దశిక రాము
" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"
అవతారిక:
ఈశ్వరుడొక్కడే మోక్ష ఫలములను ఈయగలవాడు. అందువల్లనే తాము
మంచి పదవులలో ఉండికూడా ,మోక్షపదవిని కోరి , విష్ణువూమొదలైన
దేవతలు తిరిగి తిరిగీ ఈశ్వరునే సేవిస్తున్నారు. అందువల్లనే శంకరులు
మోక్షాన్ని చ్చే పరమ శివుని నుండియే ,తన హృదయ గ్రంథి ఛేదనాన్ని
కోరుతున్నారు.
శ్లో " " త్వమేకో లోకానాం _ పరమ ఫలదో దివ్య పదవీం
వహంత స్త్వన్మూలాం _ పునరపి భజంతే హరిముఖాః
కియద్వా దాక్షిణ్యం తవ శివ ! మదాశా చ కియతీ
కదా వా మద్రక్షాం _ వహసి కరుణా పూరిత దృశా " !!
పదవిభాగం :
త్వం _ ఏకః _ లోకానామ్ _ పరమఫలదః _ దివ్యపదవీమ్ _ వహంతః
త్వన్మూలామ్ _ పునః _ అపి _ భజంతే _ హరిముఖాః _ కియత్ _ వా _
దాక్షిణ్యమ్ _ తవ _ శివ _ మదాశా _ చ _ కియతీ _ కదా _ వా _ మద్రక్షామ్ వహసి _ కరుణాపూరితదృశా..
తాత్పర్యం :
శంకరా ! ఓ మహదేవా ! ముల్లోకములకునూ, ఉత్కృష్టఫలమైన మోక్ష
ఫలమును ఇచ్చేవాడవు నీవొక్కడవే. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన
వారు , నీ దయ చేతనే విష్ణుత్వము, బ్రహ్మ త్వము, ఇంద్రత్వము మొదలైన
పదవులను పొందినవారైనా, విష్ణు, బ్రహ్మేద్రాదులు అంతకంటెనూ ఉన్నత మైన మోక్షఫలాన్ని పొందడం కోసం , మఱలా,మఱలా నిన్ను సేవిస్తూ ఉన్నారు. ఆహా ! భక్తుల మీద నీకు ఎంత దయయో ! నా ఆశ ఎంత అని చెప్పను ? శివా ! సంపూర్ణ కటాక్షముతో అహంభావమును పోగొట్టి నన్ను రక్షింౘుము.
వివరణ :
నేను పరమ ఫలాన్ని _ అనగా నీ సాయుజ్యాన్ని, సాలోక్యాన్ని,
సామీప్యాన్ని, సారూప్యాన్ని కోరుతున్నాను. దానిని నాకు అనుగ్రహింౘ
గలవాడవు నీవొక్కడవే. కాబట్టి నేను నిన్ను తప్ప ఇంకొకరిని ఆశ్రయింౘ
లేను. నేను విష్ణువు మొదలైన దేవతలను ఆశ్రయిస్తే ,ఫలం ఏముంటుంది ?
ఏమంటే వారే నిన్ను సేవిస్తున్నారు కదా ! నేను కూడా విష్ణుమూర్తి ,బ్రహ్మ,
ఇంద్రుడు మొదలయిన దేవతల మార్గాన్నే అనుసరించి , ఈశ్వరుడైన
నిన్నే సేవిస్తే , నీ సాయుజ్య రూపమైన ఎప్పటికో అప్పటికి తప్పక నాకు
లభిస్తుంది కదా !
ఈశ్వరా ! నారక్షణను అనగా నా హృదయగ్రంథి ఛేదనను ఎప్ప్పుడు చేస్తావో,
ఎప్పుడు నాకు నీ పాదసేవా భాగ్యాన్ని కల్పించి రక్షిస్తావో అది నీ ఇష్టము.
సకామ భక్తి స్వర్గాది ఫలములనిస్తుంది. అకామ భక్తి జన్మరాహిత్యాన్ని ఇస్తుంది. భుక్తిని కానీ ,ముక్తిని కానీ కోరుకొనకుండా , కేవలమూ భగవత్పాద సేవను మాత్రమే కోరుకోవడమన్నది మహత్తరమైన విషయము. అలా కోరుకొనే భక్తుడికి భగవంతుడు తనను తానే ఇౘ్చుకొంటాడు.
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి