8, అక్టోబర్ 2020, గురువారం

15-17-గీతా మకరందము

 

         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - వారిరువురికంటెను వేఱైనట్టి ఉత్తమపురుషునిగూర్చి వచించుచున్నారు -


ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః |

యో లోకత్రయమావిశ్య 

బిభర్త్యవ్యయ ఈశ్వరః || 


తాత్పర్యము:- ఎవడు మూడులోకములందును ప్రవేశించి వానిని భరించుచున్నాడో, అట్టి నాశరహితుడును, జగన్నియామకుడును, (పైనదెల్పిన క్షరాక్షరులిద్దఱికంటెను) వేఱైనవాడును నగు ఉత్తమపురుషుడు పరమాత్మయని చెప్పబడుచున్నాడు.


వ్యాఖ్య:- పైన దెలిపిన నశ్వరదేహాభిమానికంటెను, చిత్ - ప్రతిబింబరూపుడగు జీవుని (మనస్సుయొక్క అభిమాని) కంటెను వేఱుగ ఆత్మ కలడు. ఆతడే ఉత్తమపురుషుడని యిట వచింపబడెను. ఏలయనిన, క్షణికమగు దేహము యొక్క అభిమాని కంటెను, బద్ధుడగు జీవుని (మనస్సు యొక్క అభిమాని) కంటెను ముక్తుడగు ఆత్మ శ్రేష్ఠుడుగదా! జీవుడు త్రిగుణసహితుడు. పరమాత్మ త్రిగుణరహితుడు, గుణాతీతుడు. ఇక్కారణమున ఆతడు తక్కిన ఇద్దఱు క్షరాక్షరపురుషులకంటెను ఉత్తముడుగ పరిగణింపబడి ‘ఉత్తమపురుషుడ'ని లేక పురుషోత్తముడని వ్యవహరింపబడుచున్నాడు.

ప్రపంచములో కొందఱు "దేహస్థితి” యందును, కొందఱు "జీవస్థితి”యందును ఉండుచుందురు. వారిరువురును సామాన్యపురుషులు, ఆత్మయందుండువాడే ఉత్తమ పురుషుడు. అట్టి ఉత్తమపురుషత్వమును, లేక పురుషోత్తమత్వమును సర్వులును ప్రయత్నపూర్వకముగ సంపాదించ వలయును. ఎల్లకాలములందును 'పురుష’ (జీవ) స్థితిలోనే అనగా బద్ధజీవితములోనే యుండుట విజ్ఞులకు పాడికాదు. క్రమముగ దేహస్థితిని, జీవస్థితిని (మనస్స్థితి, పురుషస్థితి) దాటి సాక్షియగు ఆత్మయొక్క స్థితికి అనగా పురుషోత్తముని స్థితికి వచ్చినవాడే ధన్యుడు, సర్వశ్రేష్ఠుడు. అట్టి స్థితియే జీవితము యొక్క పరమావధి, పరమలక్ష్యము. దానిచే జన్మ సార్థకమగును. తక్కిన ఏయితర క్రియలచేతను ఈ మానవజన్మ సార్థకతను బొందలేదు.


"అన్యః” అని చెప్పినందువలన పరమాత్మ దేహముయొక్క అభిమానికంటె జీవునికంటె (మనస్సుయొక్క అభిమానికంటె) వేఱుగనున్నాడని, వానికి సాక్షిగ వెలయుచున్నాడని తెలియుచున్నది. కాబట్టి జీవుడు ఆ దేహసంబంధ, జీవసంబంధ (మనస్సంబంధ) వికారములు తనకు వాస్తవముగ లేవని, తాను నిర్వికార అవ్యయ ఆత్మయని నిశ్చయముచేసికొని, అట్టి ఆత్మస్థితియందే సదా యుండులాగున అభ్యసించవలెను.

ఆ పరమాత్మ యెట్టివాడో తెలిసికొనినచో, ఆతని మహిమను ఎఱిగినచో, ఆతనిపై విశ్వాసము బాగుగ కలుగగలదు. ఇచ్చోట పరమాత్మకు రెండు విశేషణములు చెప్పబడినవి - అతడు (1) సర్వలోకధారకుడని (2) అవ్యయుడని. ముల్లోకములందును లెస్సగ ప్రవేశించి, అంతర్యామిరూపుడై వానిని భరించుచు, ఈశ్వరుడై యతడు వెలయుచున్నాడు. ముజ్జగంబులందును ఎల్లెడల ఆతడు నిండి నిబిడీకృతుడైయున్నాడు. మఱియు నాతడు అవ్యయుడు, నాశములేనివాడు. దేహాది దృశ్యపదార్థములన్నియు, తుట్టతుదకు చిత్ - ప్రతిబింబరూపుడగు జీవుడున్ను ఒకానొక కాలమున అంతరించియే పోవుదురు (మోక్షప్రాప్తిసమయమున జీవత్వము తొలగిపోవును గావున). పరమాత్మయో ఏ కాలమందును నశింపడు; కావున అట్టి అవ్యయ ఆత్మపదముకొఱకే, పురుషోత్తమస్థితి కొఱకే సర్వులును ప్రయత్నించవలెను. క్షణికములగు అల్పప్రాపంచికవస్తువులకై, పదవులకై పరుగిడుట ఉత్తమము కాదు.


ప్రశ్న:- ఈ క్షరాక్షరములకంటె వేఱైన వాడెవడైనకలడా?

ఉత్తరము:- కలడు. ఆతడే ఉత్తమపురుషుడు (పురుషోత్తముడు).

ప్రశ్న:- ఆతడెట్టివాడు?

ఉత్తరము:- (1) ముల్లోకములందును ప్రవేశించి వానిని భరించువాడు. జగన్నియామకుడు. (2) నాశరహితుడు.

ప్రశ్న:- కాబట్టి ఫలితాంశమేమి?

ఉత్తరము:- క్షర (దేహ), అక్షర (జీవ) భావములనుదాటి పురుషోత్తమభావమును, లేక పరమాత్మ భావమును అవలంబించవలెను.

కామెంట్‌లు లేవు: