరకుండా అప్రమత్తులమై మెలగాలి. రాజోద్యోగు లందరు ప్రజాసేవయే పరమావధిగా రాచ కార్యములుచక్కబెట్టాలి. ఎవరి వృత్తులు వారు సవ్యంగా నిర్వర్తిస్తూ ఒకరికొకరు ఐకమత్యం ప్రేమ, సద్భావము కలిగి కృషి చేస్తుండాలి. శాసనములను ఉల్లం ఘించిన వారు, దుష్టవర్తనులు నిర్దయ గా శిక్షకు గురి ఔతారు. ఈ విషయాలను మదిలో నుంచుకొని ఎవరి విధులు వారు సక్రమంగా దృఢబుద్ధితో అమలు పరచాలి. ఇలా జరిగేలా ప్రధానామా త్యులు నా ప్రతినిధిగా నిర్వహిస్తారు ఇక్కడి నుండి" అని ఆజ్ఞాపించినాడు.


ఒక క్రొత్తశకం ఆరంభమై నట్లు రాజ్యం సుభిక్షమై నెలకు మూడు వానలు పడి దేశం సస్యశ్యామ లముగా అలరారు తోంది. గోవులు కుంభవృష్టిగా క్షీరము లిస్తున్నాయి. బ్రాహ్మణు లు యజ్ఞయాగాది క్రతువులతోదేవగణాన్ని తృప్తి పరుస్తున్నారు. వస్త్రోత్పత్తి మెండుగా ఉండి ఆహార వస్తువు లు సమృద్ధిగా న్యాయ పద్ధతిలో వస్తువిక్ర యాలు జరుగుతున్నవి. 

ప్రధానామాత్యుడు రాజు ప్రతినిధిగా ఎంతో సమర్థనీయంగా నడుపుతున్నాడు. రామ రాజ్యము అంటే ఇదే నన్న గాఢమైన నమ్మకం కలిగిస్తోంది. రాజ్య భారాన్ని మొత్తం ప్రధానామాత్యునిపై మోపిన రాజు ఏం చేస్తున్నాడు? తానెందులకీ వేషం వేయవలసిందో తన్నిమిత్తమై శృంగారకళావిశేషాలు ఆ రాణులందరి సహ వాసంతో ప్రత్యక్షసాక్షిగా తత్సంబంధమైన శాస్త్ర విద్య నేర్వకపోయినా విద్యార్థిగా క్షుణ్ణంగా నేర్చుకొనే ధార్మిక యత్నంలో నిమగ్నుడై ఉన్నాడు. ఆ యత్న మెలాంటిది? తాను పూనుకొన్న అద్వైత మత స్థాపనా యజ్ఞం సంపూర్ణ సాఫల్యాన్ని చేరుకొంటేగాని తన అవతారలక్ష్యం సిద్ధించదు. ఆ లక్ష్య సాధనకు ఏ ప్రాపంచిక మైన అవరోధమూ కలుగకూడదు. ప్రియ శిష్యుడైన పద్మపాదు నకు వివరించినట్లుగానే సాక్షీభూతభావంతో లీలా సదృశమైన ప్రవృత్తి చేపట్టినాడు.


ఈలోగా ఒకనాడు మంత్రులందరు కలసి సమావేశమైరహస్యంగా ఇలా మాట్లాడుకొంటు న్నారు. 'చనిపోయి రాజు తిరిగి బ్రతికి వచ్చిన పిమ్మట అంతకు ముందు ఉన్న పరిస్థితులలో హస్తి మశకాంతర భేదం కనిపిస్తోంది. ఇతః పూర్వము ఎన్ని యత్నాలు చేశాము దేశంలోని సమస్యలను

సరిదిద్దడానికి? ఏ ఒక్కటీ కించిత్తు కూడ ఫలించలేదు. ఇప్పుడు ఏ శ్రమా లేకుండా అన్నీ చక్కగా జరిగిపోతు న్నవి మహావైభవంగా! అప్పుడు శత్రుబాధ లేని రోజు లేదు. ఈ నాడు దేశంలో ఏ విధమైన వివాదాలే లేవే! ఆనాటి ఉద్యోగుల మే ఈనాడు కూడా చేస్తున్నవారము. ఈ అతి విచిత్రమైన మార్పుకు కారణము ఉండాలి. మన రాజు చచ్చి బ్రతికిన తర్వాత వచ్చిన మార్పులివి.


అమరక మహారాజు యొక్క పాలన మనకు తెలిసినదే కదా! ఏ మానవాతీతుడో మన రాజు మృతకళేబరంలో పరకాయ విద్యతో ప్రవేశించి ఈ మార్పు లకు కారణభూతుడై యుండవలెను'. ఏది ఏమయినా ప్రజాక్షేమ హితమైన ఈ మార్పు ను మెచ్చకుండ ఉండ గలమా?’


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ శంకరాచార్య చరిత్రము*

*20 వ భాగము సమాప్తము*

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

కామెంట్‌లు లేవు: