8, అక్టోబర్ 2020, గురువారం

శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యము



✍️ గోపాలుని మధుసూదన రావు


 గోవీరీతిగ ననయము 

నా విష్ణువు చెంతజేరి యమృతమీయన్ 

నావుల గాసెడి గొల్లడు 

నా వింతను గనియు మిగుల నచ్చరువొందెన్. 85 


గుట్టలు గట్టులు దాటుచు 

గుట్టుగ యా యావు కదలి గురుతుగ పుట్టన్ 

పట్టుగ పాలను వదలుట 

గుట్టుగ గమనించి గొల్ల కుపితుండయ్యెన్ 86 



పుట్టను జేరిన ధేనువు 

పుట్టలొ క్షీరంబు నిలిచి పోయుచునుండన్ 

కట్టలుతెగి కోపంబున 

కట్టెతొ గొల్లండుఁ కొట్టె కఠినాత్మున్డై. 87 



ధాటిగ గొల్లడు గొట్టగ 

వేటును గమనించి యావు వేగమె తొలగన్ 

చేటును దలచని శ్రీహరి 

పాటున తా లేచిచూచి బడసెను వేటున్ 88 


నుదురున కాష్ఠము తగులగ 

రుధిరము యెగచిమ్మెనంత రోదసినిండన్ 

చెదరిన కేశములొప్పుచు 

మధుసూదనుదంత వెల్గె మార్తాండుడై. 89 


దిక్కుల వెల్గులు నిండగ 

గ్రక్కున పైకొచ్చినట్టి గరుడాధిపునిన్ 

నక్కిన గొల్లడు గాంచియు 

మిక్కిలి వెఱగంది తృటిలొ మృత్యువునొందెన్ 90 


హరితల దాకిన కాష్ఠము 

పరువంబున కదలివచ్చి పరుగిడు గోవున్ 

శరమువలె వచ్చి తగులగ 

శిరమున పెనుగాయ మయ్యు చిందెను రుధిరమ్ 91 


శిరమున గాయము తోడను 

పరుగున గవిరాగ రాజప్రాంగణమునకున్ 

నరనాథు డంతదిగ్గున 

సురగోవును గాంచి మిగుల సుడివడియయ్యన్ 92 


“ఎవ్వరు నిను యిటు జేసిరి 

క్రొవ్వెక్కిన మదముతోడ క్రూరతమీరన్ 

నవ్వాని తెలియ జేయుము 

నవ్వాడెవడైనగాని నంతముసేతున్” 93 



అనవిని ధేనువు బొగులుచు 

ననియెను యీరీతి విభుతొ నాందోళమునన్ 

“విను రాజ ! నీదు గొల్లడె 

కనికరమునులేక కొట్టె కాష్ఠము తోడన్. 94 



అనుదినమున నేనొకనికి 

పనిగొని వేవేగ పోయి పాలను యిత్తున్ 

ననయుండాతడు దివ్యుడు 

దినకరతేజుండు మిగుల దీప్తితమూర్తీ 95 


అతనికి క్షీరము నిచ్చుచు 

సతతము నేసేవజేయు తరుణము నందున్ 

యతి కఠినుడు మీ గొల్లడు 

మతిదప్పియు నన్ను గొట్టె మానవనాథా !” 96 


ధేనువు పలికిన పలుకులు 

మానవనాథుండు వినియు మ్రాన్పడి మిగులన్ 

ధేనువు నుడివిన ముఖ్యుని 

కానగ వెనువెంట కదిలె కడు వడితోడన్. 97

కామెంట్‌లు లేవు: