23, సెప్టెంబర్ 2024, సోమవారం

24. " మహాదర్శనము

 24. " మహాదర్శనము "--ఇరవై నాలుగవ భాగము --ఉపనయనపు సంభ్రమము


24.  ఇరవై నాలుగవ భాగము--  ఉపనయనపు సంభ్రమము 



          చైత్ర శుద్ధ పంచమి గురువారము యాజ్ఞవల్క్యునికి ఉపనయనము . కేవలము పంచాంగపు లెక్క ప్రకారము వయస్సు నిర్ణయించువారంతా , " ఇదేమిటి , పిల్లవాడికి ఐదేండ్లయినా నిండలేదు , వాడి నోటికి మంత్రాలు వస్తాయా ? " అని మందలించేవారిలాగా మాట్లాడుతారు . అయితే వాడిని కళ్ళారా చూచినవారు మాత్రము , " వాడిని చూస్తే ఎనిమిదేళ్ళ పిల్లవాడిలాగా ఉన్నాడు. నోటిలో మాటలు పటపటమని పేలాలు వేయించినట్లు వస్తున్నాయి , శ్లోకములను అంత స్ఫుటముగా పలికేవాడికి మంత్రాలేమి కష్టము ? " అంటారు .


         జాయంతీ , ఆమె భర్త మహిదాసుడూ ఉపనయనపు ఆహ్వానమును చూచి చకితులైనారు . మహిదాసుడు ఏవేవో కార్యాంతరముల వలన గడచిన రెండు సంవత్సరాలుగా మనవడిని చూడనేలేదు . జాయంతి , కూతురు పంపిన వర్తమానమును భర్తకు చెప్పినది : " పోయిన సంవత్సరమే , అంటే , ఆ ధేనువు మాట్లాడిన ప్రసక్తి వచ్చింది కదా , అప్పుడే , గర్భ పంచమములో ఉపనయనము కావలెనని బుడిలులు చెప్పినారట ! వారి ఇంట్లో , ముఖ్యముగా మీ అల్లుడికి బుడిలుల మాట అంటే వేద వాక్యము కదా ? " అన్నది . 


        మహిదాసులు , " బుడిలులంతటి వారు వేలకొక్కరు ఉంటే అపురూపము . కాబట్టి వీరలా ఉండడం లో అతిశయమేముంది ? " అని , ఆ మాటకు ఒప్పుకొని , ’ ఐతే బయలుదేరేది ఎప్పుడు ? ’ అని అడిగారు . 


        జాయంతి నవ్వుతూ , " నన్నడిగితే ?  మీరు ఎప్పుడు బండి తెచ్చి నిలిపితే అప్పుడే ’ అన్నది . మహిదాసుడు ఆలోచించి , " పాడ్యమినాడు స్థాలీపాకము ముగించుకొని వెళదాము " అన్నాడు .


        జాయంతి , వృద్ధులకు మాత్రమే సాధ్యమైన ఎత్తిపొడుపుగా అంది " అలాగ వెళ్ళుట ఎందుకు ? రావడము లేదు అని చెప్పి పంపిస్తే ఎంతో క్షేమము " 


మహిదాసుడు ఈ వెటకారానికి సిద్ధముగా లేడు . " అలాగంటే ? " అన్నాడు .


          " చూడండి , తెలియనట్లు మాట్లాడుచున్నారు . నేను ఇక్కడి నుండీ వెళ్ళిన తరువాత అక్కడ ఎంత పని ఉంటుంది ? అప్పడములు , వడియములు చేయవలెను . బాణలి పట్టుకోవలెను , ఉండలు సిద్ధం చేయవలెను , ఇంత, కొండంత పని ఉంచుకొని , నేను పాడ్యమికి బయలుదేరితే  చూసేవారేమంటారు ? " 


        " ఔను , నువ్వు నీ కూతురి గురించి ఆలోచించినావు , నిజమే , ఇవన్నీ నువ్వు వెళ్ళు వరకూ ఆలంబి చేయదు . అలాగయితే , ఇలాగ చేయి , రేపు దశమే కదా , మధ్యాహ్నము భోజనము అయ్యాక బయలుదేరు . నేను విదియకు వచ్చేస్తాను . " 


          " మీమాటకి ఎప్పుడైనా ఎదురు చెప్పానా ? అయితే , రేపు మీరు కూడా నాతో పాటు వచ్చి , నన్ను అక్కడ వదలి , అల్లుడుగారిని మాట్లాడించుకొని , వచ్చేయండి . మరలా విదియకు రావచ్చు గాని ? " 


        " దీనికేనా నన్ను మొద్దు అనేది ? ఆ మాత్రము నాకు తెలీదనుకున్నావా ? ఏకాంతముగా బండిలో కూర్చొని వినోదము చేయుటకు  అవకాశముంటుందని నీ ఎత్తుగడ ? " 


ఆ మాటకు అసహనము నటిస్తూ , " వయసైపోయినాక కూడా ఇవే మాటలా ? " అంది జాయంతి.


          మహిదాసుడు ఆమెను కవ్వించునట్లు కొంటె నవ్వు నవ్వుతూ , " కొన్ని పళ్ళు దోరగా ఉన్నపుడు రుచి , కొన్ని పళ్ళు సపోటా వంటివి ,  చెట్టుపైనున్ననూ , కొన్ని రోజులైనా మాగితే రుచి , ఏదో నాపాలిటికి సపోటా దొరికింది " అన్నాడు. ఆ హావభావ విన్యాసాలు , దేహపు ఏవేవో భాగాలను సపోటకు పోల్చినట్టున్నాయి , అయితే అవి ఇద్దరికీ హితముగానే అనిపించినాయి . 


        జాయంతి , భర్తతో పాటు దశమికి కూతురు ఇంటికి వచ్చింది . అమ్మ వచ్చిందని కూతురికి కలిగిన సంభ్రమము , సంతోషము , అంతా ఇంతా కాదు . తాను , తన కొడుకుతో తల్లిదండ్రులకు నమస్కారము చేసి , భర్తను పిలుచుకు వచ్చి నమస్కారము చేయించినది . తల్లిని బచ్చలింటికి పిలుచుకొని వెళ్ళి " నువ్వొచ్చినావు , ఇక అన్నీ నిరాటంకముగా జరుగుతాయి " అంది . " కాళ్ళు ముఖము కడుక్కొని రా , అంతా చెబుతాను " అన్నది . 


        అంత లోపల యాజ్ఞవల్క్యుడు పరుగెత్తి వచ్చినాడు , " అమ్మా , తండ్రి గారు రమ్మన్నారు , రా " అన్నాడు . ఆలంబిని భర్తను చూడటానికి కొడుకుతో పాటు వెళ్ళింది .


        భర్త మామగారిని చూపించి , ’ వారు ఎప్పుడు బయలుదేరి వచ్చినారో ఏమో , మడి సిద్ధము చేయి " అన్నాడు . ఆలంబిని , " లే నాయనా , అంతా సిద్ధముగా ఉంది " అంది . అప్పటికే కొడుకు వెళ్ళి ఒక దుత్తలో నీరు తెచ్చినాడు .


మహిదాసుడు , " ఏమిటయ్యా ? నేనే కాళ్ళు కడుక్కొనేదా ? నువ్వు కడుగుతావా ? "  అని అడిగినాడు . 


        యాజ్ఞవల్క్యుడు తండ్రిని చూపించి , " వారి అనుమతి అయితే నేనే చేస్తాను " అన్నాడు . దేవరాతుడు , ’ అలాగే కానీవయ్యా ’ అన్నాడు మహిదాసుడు కాళ్ళు జోడించి నిలుచున్నాడు . యాజ్ఞవల్క్యుడు భక్తితో తాత పాదాలు కడిగి ఆ నీటిని తల్లిదండ్రులకు ప్రోక్షించి , తానూ ప్రోక్షించుకున్నాడు . 


       మహిదాసుడు మనవడి ఆ భక్తిని చూచి చాలా మెచ్చుకొని . " కొడుకును బాగా పెంచినారు . ఇంత భక్తి సంపన్నుడై ఉండుట మనందరి భాగ్య విశేషము ! " అని నోరారా పొగిడినాడు . 


        మహిదాసుడు మడి కట్టుకొని వచ్చి కూర్చున్నాడు . మామగారికి అల్లుడు ఉపచార పూర్వకముగా , పత్నీ ముఖముగా అల్పాహారమును నివేదించినాడు . అల్పాహారమైనాక మహిదాసుడు ప్రయాణమయినాడు . ఉండమని ఎంత అడిగిననూ , ’ విదియ నాటికి వస్తానుకదా ’ అని బయల్దేరినాడు . ఆలంబినీ , దేవరాతుడూ కొడుకుతో పాటు నమస్కారము చేసి , " కుటుంబపు వారందరినీ పిలుచుకొని రావలెను " అని విన్నవించుకున్నారు . 


         ఆలంబిని తండ్రిని పంపించి తల్లి వద్దకు వచ్చింది . " అమ్మా , నువ్వు వచ్చినావుకదా , ఇక ఒడుగు నిరాటంకముగా లక్షణముగా జరుగుతుంది. విను , మొదటిది రాజాస్థానము వారి సంగతి . వచ్చి ఇక్కడ చూడు , ఈ సామానులన్నీ రాజ భవనము నుండీ వచ్చినాయి . చూడు , నాలుగు మూటలు మంచి సన్నబియ్యము , రెండు మూటలు గోధుమలు , రెండు మూటలు చక్కెర , ఒక మూట బెల్లము , నాలుగు పెద్ద బిందెల నిండా నెయ్యి , ఇంకా వీటితోపాటు కావలసిన సామానులు . అక్కడ చూడు , నూనె ఎనిమిది గంగాళములు , ఇవన్నీ ఎందుకో తెలుసా ? చౌల పంక్తిలో పిల్లలకు , బ్రహ్మ భోజనములో బ్రాహ్మణులకు పంచాన్నములూ , పంచ భక్ష్యములూ కావలెనంట. నేతిని దొన్నెలతో వడ్డించాలే గానీ , గరిటతో వడ్డించరాదట . అప్పుడు వైశ్వానరుడు తృప్తుడై మనందరినీ కటాక్షించునట్లు చేయవలెనట . అది రాజాజ్ఞయట . మూడు దినములనుండీ వీరు వద్దు వద్దు అంటున్నారు , భార్గవులేమో , ’ రాజధానిలో ఉండి రాజాజ్ఞను మీరుట ఎవరి తరమూ కాదు . మీ పుత్రుడు సర్వజ్ఞుడగునని బుడిలులు చెప్పినారట ? బుడిలుల మాట అంటే రాజభవనములో ఎంత గౌరవమో తెలుసా ? ఆ సర్వజ్ఞునికి మా కానుక అని వారు ఇస్తుంటే , మీ అడ్డము ఏమిటి ? " అని నానా రాద్దాంతము చేసి చివరికి ఒప్పించినారు . ఇది ఒకటయిందా ? "


" సరేనమ్మా " 


" కార్యక్రమము ముగిసిన మరుసటి రోజు ఊరికంతటికీ సమారాధన కావలెనంట. "


" సరే "


         " సరే , ఇదంతా బయటి వ్యవహారమైంది , ఈ ఉపనయనము అంటే పరమ వైదీక కర్మ. ఏదో బుడిలులు ఉండి , అన్నీ చూచుకొని వెళ్ళెదరు , అయినా మన ఆడవారి కర్మలు దేనిని తప్పించుకోగలము ? నువ్వే చెప్పు . అయినా , నేను ఉపనయనాలు మళ్ళీ మళ్ళీ చేస్తానా ?  చెప్పు ? ఇదొకటేగా . దీనిని ఆడంబరముగా చేసితీరవలెను . ఇంకా పది సంవత్సరములైనా ఆడవాళ్ళు , మగవాళ్ళు అందరూ ఈ ఒడుగును గుర్తు చేసుకుంటూ ఉండవలెను , అంత గొప్పగా చేయవలెను . చూడమ్మా , నువ్వు చేయగలనంటే , జంతికలు , ముచ్చార్లు ఎలాగుండాలో తెలుసా ?  అవి చూసి మగవారు కళ్ళు తిప్పుకోలేనట్లుండాలి , పెద్ద కంచములో నయినా , తుంచకుండా ఉంచలేనంత పెద్దగా ఉండాలి . ఉండలు కూడా అలాగే ! తలకాయంత పరిమాణములో ఉండవలెను . ఏమమ్మా ? సరేనా ? "


        ఆలంబిని చిన్నపిల్ల కన్నా ఎక్కువగా , తల్లి వద్ద , కాదు , తల్లి ఒడిలో కూర్చొనుటకూ సిద్ధమై , తన ఆశలను , కోరికలను , ఆడంబరపు అవసరాన్ని , తన అభిప్రాయాలను చెప్పుకున్నది . కూతురి తల నిమురుతూ , " చక్కిలములనైతే పెద్దవిగా చేయవచ్చు , దానికి తగ్గ బాణలి తెప్పించు , అంతే . ఉండలను మన కైవాటము కొద్దీ చేయవచ్చు . అంతకన్నా పెద్దగ చేయుట ఎలా సాధ్యము ? కానిమ్ము , ఎంత పెద్దగా వీలగునో అంత పెద్దగా చేదాము . మరి అప్పడములూ , వడియములూ ? "  అన్నది . 


         " అప్పడములు పెద్దవిగా ఉండవలెను , వడియములు లావుగా ఉండవలెను . నువ్వు తాంబాణి , బాణెల అన్నావు కదా , వాటిని కావాలనే పెద్దగా చేయించినాను . ఒక మూట చక్కిలం పిండి , రెండు మూటలు  వడ్ల పేలాలు , రెండు మూటలు అటుకులు , దానికి కావలసిన ఇతర దినుసులు , ఒక మూట ఉద్ది పిండి , వెలిగారము , నల్లేరు , అన్నీ తెప్పించినాను . అన్నీ ఒకసారి చూసుకో . ఇంకేమైనా కావాలంటే చెప్పు , అవికూడా తెప్పిస్తాను . "


తల్లీకూతుర్లు , సామానులు , దినుసులున్న గదికి చూచుటకు వెళ్ళినారు . 

Janardhana Sharma

కామెంట్‌లు లేవు: