**దశిక రాము**
**మహాభారతము**
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /
దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//
105 - 0అరణ్యపర్వం.
యక్షుని ప్రశ్నలకు ధర్మరాజు, తన మేధస్సు మేరకు సమాధానాలు చెబుతున్నాడు, తన తమ్ములప్రాణాలు రక్షించేందుకు.
నాలుగవ ప్రశ్న : భూమిపై నుండి లోపలకు వెళ్లి వృద్ధి చెందేవానిలో శ్రేష్టమైనది ఏది ?
భూమిలో చేరి చెట్టుగా వృద్ధి చెందే విత్తనం అతి శ్రేష్టమైనది.
5 . భూమికంటె గొప్పదైనదీ, ఆకాశంకంటే యెత్తైనదీ, గాలికంటె వేగం కలదీ, గడ్డి కంటే అల్పమైనది ఏవి ?
భూమికంటె గొప్పదైనది, తల్లి. ఆకాశంకంటే ఉన్నతమైనవాడు తండ్రి. గాలికంటె వేగం కలది మనస్సు. గడ్డికంటే అల్పమైనది కష్టాలకు దుఃఖించడం.
6 . కనులు మూయకుండా నిద్రించే జీవి ఏది ? పుట్టిన తరువాత చలనం లేనిది ఏది ? హృదయం లేనిది ఏది ? తన వేగంతోనే తాను వృద్ధి చెందేది ఏది ?
కన్నుమూయకుండా నిద్రించేది చేప. పుట్టినా కదలనిది గుడ్డు. హృదయం లేనిది రాయి. తన వేగంతో తానే వృద్ధి చెందేది నదీప్రవాహం.
7 . ప్రయాణంలో మిత్రుడెవరు ? ఇంటిలో వున్నప్పుడు స్నేహితుడెవరు ? రోగికి మిత్రుడెవరు ? చనిపోయే వానికి ఆప్తుడు ఎవరు ?
యాత్రికుల సమూహమే, యాత్రికునికి నేస్తాలు. ఇంట్లోవున్నప్పుడు భార్యయే నిజమైన మిత్రుడు. రోగికి వైద్యుడు స్నేహితుడు. చనిపోయేవానికి, తాను చేసే దానాలే మిత్రులు.
8 . సర్వజీవులకు అతిధి ఎవరు ? అందరికీ అగ్నిదేవుడు అతిధి.
9 . ఒంటరిగా తిరిగేవాడు ఎవరు ? తిరిగితిరిగి పుట్టేది ఏది ? మంచుకు వైద్యం ఏమిటి? అన్నిటికీ ఆధారమైనది ఏది ?
సూర్యభగవానుడు ఒంటరిగా సంచరిస్తాడు. మరల మరల పుట్టేవాడు చంద్రుడు. అగ్నిదేవుడు మంచుకు విరుగుడు. భూమి అన్నిటికీ ఆధారం.
10 . అన్ని కీర్తి కారకములలో శ్రేష్టమైనది ఏది ? దానగుణం.
11 . దైవమిచ్చిన స్నేహితుడు ఎవరు ? భార్య.
12 . శ్రేష్టమైన సంపద ఏది ? విద్య.
13 . లాభాలలో గొప్పది ఏది ? ఆరోగ్యం.
14 . సుఖాలలో ఉన్నతమైనది ? సంతృప్తి.
15 . ఉత్తమమైన ధర్మం ? అన్నిప్రాణుల యెడ దయ.
16 . దేనిని త్యాగం చేస్తే మనిషి దుఃఖానికి దూరంగా వుంటాడు ?
క్రోధాన్ని జయించినవాడు.
17 . సుఖంగా వుండాలంటే దేనిని వదలాలి ? లోభాన్ని.
18 . ఒక వ్యక్తి చనిపోవడం అంటే ఏమిటి ? దరిద్రుడు మృతుడితో సమానం.
19 . జయించలేని శత్రువు ఎవరు ? నయము కాని వ్యాధి ఏది ? సాధువు అని ఎవరిని అంటారు ? ఎట్టివాడు సాధువుగా పరిగణింపబడదు ?
జయించలేని శత్రువు క్రోధం. లోభత్వం నయంకాని వ్యాధి . అందరికీ మేలు చేసే వాడు సాధువు. అందరినీ హింసించేవాడు క్రూరుడు.
20 . అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి ?
ప్రతిరోజూ ప్రాణులు ఎందరో చనిపోతూ వున్నారు. అయినా మిగిలినవారు భూమిపై శాశ్వతం అనే భావంతో మసలుతూ వుంటారు. ఇది యెంతో ఆశ్చర్యకరమైన విషయం.
21 . వార్తలకన్నిటిలోనూ విశేషమైనది ఏమిటి ?
కోరికలతో నిండిన పెద్దపాత్రని, పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు మండిస్తూ ఉంటే, నెలలూ ఋతువులూ అనే గరిటెతో, పాత్రలో వున్న కోరికలను కలియబెడుతూ, కలిపురుషుడు జీవులను వండుతున్నాడు.
ఈ విధంగా ధర్మరాజు, యక్షునికి సంతృప్తి కలిగేటట్లు సమాధానాలు ఇవ్వడంతో, ' నలుగురు తమ్ముళ్లలో ఒకరిని బ్రతికిస్తాను, ధర్మజా ! కోరుకో యెవరు కావాలో ! ' అని యక్షుడు చెప్పాడు. దానికి ధర్మరాజు తడుముకోకుండా, ' మహానుభావా ! అదుగో, నల్లని రంగుతో వున్న, పొడుగాటి బలిష్ఠుడైన నా తమ్ముడు నకులుడిని పునరుజ్జీవితుడిని చేసి నన్ను సంతోషపెట్టు. ' అని అడిగాడు.
యక్షుడు అమితాశ్చర్యం పొందాడు, ధర్మరాజు కోరికకు. ' నీకు ఇష్టుడైన భీముని, పరాక్రమవంతుడైన అర్జునుని కాదని, నకులుని యెందుకు కోరుకున్నావు చెప్పు ' అని ధర్మరాజును కుతూహలంగా అడిగాడు.
స్వస్తి.
వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి