8, అక్టోబర్ 2020, గురువారం

*62) కఠోపనిషత్తు

 ఓం నమః శివాయ:

*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


ఆగ్ర్యమ్య బుద్ధి అంటే అగ్రస్థితిలో వున్నటువంటి బుద్ధి. మనం ఇప్పటి వరకూ మాట్లాడుకున్న అంశాలను స్పష్టంగా ఇక్కడ చెబుతున్నారు. మీ ఇంట్లో ఒక వజ్రం ఉందనుకోండి. ఆ వజ్రాన్ని ఎక్కడ పెడుతారు సాధారణంగా? మీ వంటింట్లో ఉన్నటువంటి కప్పులు, సాసర్లు, బిందెలు, గిన్నెలు... అక్కడ వెతికారు అనుకోండి, ఆ వజ్రం కనబడుతోందా? సాధారణంగా ఈ వజ్రమంత విలువైన దానిని ఎక్కడ పెడుతాము? ఎక్కడో ఒక చోట భద్రమైనటువంటి స్థితిలో పెడుతాము. భద్రమైనటువంటి స్థానంలో పెడుతాము. ఎందుకని? చాలా విలువైనది కాబట్టి. మరి వాటిని సామాన్యంగా మనం వెతికితే, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నేల మీద పడవేసి వెతికితే అది కనపడుతుందా అంటే, ఆ వస్తువులన్నిటిలో కలిసిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. 



అట్లాగే మనలో భద్రమైనటువంటి స్థానంలో, భద్రమైనటువంటి స్థితిలో స్వస్వరూప జ్ఞానమున్నది, స్వప్రకాశము కూడా ఉన్నది. అదే ఆత్మ. అర్థం అయ్యిందా అండి. బుద్ధి గుహయందు ఉన్నటువంటి హృదయాకాశ స్థానములో, నిరంతరాయంగా వెలుగుతూ ఉన్నటువంటి, స్వప్రకాశము ఏదైతే ఉన్నదో అది ఆత్మ. ఇది భద్రంగా ఉంది. అతి సూక్ష్మంగా ఉంది, గుహ్యంగా ఉంది, రహస్యంగా ఉంది, భద్రమైన స్థితిలో వుంది, భద్రమైన స్థానంలో ఉంది.



        ఒక్కొక్కదానిని విరమించుకుంటూ, ఒక్కొక్క దానియందున్న సంగత్వాన్ని పోగొట్టుకుంటూ, ఆసక్తులను పోగొట్టుకొంటూ, ప్రవృత్తి మార్గం నుండి నివృత్తి మార్గంలోకి మరలడం ద్వారా, మనస్సును మరలించడం ద్వారా, నీ మనస్సు సదా గిన్నెల చుట్టూ, సదా విషయముల చుట్టూ, సదా తినే పదార్థముల చుట్టూ, సదా భోగించేటటువంటి లక్షణాల చుట్టూ, మనస్సు పనిచేస్తూ ఉన్నప్పుడు, ఏ బట్టలు కట్టుకుందాం? ఏ భోజనం చేద్దాం? ఏ రకంగా సుఖాన్ని పొందుదాం? ఏ రకంగా విశ్రాంతి తీసుకుందాం? ఏ రకంగా అలంకారం చేద్దాం? ఈ రకంగా బాహ్యమైనటువంటి విషయాల చుట్టూ, బాహ్యమైనటువంటి వస్తువుల చుట్టూ, మనస్సు పనిచేస్తూ ఉంటే, బుద్ధి కూడా మనసును అనుసరించి, నిర్ణయాలు చేస్తూ ఉంటుంది బాహ్యముగానే. ఏ నివృత్తి మార్గానికి, స్వస్వరూప ఆత్మజ్ఞానానికి, ఉపయోగపడవలసినటువంటి బుద్ధి ఉన్నదో, దానిని బాహ్యమైనటువంటి విషయాల కొరకు, బాహ్యమైనటుంవంటి వస్తు జ్ఞానము కొరకు, వ్యవహార నిర్ణయము కొరకు, వాడుకోవడం ఎటువంటి దంటే, కంట్లో ఆపరేషన్‌ చేయడానికి ఉపయోగించవలసినటువంటి కత్తిని, కూరగాయలు కోయడానికి ఉపయోగించరాదా? అంటే, అది కూడా కత్తే, కోయడానికి ఉపయోగపడుతుందా? పడదా? పడుతుంది. కానీ, ఒకసారి కూరగాయలు కోస్తే మరల కంట్లో ఆపరేషన్స్‌ చేయడానికి ఉపయోగపడదు. ఇప్పుడు మన బుద్ధి ఇలాగే తయారైంది.



      బుద్ధి నివృత్తి మార్గం ద్వారా స్వస్వరూప ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందటానికి ఉపయోగపడవలసిన సూక్ష్మమైనటువంటి ఇంద్రియం. అది ఎంత సూక్ష్మమైనది అంటే, సూర్యకిరణాలను కూడా నిలువుగా ఛేదించగలిగేటటువంటి సమర్థత కలిగినంత సూక్ష్మమైనటువంటి ఇంద్రియం. దానిని ఇప్పుడు మనము బిందెల చుట్టు, కడవల చుట్టు, భౌతికమైన, స్థూలమైనటువంటి విషయాల చుట్టూ, వస్తువుల చుట్టూ తిప్పుతున్నాము.



        ఈ రకమైనటువంటి అభ్యాసదోషం చేత మన బుద్ధి స్థూలతని సంతరించుకుంది. తన సూక్ష్మతను పోగొట్టుకుంది. ఇప్పుడు పునః ఏం చేయాలట? దానిని వెనక్కు తిప్పుకుని, మనస్సును విరమింప చేసి, బుద్ధిని విరమింప చేసి, దానికి మూలమైనటువంటి, కారణమైనటువంటి, మహతత్వమునందు, అవ్యక్తము నందు దానిని స్థిరపరచి బుద్ధిగుహ యందు విచారణ చేసి, దృష్టి నిలిపి, హృదయాకాశము నందు సదా ప్రకాశిస్తున్నటువంటి, ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని మానవులు పొందాలి. 



అలా ఎవరైతే పొందుతారో వాళ్ళకి, ఆ సాక్షాత్కార జ్ఞానం, ఆ జన్మపర్యంతం అంటే, జనన మరణాలను దాటటానికి అదే సోపానముగా పనికి వస్తుంది. అదే అవకాశంగా పనికి వస్తుంది. ఈ జనన మరణ చక్రంలోనుంచి బయటపడగలుగుతాడు. కర్మబంధాలలోనుంచి బయటపడగలుగుతాడు. మోహంలోనుంచి బయటపడగలుగుతాడు. 

ఆ ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి ఎంతో విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. మానవజన్మని ధన్యత చెందించగల సర్వసమర్థమైనటువంటి సాధన ఏదైనా ఒకటి ఉంది అంటే, అది ఆత్మవిచారణ, ఆత్మసాక్షాత్కార జ్ఞానము. కాబట్టి, 



అటువంటి ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని, ఉత్తమమైనటువంటి సాధనను, శ్రవణ మనన నిధి ధ్యాసల ద్వారా ప్రవృత్తి మార్గం నుండి నివృత్తి మార్గంలోకి మరలించుకోవడం ద్వారా బాహ్య విషయ వస్తు వ్యవహార సంగత్వ దోషాన్ని పరిత్యజించడం ద్వారా, నిమిత్తమాత్రపు వ్యవహారం ద్వారా, సామాన్య వ్యవహారం ద్వారా, తనను తాను నియమించుకుంటూ, సాధన చతుష్టయ సంపత్తి ద్వారా, నిత్యానిత్యవస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరాగము, శమాది షట్క సంపత్తి... అంటే శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము, ముముక్షత్వము, తీవ్ర మోక్షేచ్ఛ, తీవ్ర వైరాగ్యము... వీటిని పొందవలసినటువంటి అవసరము మానవులకు ఎంతైనా ఉన్నది. ఈ సమస్తమూ కూడా నివృత్తి మార్గంలోనే సాధ్యమౌతుంది. సత్వగుణంతోనే సాధ్యమౌతుంది. 



చాలా మంది ఈ సత్వగుణం అనేదాని దగ్గర విశ్రాంతి తీసుకుంటారు. ఎంతకాలం తీసుకుంటారయ్


యా? ఎన్ని జన్మలపాటైన

ా విశ్రాంతి తీసుకోవచ్చు. ఎందుకని అంటే? అది సహనంతో ఉంటుంది, శాంతంతో ఉంటుంది, ఓర్పుతో ఉంటుంది. అన్ని దైవీ లక్షణాలు ఆ సత్వగుణంతో ముడిపడి ఉంటాయి. దయ, క్షమ, త్యాగం ఇలాంటి లక్షణాలన్నీ దానితో ముడిపడి ఉంటాయి. కానీ స్వస్వరూప ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందక పోయినట్లయితే, ఈ సత్వగుణం కూడా బంధహేతువే, బంధ కారణమే! ఎందుకని అంటే, జనన మరణ చక్రంలోకి పట్టుకెళ్తుంది కాబట్టి. పునః మరలా శరీరాన్ని ధరింప చేస్తుంది కాబట్టి. ఎప్పటికైనా సరే ఈ సత్వగుణాన్ని కూడా అధిగమించాలి. గుణాతీత స్థితిలో నిలబడి ఉండాలి. గుణాలకు సాక్షిగా ఉండాలి.



         ‘గుణత్రయాతీతః’ - ఎట్లా అయితే, ‘శరీర త్రయ విలక్షణః’ - ఆత్మ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అట్లాగే ‘గుణత్రయాతీతః’ - మూడు గుణాలను దాటినటువంటి స్థితిలో, మూడు గుణాలు స్వాధీనమైనటువంటి స్థితిలో, గుణమాలిన్యము లేనటువంటి స్థితిలో, స్వస్వరూప ఆత్మసాక్షాత్కార జ్ఞాన స్థితిలో, ప్రత్యగాత్మ స్థితిలో, అంతర్యామి స్థితిలో, బుద్ధి గుహయందు, స్వప్రకాశంతో, స్వరూపజ్ఞానంతో సహజంగా నిలకడ చెంది, తనను తాను తెలుసుకున్న వాడై, సరియైనటువంటి ఆత్మనిష్ఠ యందు నిలకడ చెందాలి. ఈ ఉత్తమ లక్ష్యాన్ని పొందాలి అంటే, రాచబాటను తెలియజేసింది. నివృత్తి మార్గం ద్వారా మనస్సునుండి బుద్ధికి, బుద్ధినుండి మహతత్వానికి, మహతత్వం నుంచి అవ్యక్తానికి, అవ్యక్తం నుంచి ప్రత్యగాత్మకు చేసేటటువంటి అంతర్ముఖ ప్రయాణాన్ని, మానవులు పూర్తి చేయాలి. అలా పూర్తి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మాత్రమే ఈ ఆత్మదర్శనాన్ని పొందగలుగుతున్నారు.



        అలా లేకపోయినట్లయితే, ఈ నివృత్తి మార్గంలో కనుక నువ్వు ఉత్తమ లక్ష్యాన్ని స్వీకరించి, శ్రవణ, మనన, నిధి ధ్యాసల ద్వారా, ఈ స్థిరమైనటువంటి స్థితిని గనుక నువ్వు పొందకపోయినట్లయితే, ఇది సాధ్యం కాదు. కాబట్టి, తప్పక అందరూ ఈ ఆత్మదర్శనాన్ని పొందేదిశగా పరిణామం చెందవలసినటువంటి అవసరం ఈ జన్మలోనే ఉంది. ఎప్పుడో చేద్దాంలే, ఎప్పుడో చూద్దాంలే, అదే రాకపోతుందా? వచ్చినప్పుడు అదే వస్తుందిలే, కాలంలో అవే వస్తాయిలే, ‘కాలేన ఆత్మని విందతి’ - అనేటటువంటిది వాయిదా పద్ధతి తమోగుణం సంబంధమైన వాయిదా పద్ధతి.



        ఇప్పుడే ఈ జన్మలోనే, ఈ క్షణమందే, ఈ స్థితియందే, ఇప్పటికిప్పుడే ‘నేను పొందాలి’ అనేటటువంటి తీవ్రమోక్షేచ్ఛ, తీవ్ర వైరాగ్యం ఎవరికైతే ఉంటుందో, వారు మాత్రమే ఈ నివృత్తి మార్గంలో త్వరత్వరగా ప్రయాణం చేయగలుగుతారు.



 అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేయగలుగుతారు. చాలామంది ప్రయత్నం చేస్తారు కాని, సత్వగుణానికి చేరగానే ‘కాలేన విందతి’ అని ఊరుకుంటారు. అలా ఊరుకునేవారు చాలామంది ఉన్నారు. ఇది పెద్ద విమానాశ్రయం లాంటిది, విమానాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ వీడు ఎప్పటికీ విమానాశ్రయంలో వుంటాడు, ఏ విమానము ఎక్కడు, ఎక్కడికి ప్రయాణం పూర్తి చేయడు. అందువల్ల ఏమైపోయింది? శ్రవణం చేశాడు, మననం కూడా చేశాడు, కానీ నిధిధ్యాసలను పూర్తి చేయలేదు. అతని దగ్గర అన్నీ మంచి లక్షణాలున్నాయి. ఏ చెడు లక్షణాలు ఎత్తి చూపడానికి ఏం కనపడవు.



 అందరి కంటే ఓర్పు కలిగినవాడు, అందరి కంటే సహనం కలిగినవాడు, అందరితో పోలిస్తే జ్ఞానం ఉన్నవాడు, అందరితో పోలిస్తే వివేకం ఉన్నవాడు, శాస్త్రములన్నీ బాగా చదివాడు, మంత్రములన్నీ బాగా తెలుసుకున్నాడు, ఉపదేశాలన్నీ బాగా పొందాడు, మహానుభావుల సేవనం కూడా చేశాడు, కానీ లక్ష్యశుద్ధి ఇప్పుడే, ఈ జన్మలోనే, ఇక్కడే, ఈ సందర్భంలోనే ‘నేను వెంటనే వెనువెంటనే ఆత్మసాక్షాత్కార జ్ఞానము’ పొందక నిలువజాలను అనేటటువంటి తీవ్రమోక్షేచ్ఛ లోపించడం చేత, ఆ స్థానంలో వాయిదా పద్ధతి వచ్చేసింది. సరే నేను చేయాల్సింది చేసేశాను,



 ఇక వచ్చేది ఎప్పటికైనా ఈశ్వరానుగ్రహం చేత అదే వస్తుందిలే అనుకుంటాడు. అలా అనడం వలన ఏమైపోయింది? ఆ వాయిదా వాయిదా అలాగే ఉండిపోయి, ఆ జన్మాంతరమూ, అలాగే అవశేషంగా మిగిలిపోయి, ఆ అసంతృప్తి చేత పునః జనన మరణ చక్రంలో, మరలా తల్లి గర్భాన్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం వచ్చింది.


🕉🌞🌏🌙🌟🚩

కామెంట్‌లు లేవు: