10, నవంబర్ 2024, ఆదివారం

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర..*


*మంత్రోచ్చారణ..తత్వ బోధ..*


*(నాలుగవ రోజు)*


ఆదిత్యహృదయం స్తోత్రాన్ని అప్పజెప్పమన్న శ్రీ స్వామి వారి ఆదేశం మేరకు ప్రయత్నించినా.. మొదటి శ్లోకం కూడా చెప్పలేకపోయిన ప్రభావతి గారి ఎదురుగ్గా కూర్చున్న శ్రీ స్వామి వారు..ప్రశాంతంగా ఆ దంపతులను చూస్తూ..


"చూసావా తల్లీ!..నాకు కంఠస్తం కాని స్తోత్రాలు లేవని నువ్వు అనుకున్నావు..కానీ రోజూ క్రమం తప్పకుండా చేసే స్తోత్రాన్నే మరచిపోయావు..దీనినే మాయ అంటారమ్మా..సరే..ఇద్దరూ శ్రద్ధగా వినండి..ఈ సృష్టిలో ఓంకారం మొదలుకొని..పంచాక్షరి..అష్టాక్షరి..శక్తి బీజాలు..ఇలా సర్వమంత్రాలూ కొన్ని కోట్లు ఉన్నాయి..ప్రతి మంత్రానికి ఒక నిర్దుష్టమైన అర్ధమూ..ఉచ్చారణ క్రమమూ.. ఉచ్చరించిన తరువాత కలిగే నాడీమండల స్పందన..అది సాధనచేయగా సమకూరే ఫలితమూ.. స్పష్టంగా ఉంటాయి..


"నాకిన్ని మంత్రాలు వచ్చు!"..


"నాకిన్ని స్తోత్రాలు కంఠతా వచ్చు!"..


"నేను ఇంత జపం చేసాను!.."


అనుకుంటూ చేసే పూజ అహంకారం తో కూడినది....అది పూజకు మొదటి సోపానమే అయినా..రజోగుణపూరితమైనది..


"సప్తకోటి మహామిత్ర చిత్త విభ్రమ కారకః" అన్నట్లుగా ..మంత్రాలు పూజలు ఒక మెట్టు వరకూ మనిషిని తీసుకువెళతాయి..రకరకాల మంత్రాలు జపిస్తే..తికమక తప్ప మరేదీ సిద్దించదు.. అయితే..సద్గురువు లభించి మంత్రోపదేశం చేసినప్పుడు ఆ మంత్రం ఒక్కటే కోటి జపం పూర్తయ్యేసరికి..మంత్రసిద్ది కలిగించి..ముక్తి మార్గాన్ని సుగమం చేస్తుంది..ఇప్పటిదాకా నీవు చేస్తున్న పూజలన్నీ..గృహస్థాశ్రమంలో ఉంటున్న నీకు రక్షాకవచాలుగా పనికివస్తాయి..


సర్వస్య చాహం హృద్ధి సన్నివిష్టో మత్తః 

స్మృతిర్ జ్ఞానమపోహనం చ ౹

వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో 

వేదాంతకృద్వేదవిదేవ చాహం౹౹ (భగవద్గీత 15 / 15)


"సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే!..నానుండియే స్మృతి , జ్ఞానము, అపోహనము (సందేహనివృత్తి) కలుగుచున్నవి..వేదముల ద్వారా తెలిసికొనదగిన వాడను నేనే!..వేదాంతకర్తను, వేదజ్ఞుడను కూడా నేనే!.." 


అని కదమ్మా భగవానుడు గీతలో చెప్పింది..మరణపు అంచుల్లో వున్న రోగికి వాడవలసిన ఔషధం..అక్కడ వైద్యం చేస్తున్న వైద్యుడికి గుర్తుకువచ్చి, ఆ ఔషధాన్ని ఆ రోగికి ఆ సమయంలో ఇచ్చి, అతని ప్రాణం కాపాడబడితే..అది దైవలీల!..అలాగే అదే రోగికి ఆయుష్షు తీరిపోయివుంటే..ఆ వైద్యుడికి మరపు కలిగించి..సరైన ఔషధం గుర్తుకురాకుండా చేసి..ఆవ్యక్తి మరణించడం కూడా దైవలీలే!..


"నేను చేస్తున్నాను!..ఈపూజను ఇంత పని వుండికూడా నేను రోజూ చేస్తున్నాను!.." అనే అహంతో కాకుండా.."స్వామీ!..నీవు చేయిస్తున్నావు..!" అనే శరణాగతి తో చేసే పూజ ఉత్తమోత్తమమైనది..అటువంటి పూజకొరకే మన మహర్షులు ముందుగా నామపూరితమైన విగ్రహారాధనను తొలిమెట్టుగా చేసి, సాధారణ మానవుల కోసం  ఏర్పాటుచేసారు!.."


ఒక్కక్షణం స్వామివారు తాను చెప్పడం ఆపి..ఆ దంపతుల వైపు చూసారు.. మంత్రముగ్ధుల్లా వింటున్నారిద్దరూ..ఒకే రాతి క్రింద ఏర్పడిన గుహలాంటి ఆ పార్వతీదేవి మందిరంలో అప్పటిదాకా స్వామివారు చెపుతున్న మాటలు ఆ ఇద్దరి హృదయాలలో ప్రతిధ్వనిస్తున్నాయి..


"అమ్మా..ఆదిత్యహృదయాన్ని ఇప్పుడు చెప్పు..మరలా ఇప్పుడు ప్రయత్నం చేయి తల్లీ!.." అన్నారు స్వామి వారు నవ్వుతూ..ప్రభావతి గారు సందేహించారు..ఈసారన్నా తాను ఆ ఆదిత్యహృదయ స్తోత్రాన్ని చెప్పగలనో..లేదో..అని మనసులో సందేహం..


"ఇప్పుడు చదువుతావు..పర్లేదమ్మా..చెప్పు..నేను వింటాను!.." అన్నారు స్వామివారు మరలా నవ్వుతూ..


స్తోత్ర పఠన విధి విధానం..స్వామి వారు తెలియచెప్పడం..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: