10, నవంబర్ 2024, ఆదివారం

వనభోజనాలు

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*వనభోజనాలు మరియు ఉసిరి చెట్టు క్రింద దీపారాధన విశేషం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*భారతీయ ఆయుర్వేద వైద్యంలో మొక్కలు ఉన్న ప్రాధ్యాన్యత తెలిసిందే. పూర్వకాలం నుంచి మొక్కలను ప్రకృతి వరంగా భావించి పూజిస్తుంటారు. ఇక ఆయుర్వేదంలో ప్రాముఖ్యమున్న చెట్టు ఉసిరి చెట్టు.*


*కార్తీక మాసంలోని ఉషోద వేళల్లో మంచుకురిసే సమయంలో ఉసిరి చెట్టుకింది విష్ణువుని పూజించి ఆహారం ఆ చెట్టుకింద తినడం వలన పుణ్యమని కార్తీకపురాణం చెబుతుంది. ఈ మాసంలో ఉసిరి చెట్టుకింద విష్ణువుకు చేసే పూజ అశ్వమేధయాగ ఫలాన్ని ఇస్తుందని హిందువుల నమ్మకం. కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవి ఇద్దరూ ఉసిరి చెట్టువద్ద కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం.*


*ఉసిరి చెట్టును ధాత్రీ వృక్షం, ఆమలక వృక్షం అంటారు. అందుకే కార్తీక మాసం వనభోజనానికి ధాత్రి భోజనం అని కూడా పిలుస్తారు. ఉసిరి చెట్టు నీడలో అరటి ఆకుల్లో గాని, పనస ఆకుల్లోగాని భోజనం చేయటం మంచిదని మన పెద్దలు చెబుతారు.*


*సూత మహర్షి మునులతో కలసి నైమిశారణ్యంలో కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి చెట్టు క్రింద వన భోజనాలు చేసినట్లు కార్తీక పురాణంలో వివరించారు.*


*శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితోపాటు తోటి గోప బాలురతో కలసి ఉసిరి చెట్టు నీడన వన భోజనాలు చేశాడని భాగవతంలో వర్ణించారు.*


*వన భోజనాలు చేయటానికి ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి చిత్రపటాన్ని ఉంచి పూజలు నిర్వహిస్తారు. ఉసిరికాయల్లో దీపారధన చేస్తారు. ఉసిరి చెట్టుక్రింద భోజనం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్మకం. ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. కార్తీక మాసంలోని వనభోజనాలను ఆదివారాలు , ఇతర సెలవు రోజులతో పాటు.. సమీప ఉద్యాన వనాలలో, తోటల్లో, నదీతీర ప్రాంతంలో, సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంటారు. పిల్లలు, పెద్దలు సంతోషంగా గడుపుతారు.*


*వన భోజనానికి ఎంచుకునే ప్రదేశం అత్యంత పవిత్రంగా ఉండాలి. వన భోజనాలకు రకరకాల పల, పుష్ప, వృక్షాలు కలిగి ఏటి ఒడ్డున ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకోవడం ఉత్తమం. అక్కడ తప్పనిసరిగా ఉసిరి చెట్టు ఉండాలి. తులసివంటి మొక్కలు కూడా ఉంటే మరీ మంచిది. బయట నుండి తెచ్చినవి కాకుండా ఆహార పదార్థాలు అక్కడే వండుకోవాలి. ఉసిరి చెట్టుకి ఎనిమిది వైపులా దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలని, ఈ ఉసిరి పత్రితో విష్ణువుకి పూజ చెయ్యాలని పెద్దలు అంటుంటారు.*


*ఈ కాలంలోనే ఉసిరి కాయలు బాగా వస్తాయి. ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవినిలాంటిది. రోజూ ఉసిరి ఏదో ఒక రూపంలో మనం తినాలి. ఇందులో షడ్రుచులలోని చేదు తప్ప మిగతా ఐదు రుచులు వున్నాయి.*


*ఓం శ్రీతులసీధాత్రీ సమేత లక్ష్మీనారాయణాయ కార్తీక దామోదరాయ నమః ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: