10, నవంబర్ 2024, ఆదివారం

*15 - భజగోవిందం

 *15 - భజగోవిందం / మోహముద్గర*

🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓


*భజగోవిందం శ్లోకం:-13*


*కాతే కాన్తా ధనగత చిన్తావాతుల కిం తవ నాస్తి నియన్తా।*

*త్రిజగతి సజ్జన సంగతిరేకాభవతి భవార్ణవ తరణే నౌకా॥ భజ ||13.*


*ప్రతి॥* వాతుల! = వెట్రివాడా!; తవ = నీయొక్క; నియన్తా = పరిపాలకుడు, నియమించేవాడు; నాస్తి కిం = లేడా యేమి?; తే కాన్తా = నీభార్య; ధనగతచిన్తా = ధన సంబం ధమైన చింత; కా = ఎట్టివి? (ఎందుకొచ్చినవి?); త్రిజగతి = స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలన్నిటి లోనూ; సజ్జన సంగతి = మంచి వారితో స్నేహమనేది; ఏకా = ఒక్కటే; భవార్ణవ = పుట్టుక చావు అనే యీ మహా సముద్రమును; తరణే = దాటుటకుగాను; నౌకా = పడవ; భవతి = అవుతుంది సుమా!


*భావం:-*


వెఱ్రివాడా! ఎందుకు నీ భార్యను గూర్చిన్నీ ధనమును గూర్చిన్నీ చింత చేస్తావు. ధర్మపరిపాలనం చేసే నియంత లేడనుకున్నావా యేమి? ఆయన వుండగా తలుచుకోవడానికి వీళ్ళంతా ఎవరు? స్వర్గ, మర్త్య పాతాళాలు మూడు జగత్తులలో కూడ “చావుపుట్టుకలనే యీ మహార్ణవమును దాటటానికి ఉపాయమైన పడవ “సజ్జన సంగతి'' అనేది సుమా !


*వివరణ:-*


"భార్యను గూర్చి ధనాన్ని గూర్చి, అలా యెందుకు చింతచేస్తావు" అనే పాదానికి బదులు “కాతే కాన్తా ధరగతచిన్తా'' అని, నీ భార్య అధరాలు గూర్చి మనసు లో అలా ఎందుకు మదనపడి పోయేవు అనే పాదం కూడా పాఠాంతరంగా చదువుతారు ఈ శ్లోకంలో జీవితం దేన్ని గురించైనా సరే వెష్ట పడటం వల్ల యే ప్రయోజనము కలుగదు. వెష్టపడటమంటే మనస్సంబంధ మైన శక్తిని వ్యర్థం చేస్తున్నామన్న మాట. ఏ సమస్య గురించైనా మనస్సులో ఇంద్రియ విషయ సంబంధమైన ఆలోచనలు తుఫాను లా రేగినట్లయితే పాపం మనసులో శక్తి అనేదేదీ యిక మిగలదు ఆ సమస్యను ఎదుర్కొని సఫలత బొందటం జరగదు. ఈ వెష్ట - చిన- లేదా బాధ- మనస్సును శరీరాన్ని కూడ అలయజేస్తుంది. వ్యక్తిలో లోపల నున్న చలనాత్మక శక్తిని తినేస్తుంది. జీవిత సమరాన్ని కొనసాగించ టానికి ఆశక్తి యెంతో అవసరం, కనుకనే ఈ ప్రపంచంలో ఫలాని దేదో జరగటం చేత అతడు బ్రతుకు పగులగొట్టుకున్నాడనటం సరికాదు. అతడు బలహీనుడుగా చేయబడటం చేత- పైచెప్పిన విధంగా ప్రపంచములోని సంఘట నలు బలవత్తరమై కనపడు చున్నవి అంతే. ఒక సంగతి మాత్రం నిజం అది సహజ సిద్ధాంతము కూడ అది ఏదంటే బలహీనమయి దేదో అది నాశనమై పోతుంది అని.


 పైన చెప్పిన వెష్ట- ఇంద్రియ విషయముల గూర్చి అనుభవించటం కూడాను అసంగతమైనది కూడాను. పైగా తనకయిన స్త్రీ (లేదా పురుషుని) గూర్చిన చిన్త న్యూనమైనట్టి దనవచ్చు. పాప భూయిష్ట మయినదనవచ్చు. అర్ధాంగీ యింద్రియ విషయా స్వాదనానికి అనువైనట్టి వస్తువు మాత్రమే కాదు. అంతకు మించిన

విషయాలకయి నట్టిది, మాతృత్వమునకు మృదువుగా నుండవలసినట్టి కుటుంబ సభ్యురాలు, ఆమె పవిత్రతను పంకిలం చేస్తూ చింతచేయటం అడుక్కు దిగజారటమే, అందుకనే అలాంటి దిగజారే దురర్థమైన ఆలోచనా పరంపర సాధకుని హృదయంలో లేచినప్పుడు అతడు వాటిని తెగనరకాలి. అరమర లేకుండా పరమేశ్వరుని జ్ఞాపకం చేసికొనటం ద్వారా ఆలోచనలు పవిత్రం చెయ్యాలి. ఈ శ్లోకం ‘‘వాతుల''! అని విషయేంద్రియ లోలుని సంబోధించి చెప్పబడింది. "మూర్ఖులలో మహామహుడా'' అని యర్థము, "వాతుల" అంటే. అయితే అందరూ యిలా ఆలోచించు కొంటూ వ్యక్తిత్వంలో ని జీవశక్తిని ఖాళిచేసికోవడం అలవాటు అయిపోయి వున్నవారే, ఆ గాడిలోనే నడక ఎప్పుడు చూసినా ఈ మనోయానమనే జడతకు మందేమిటి? స్వీయ నాశనానికి దారితీసే యిా పరిష్కారమేమిటి? ఒకే ఒకటి ఉందంటారు శంకరులు. అలవాటు పోవాలంటే "సజ్జన సాంగత్యం" అనేదే పరిష్కార మార్గం, ఎడతెగని నిరంతరమైన సజ్జన సాంగత్యం అవసరం. సజ్జనులంటే తెలిసినవారు, ఆత్మ నిగ్రహం కలవారు, ఒకానొక మతంలో సద్బోధ చేయకలిగిన వారు దూర దృష్టి కలవారు అనవచ్చు. ఈ సాంగత్యం చేసేది మనసు. మనసెక్కడో పెట్టుకొని మందితో సాంగత్యం చేసినంత మాత్రాన చాలదు. సరియైన విధంగా మనసుతో సాంగత్యం చేస్తే మనసు నెమ్మదిగా క్రొత్త క్రొత్త దోవలు త్రొక్కి క్రొత్త ఆలోచనలు చేయటం మొదలు పెట్టుతుంది. అలా నడిచి నడిచి పాత గాడినుంచి తప్పుకొంటుంది. దాన్ని మర్చిపోవటం కూడ కద్దు. ఇది ఒక్కటే పరిష్కార మార్గం. ఇంకొకటేదీ లేదు. 


ఈ సంఘము వస్తువులను గూర్చి ఒక స్వాస్థ్యమైన రీతిని మన ఆలోచనల్లో వృద్ధిచేసి పెట్టుతుంది. అలాటి రీతిని అనుసరిస్తుంటే మన ఆలోచనా ప్రపంచానికి ఒక క్రొత్త ప్రయోజనం క్రొత్త గమ్యం వున్నదా అనిపిస్తుంది. ఆలోచనలు ఇలాగే మారి నూరి మంచికి పురోగమిచినప్పుడు సాధకుడు తనలో తను ఒక క్రొత్త ఉత్తేజము రేకెత్తటం గమనిస్తాడు. ప్రయోజనకరమైన క్షేత్రాలవైపుకు పోవటానికి ప్రయత్నాలు సాగిస్తాడు. అప్పుడు ఈ క్రొత్త వాతావరణం లోని అతడి క్రొత్త జీవితం అతడికి క్షణక్షణాన రోజురోజుకీ మహోన్నతి నందుకొనటానికి దోహదమిస్తుంది. జీవిత పరమావధి యొక్క వినిర్మల స్వరూపం చూడగలుగుతాడు. అతడి జ్ఞాన నేత్రాలు విచ్చుకుంటాయి. తన మార్గమును శీఘ్రంగా గ్రహించగలిగన శక్తి తన గమ్యమును చేరటానికి తెఱువున్నూ, ఇవి రాడారు వంటివి.


భౌతికమైన నిగ్రహం పేరు “దమము”. దీనివల్ల మానసిక శాంతిని పొందవచ్చు. ఆ శాంతి పేరు శమము. ఈ శమము వల్ల ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగిన హృదయం కలవాడికి అంతర్గతంగా సంతృప్తి అనేది కలుగుతుంది. అసంతృప్తి కలిగినప్పుడే మనస్సు యింకా తెలియాలనే ఆసక్తితో స్వయంగా చదివి తెలిసికోవటం ఆరంభిస్తుంది. అది స్వాధ్యాయ మని పిలువబడుతుంది. చదివినది విచారణ చేస్తాము. దీనిని విచారమనే అంటారు. దీనివల్ల పృధులమైన ప్రయోజనం కలుగుతుంది సాధకునికి. అందువల్లనే యిలాంటి జీవితంలోకి అడుగుబెట్టటానికి చేయవలసిన ప్రప్రథమమైన ప్రయత్నమే మిటంటే " సజ్జన సాంగత్యము". ఈ సజ్జన సంగతి అనేది ప్రాథమిక దశలోనేగాక ఆధ్యాత్మిక సాధకుల తరువాత తరువాత వచ్చే అంతస్థుల్లో కూడ ముఖ్యంగా ఆత్మ చైతన్యం వృద్ధి అయేటప్పుడు యెంతో ఉపకరిస్తుంది.


ఈ జీవితం ఒక యాత్ర. ప్రయాణం ఆధ్యాత్మ బోధకుల తోటి సజ్జన సాంగ త్యమున్నూ తోటి వారగు శిష్యులతో సజ్జన సాంగత్య మున్నూ యీ యాత్రలో చివర కూ మనకు యెంతో సహాయం అవుతవి. అందుకనే సజ్జన సంగతి భవార్ణవాన్ని తరించ టానికి నౌక అని రూపకాలంకారంలో వర్ణించారు. నౌక మనలను ఈ సముద్రపు నీళ్ళ లో యీ వైపునుంచి ఆ వైపుకు లాగి పారెయ్యట మొకటేకాదు చేసేది. దాన్ని దాటినం త సేపూ మనలను తడవకుండా నీటినుంచి కాపాడుతోంది. తను తేలుతూ వుంది. ఒక్కొక్క తరంగం వచ్చి విసరి కొట్టుతుంటే నావ తనే ఆ దెబ్బను తిని లోపలి ప్రయాణీకులకు చిన్న కుదుపును మాత్రం ఇచ్చి వూరుకుంటోంది. ఆ తరంగాల ఉపరి భాగంలో పైకి వెళ్ళిపోతూ ప్రయాణం చేసినంతసేపూ కూడ మనలను పొడిగా, హాయిగా వుండేటట్లు చేస్తూంది, సజ్జన సంగతి కూడ అంతే.


తత్త్వము తెలిసిన వారితో సజ్జన సాంగత్యము ఆ విధంగా అంతర్గతంగా వున్న సాధనోపకరణములను రక్షిస్తుంది. అంటే మనోనిగ్రహం వంటి ఉపకరణాలను రక్షిస్తుం దని అర్థం. మరి మనస్సు అనేది అబద్ధపు విలువల వల్ల దురలవాటవు యింద్రియ విషయలోలత్వము వల్ల ఎల్లప్పుడు ఉపేక్షింప బడుతుంటుంది గల వాటినుంచి మనసును రక్షించటానికి యీ సజ్జన సాంగత్యమే మార్గము.


ఈ శ్లోకము శంకరులు చెప్పిన శ్లోకములలో చివరి శ్లోకము. మొదటి పల్లవ మాట వదిలేస్తే ఆయన పన్నెండు శ్లోకములు వ్రాశారు. ఇది పన్నెండవది, ఇవన్నీ కలిసి ద్వాదశ మంజరికా స్తోత్రమనే పేరుతో పిలువ బడుతవి. మిగతావి శంకరుల శిష్యుల ద్వారా చెప్పించబడినవి అంటారు. శిష్యులే చెప్పారు అని అనటానికి కొంత యిబ్బంది వుంది. ఈ పై శ్లోకాలలోని అనేక విషయాలు తిరిగి తిరిగి చెప్పబడినవి అందకని శంకరులచేయి మిగతావాటి యందుకూడ నేరుగా కాకపోయినా యదివరకు కలదేమోన నిపిస్తుంది. ఇంతకూ కొన్ని ప్రచురణములలో యీ పన్నెండు శ్లోకాలే చివర రచయిత పేరూ, అని అని యెందు చెప్పబడ్డవో ఆ సంగతి కూడ వివరించబడింది-- ఏమనంటే----


*ద్వాదశ మంజరికాభిర్యేషః కాధితోవైయా కరణైర్యైషా ఉపదేశోద్భుత విద్యానిపుణః శ్రీమచ్చంకర భగవచ్చరణైః॥ అని*


ఇక తరువాత వచ్చే పదునాల్గు శ్లోకములున్నూ కలిపి, పదునాల్గు పుష్పాలతో చేసిన గుచ్చమన్నట్టు చతుర్దశ మంజరికాస్తోత్రమని పిలువబడుతున్నది. కాశీలో ఆ రోజున శ్రీ శంకరాచార్యుని అనుసరించి వెళ్ళిన పదునాల్గురు శిష్యులునూ ఒక్కొక్క శ్లోకం చొప్పున వీటిని చెప్పినవారని ప్రథ.


*సశేషం*

🌔🌔🌔🌔🌔🌔🌔🌔🌔🌔🌔🌔

కామెంట్‌లు లేవు: