8, అక్టోబర్ 2020, గురువారం

శ్రీమద్భాగవతము

 **దశిక రాము**


**శ్రీమద్భాగవతము**


 తృతీయ స్కంధం -41


చంద్రసూర్యపితృ మార్గంబు 


సంసారానికి కట్టుబడిన గృహస్థులు ధర్మార్థకామాలపై ప్రీతి కలిగి వాటితోనే సంతుష్టులై వాటిని సాంధించడంలోనే మునిగి తేలుతూ ఉంటారు. వేదాలలో నిర్ణయింపబడిన భాగవత ధర్మాలకూ భగవద్భక్తికీ విముఖులై ఉంటారు. దేవగణాలను నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. పితృకార్యాలను భక్తితో చేస్తూ సదాచార సంపన్నులై ఉంటారు. కానీ ఇట్లా దేవతలకూ పితరులకూ సంబంధించిన సత్కర్మలను ఆచరించడంలోనే నేర్పరులై, కోర్కెలు నిండిన చిత్తం గలవారై ఉండి మోక్షాన్ని అందుకోలేరు. వారు ధూమ్రాది మార్గాలలో చంద్రలోకం చేరి అచ్చట సుఖాలు అనుభవించి పుణ్యం తరిగి నశింపగా మళ్ళీ జన్మ ఎత్తడం కోసం భూలోకానికి వస్తారు. అంతేకాక...అత్యంత నిర్మలమైన ఆదిశేషుని పానుపుమీద హరి యోగనిద్రలో మునిగి ఉన్న సమయంలో సమస్త లోకాలూ ప్రళయాన్ని పొందుతాయి. అటువంటి సర్వేశ్వరుణ్ణి బుద్ధిమంతులైనవారు (ధ్యానిస్తారు) ఆ బుద్ధిమంతులు తమ భక్తిప్రపత్తులతో తమతమ ధర్మాలన్నింటినీ పద్మనాభునికే సమర్పించి, ప్రశాంత చిత్తులై, సర్వసంగ పరిత్యాగులై, పుండరీకాక్షుని ఆరాధన తప్ప ఇతర ధర్మాలనుండి దూరంగా ఉంటూ, నిత్యం ఆ దైత్యారినే ధ్యానిస్తూ (ఉంటారు).ఇంకా అహంకార, మమకారాలను వదిలి ప్రవర్తిస్తూ వెలుగు త్రోవల పయనించేవాడూ, గొప్ప చరిత్ర కలవాడూ, విశ్వమంతా నిండినవాడూ, పవిత్రమైన కీర్తి కలవాడూ, లోకాల సృష్టి స్థితి లయలకు కారణమైనవాడూ, నాశనం లేనివాడూ, జన్మరహితుడూ, శ్రేష్ఠులలో శ్రేష్ఠుడూ, పురుషోత్తముడూ, క్రొత్త తామరలవంటి కన్నులు కలవాడూ అయిన సర్వేశ్వరునిపై బుద్ధి నిలిపి, పునర్జన్మ లేని మహనీయమైన మార్గంలో స్వచ్ఛమై ఆనందమయమై తేజస్సుతో వెలిగిపోయే దివ్యపదాన్ని పొంది సుఖించే ధీరులు పునర్జన్మలను పొందడానికి ఎన్నటికీ భూమిపైకి తిరిగిరారు. ఇంకా పరమేశ్వరుడనే దృష్టితో బ్రహ్మదేవుణ్ణి ఉపాసించేవారు సత్యలోకంలో రెండు పరార్థాల కాలం తరువాత వచ్చే ప్రళయం వరకు పరుడైన చతుర్ముఖుని పరమాత్మ రూపంలో ధ్యానిస్తూ ఉంటారు. సర్వేశ్వరుడు భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలను, మనస్సును, పంచేంద్రియాలను, పంచతన్మాత్రలను, వాటితో కూడిన సమస్త ప్రకృతినీ, సకల లోకాలనూ తనలో లీనం చేసుకుంటాడు. అప్పుడు సత్యలోకంలో నివసించే ఆత్మస్వరూపులు బ్రహ్మతో కూడ పరమానంద స్వరూపుడూ, సర్వోత్కృష్టుడూ అయిన పురాణపురుషునిలో లీనమౌతారు. కాబట్టి అమ్మా! నీవు సకల ప్రాణుల హృదయ పద్మాలలో నివసించేవాడూ, మహానుభావుడూ, నిష్కలంకుడూ, నిరంజనుడూ, అద్వితీయుడూ అయిన పురుషోత్తముణ్ణి శరణుపొందు” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.సమస్త చరాచర ప్రాణికోటికి అధీశ్వరుడు, పవిత్రాలైన వేదాల పుట్టుటకు కారణభూతుడు, సర్వశ్రేష్ఠుడు అయిన పరమేశ్వరుడు యోగీంద్రులు, సనకాది కుమారులు, సిద్ధులు, మునులు, దేవతలు భక్తియోగంతో తనను భజింపగా వారికి సగుణస్వరూపంతో దర్శనమిస్తాడు. అటువంటి సర్వేశ్వరుడు ఆయా సమయాలలో తన మహనీయ గుణగణాల కలయికచే అనేక రూపాలలో అవతరిస్తూ ఉంటాడు. ఈ విధంగా అతని అంశలు పంచుకొని పుట్టిన ఋషులు, దేవతలు తమ కర్మఫలాన్ని అనుసరించి పౌరుషంతో ఐశ్వర్యం, పారమేష్ఠ్యం మొదలైన అధికారాలు చేపట్టి కొంతకాలం అనుభవించి, యథాస్థానానికి తిరిగి వస్తారు. మరికొందరు కర్మానుసారమైన మనస్సు కలవారై, ధర్మమందు శ్రద్ధ కలవారై, ధర్మానికి విరుద్ధం కాకుండునట్లుగా, నిత్యమూ తాము చేయదగిన ఆచారాలను నిర్వర్తిస్తూ, రజోగుణంతో నిండిన మనస్సు కలవారై...కామప్రవృత్తికి లోబడి ఇంద్రియాలను జయింపలేక పితృదేవతలను అనుదినం ఆరాధిస్తూ గృహాలలో పడి సంసార నిమగ్నులై జీవిస్తూ, హరిపరాఙ్ముఖులై, ధర్మార్థకామాలను మాత్రమే నమ్ముకొని వర్తిస్తారు. అటువంటి వారు త్రైవర్గిక పురుషులని పిలువబడతారు. శుభగుణవిశిష్టుడు, అద్వితీయ పరాక్రముడు అయిన త్రివిక్రముని భజిస్తూ ఆయన మహిమలనే మననం చేస్తూ ఆయన మధుర కథాసుధను తనివితీరా త్రాగడం ఉత్తమలక్షణం. అలాకాకుండా మరికొందరు ఊరబంది అవివేకంతో తీయతీయని నేతివంటకాలను కాలదన్ని మలభక్షణకై పరుగెత్తినట్లుగా చెడ్డకథలను వింటూ ఆనందిస్తూ ఉంటారు. ధూమమార్గాల గుండా వెళ్ళి, పితృలోకం చేరి సుఖించేవాళ్ళు తమ పుణ్యం తరిగిపోగానే మళ్ళీ ఈ భూమిమీద తమ బిడ్డలకే బిడ్డలై జన్మిస్తారు. వశం తప్పిన మనస్సుతో మాతృగర్భంనుండి బయటపడింది మొదలుగా శ్మశాన భూమికి చేరే పర్యంతం ఆయా కర్మఫలాలను ఇక్కడే అనుభవిస్తాడు. కాబట్టి ఓ తల్లీ! నీవు...విను. సర్వశ్రేష్ఠుడు, పాపరహితుడు, అనంతుడు, అధీశ్వరుడు, పురుషోత్తముడు అయిన పరమేశ్వరుణ్ణి అన్నిరీతులా సద్బుద్ధితో సంతోషంగా సేవించు. దానివల్ల పునర్జన్మం లేని కైవల్యం నీకు లభిస్తుంది.” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు. “పరమేశ్వరుడైన వాసుదేవుని యందు అభివ్యక్తమైన భక్తియోగం బ్రహ్మసాక్షాత్కారానికి సాధనాలైన జ్ఞానాన్నీ వైరాగ్యాన్నీ కలుగజేస్తుంది. అటువంటి భగవద్భక్తితో కూడిన చిత్తం ఇంద్రియ వ్యాపారాలలో సమంగా వర్తిస్తుంది. అటువంటి మనస్సు కలవానికి హెచ్చుతగ్గులు, ప్రియాప్రియములు, విషయ లాలస, గ్రహింప దగినవీ, తిరస్కరింప దగినవీ ఉండవు. సర్వత్ర సమదర్శన మేర్పడుతుంది. తనలో ఉన్న ఆత్మ స్వరూపాన్ని తాను చూడగలుగుతాడు. జ్ఞానస్వరూపుడు, పరబ్రహ్మ, పరమాత్ముడు, ఈశ్వరుడు అయిన పరమేశ్వరుడు ఒకే రూపం కలవాడై ఉండికూడా కనబడే రూపాన్ని బట్టీ, చూచేవారినిబట్టీ, చూడటానికి ఉపయోగపడే సాధనాలనుబట్టీ వేరువేరు రూపాలలో గోచరిస్తాడు. ఇదే యోగి అయినవాడు సంపూర్ణ యోగంవల్ల పొందదగిన ఫలం. కావున విషయాలనుండి వెనుకకు మరలిన ఇంద్రియాలవల్ల జ్ఞాన స్వరూపమూ, హేయగుణ రహితమూ అయిన పరబ్రహ్మ దర్శనం లభిస్తుంది. ఆ పరబ్రహ్మమే మనస్సు యొక్క భ్రాంతి వలన శబ్దం స్పర్శం మొదలైన వాని ధర్మాలైన అర్థాల స్వరూపంతో గోచరిస్తున్నది. ఆ పరబ్రహ్మం అర్థస్వరూపంతో ఎట్లా కనిపిస్తుందని నీకు సందేహం కలుగవచ్చు. అహంకారం గుణరూపం ధరించి సత్త్వరజస్తమస్సులై మూడు విధాలుగానూ, భూతరూపం ధరించి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలనే అయిదు విధాలుగానూ, ఇంద్రియరూపం ధరించి పదకొండు విధాలుగానూ ఉంటుంది. ఈ విధంగా అహంకారమే నానావిధాలుగా భాసిస్తుంది. విరాట్పురుషుడు జీవస్వరూపుడు. జీవరూపమైన ఈ జగత్తు అనే గ్రుడ్డులో అతడు నిండి ఉంటాడు. ఈ పరమ రహస్యాన్ని శ్రద్ధా సహితమైన భక్తితోనూ, యోగాభ్యాసంతోనూ, నిశ్చల చిత్తం కలవాడై వైరాగ్యం పొందినవాడు దర్శిస్తాడు. అమ్మా! నీవు జ్ఞాన సంపన్నులైన పెద్దలు పూజింపదగిన చరిత్ర గలదానవు. కాబట్టి నీకు ఈ విషయమంతా వెల్లడించాను. సమస్త యోగసాధనలవల్ల పొందదగిన పరబ్రహ్మను నిర్గుణుడని జ్ఞానయోగులు పలుకుతున్నారు. నేను చెప్పిన భక్తియోగం ఆ పరమాత్మను సగుణుడుగా పేర్కొంటున్నది. వాస్తవానికి జ్ఞానయోగం భక్తియోగం రెండూ ఒక్కటే. ఇంద్రియాలు వేరువేరు రూపాలతో ఉంటాయి. అందువల్లనే ఒకే రూపంలో ఉండే వస్తువు అనేక విధాలుగా తోచినట్లు, ఒకే పరమాత్మ అనేక విధాలుగా గోచరిస్తున్నాడు. అమ్మా! నారాయణుడు సమస్త శాస్త్రాలను చదివినందువల్లను, అనుష్ఠానాలూ యజ్ఞాలూ తీర్థయాత్రలూ జపతపాలూ ఆచరించినందువల్లనూ కనిపించడు. వేదాలు అధ్యయనం చేయడం వల్లనూ, యోగాభ్యాసాల వల్లనూ, దానాలూ వ్రతాలూ చేసినందువల్లనూ గోచరింపడు. చంచలమైన మనస్సును లోగొని చెలరేగిన ఇంద్రియాలను జయించి, కర్మ లన్నింటినీ భగవదర్పితం చేసి, ఆత్మస్వరూపాన్ని గుర్తించి, తరిగిపోని వైరాగ్యంతో ఫలితాలను అపేక్షించకుండా ప్రవర్తించే పురుషుడు మాత్రమే దుర్గుణాలను దూరం చేసుకొని పాపాలను పటాపంచలు గావించి అనంత కళ్యాణ గుణ విశిష్టుడు పరమాత్మ అయిన ఆ హరిని చేరగలుగుతాడు.అందువల్ల నీకు నాలుగు విధాలైన భక్తి మార్గాలను విశదంగా తెలియజెప్పాను. అంతేకాక స్వేచ్ఛారూపమైన నా సంకల్పం ప్రాణులందు జనన మరణ రూపాలతో ఉంటుంది. అజ్ఞానంతో ఆచరించే కర్మల మూలంగా కలిగే జీవుని ప్రవర్తనలు అనేక విధాలుగా ఉంటాయి. జీవాత్మ అటువంటి అకర్మలు ఆచరిస్తూ అత్మస్వరూపం ఇటువంటిది అని తెలియని స్థితిలో ఉంటాడు” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు. “ఇటువంటి అతిరహస్యమైన సాంఖ్యయోగ పద్ధతి దుష్టునకు, నీతి హీనునకు, మూర్ఖునకు, దురాచారునకు, డంబాలు కొట్టేవానికి, ఇంద్రియ సుఖాలకు లోబడిన వానికి, పిల్లలూ ఇల్లాలూ ఇల్లూ మొదలైన వానిపై ఆసక్తి కలవానికి, భగవంతునిపై భక్తి లేనివానికి, విష్ణు భక్తులను ద్వేషించే వానికి ఉపదేశింపకూడదు. శ్రద్ధాసక్తుడు, భక్తుడు, వినయసంపన్నుడు, ద్వేషరహితుడు, సర్వప్రాణులను మైత్రీభావంతో చూచేవాడు, విజ్ఞాన విషయాలను వినాలనే అసక్తి కలవాడు, ప్రాపంచిక విషయాలపై విరక్తుడు, శాంతచిత్తుడు, మాత్సర్యం లేనివాడు, స్వచ్ఛమైన మనస్సు కలవాడు, భక్తులందు ప్రేమ కలవాడు, పరస్త్రీలను మంచి భావంతో చూచేవాడు, చెడు కోరికలు లేనివాడు అయిన వానికి మాత్రమే ఈ సాంఖ్యయోగం ఉపదేశింప తగినది. అటువంటివాడే ఇందుకు అర్హుడైన అధికారి. ఈ ఉపాఖ్యానాన్ని ఏ పురుషుడైనా, పతివ్రత అయిన ఏ స్త్రీ అయినా శ్రద్ధాభక్తులతో నాపై మనస్సు నిలిపి వినినా, చదివినా అటువంటి పుణ్యాత్ములు నా దివ్య స్వరూపాన్ని పొందుతారు” అని కపిలుడు దేవహూతితో చెప్పాడని చెప్పి మైత్రేయుడు విదురుణ్ణి చూచి ఇంకా ఇలా అన్నాడు. “ఈ విధంగా కర్దమమహర్షి అర్ధాంగి అయిన దేవహూతి కపిలుని ఉపదేశం విని, మోహం తొలగిపోగా అతనికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి, పరబ్రహ్మకు సంబంధించిన తాత్త్వికమైన సాంఖ్య జ్ఞానంతో కపిలుణ్ణి స్తోత్రం చేయడం ప్రారంభించి ఇలా అన్నది. ఇంద్రియాలతో, ఇంద్రియార్థాలతో, మనస్సుతో, పంచభూతాలతో నిండి సమస్త జగత్తుకు బీజభూతమై సత్త్వరజస్తమోగుణ ప్రవాహానికి మూలకారణమై నారాయణుడనే నామంతో నీ దివ్యమంగళ విగ్రహం తేజరిల్లుతూ ఉంటుంది. అటువంటి నీ కళ్యాణమూర్తిని నీ నాభికమలం నుండి జన్మించిన చతుర్ముఖుడే సాక్షాత్తుగా దర్శించలేక ఎలాగో తన మనస్సులో కనుగొన గలిగాడు. అలా చూచి నీ అనుగ్రహంవల్ల అనేక శక్తులను తనలో వ్యక్తీకరించుకొని వేలకొలది శక్తులతో కూడినవాడై ప్రవాహరూపమైన ఈ విశ్వాన్ని సృజింప గల్గుతున్నాడు. సృష్టి సంబంధమైన సర్వకార్యాలను నిర్వహింప గలుగుతున్నాడు. అప్పుడు...మహాప్రళయ సమయంలో సమస్త భువన సముదాయాన్ని నీ ఉదరంలో పదిలంగా దాచుకొని మహాసాగర మధ్యంలో మఱ్ఱి ఆకు పాన్పుమీద మాయాశిశువుగా ఒంటరిగా శయనించి ఉంటావు. మహానుభావా! ఆ విధంగా వటపత్రశాయివైన నీవు లీలగా నీ కాలి బొటనవ్రేలిని నోటిలో నుంచుకొని అందలి అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటావు. అటువంటి నీవు నా పూర్వపుణ్య విశేషంవల్ల ఇప్పుడు నా కడుపున పుట్టావు. అటువంటి పరమాత్మ స్వరూపుడవైన నీవు...అవతారాలమీద ముచ్చటపడి వరుసగా రఘురాముడుగా, కృష్ణుడుగా, వరాహస్వామిగా, నరసింహమూర్తిగా ఆకారాలు ధరించి దుష్టశిక్షణం, శిష్టరక్షణం చేస్తావు. ఉత్తమ ధర్మంపట్ల ప్రవృత్తమైన చిత్తం కల భక్తులకు జ్ఞానదృష్టిని ప్రసాదించటం కోసం వాసుదేవ సంకర్షణ అనిరుద్ధ ప్రద్యుమ్న వ్యూహాలను అవలంబించి ప్రవర్తిస్తావు. అనఘుడవు, అనంత కళ్యాణగుణ సంపన్నుడవు అయిన నీ మహత్త్వాన్ని అభివర్ణించడం చతుర్ముఖునకు, చతుర్వేదాలకు కూడా సాధ్యం కాదంటే నేనెంతదాన్ని? వెయ్యి మాటలెందుకు? నిన్ను తెలుసుకొని సన్నుతించటం నాకు శక్యం కాని పని.

అంతే కాకుండా...ఓ జ్ఞానస్వరూపా! మంగళకరమైన నీ నామాన్ని స్మరించినా, కీర్తించినా దరిద్రులు శ్రీమంతులౌతారు. అటువంటివారు అగ్నిష్ఠోమం మొదలైన యజ్ఞాలు చేసినవారికంటె 

పరిశుద్ధులవుతారు. అంతే కాకుండా...లోకాలన్నిటిలో విచిత్రమైన విషయ మేమిటంటే భక్తిపూర్వకంగా నీ నామాన్ని జిహ్వాగ్రాన నిలుపుకొని జపించినట్లయితే వాడు కుక్కమాంసం తినేవాడైనా వానితో బ్రాహ్మణుడు కూడా సాటి కాలేడు. ఈ పరమార్థాన్ని చక్కగా తెలిసికొన్న సజ్జనులు సర్వదా లోకపావనమైన నీ మధుర కథాసుధారసాన్ని తనివితీరా మనసారా త్రాగుతారు. అటువంటి వారికి సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలం ప్రాప్తిస్తుంది. ఈ విధంగా వేదాలన్నీ గొంతెత్తి చాటుతున్నాయి. అందువల్ల అటువంటి మహనీయులే మాననీయులు, ఉత్తములు, సాధుసత్తములు. అందువల్ల పరబ్రహ్మవూ, పరమపురుషుడవూ, వెలుపలా లోపలా సంభావింప తగినవాడవూ, సకల జీవుల పాపాలను పటాపంచలు చేసేవాడవూ, స్వయంప్రకాశుడవూ, వేదమూర్తివీ, మహావిష్ణు స్వరూపుడవూ అయిన నీకు నమస్కరిస్తున్నాను.” అని దేవహూతి స్తుతించగా పురుషోత్తముడూ, మాతృప్రేమతో నిండినవాడూ అయిన కపిలుడు కరుణరసార్ద్రహృదయుడై తల్లితో ఇలా అన్నాడు. కమలదళాల వంటి కన్నులు గల తల్లీ! సుఖస్వరూపమూ, మోక్షప్రదమూ అయిన ఈ యోగమార్గాన్ని నీకు తేటతెల్లంగా వెల్లడించాను. దీనిని నీవు దృఢమైన భక్తితో అనుష్ఠించు. 

దీనిని ఏకాగ్రచిత్తంతో ఏమరుపాటు లేకుండా ఆచరించేవారికి జీవన్ముక్తి లభిస్తుంది. ఈ మార్గాన్ని ఇష్టపడని వారికి మృత్యుభీతి కలుగుతుంది. సుఖం దూరమవుతుంది.”అని ఈ విధంగా కపిలుడు దేవహూతికి మనస్సు సంతోషించేటట్లు ఆత్మతత్త్వాన్ని ఉపదేశించి వెళ్ళిపోయాడని మైత్రేయుడు విదురునికి తెలియజేశాడు.

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: