🌺 *ఓం నమో నారాయణాయ* 🌺
*9 శ్రీవల్లభుఁడు దన్నుఁ జేరిన యట్లైనఁ, ; జెలికాండ్ర నెవ్వరిఁ జేర మఱచు; నసురారి దన మ్రోల నాడిన యట్లైన, ; నసురబాలురతోడ నాడ మఱచు; భక్తవత్సలుఁడు సంభాషించి నట్లైనఁ, ; బరభాషలకు మాఱుపలుక మఱచు; సురవంద్యుఁ దనలోనఁ జూచిన యట్లైనఁ, ; జొక్కి సమస్తంబుఁ జూడ మఱచు;*
*10.హరిపదాంభో యుగ చింతనామృతమున నంతరంగంబు నిండినట్లైన, నతఁడు నిత్య పరిపూర్ణుఁ డగుచు నన్నియును మఱచి జడత లేకయు నుండును జడుని భంగి.*
*భావము:-* మహారాజా! ఆ ప్రహ్లాదుడు విష్ణువు తనను చెంది ఉన్నప్పుడు స్నేహితులతో చేరడు. శ్రీహరి తన ఎదురుగా మెదలుతూ ఉన్నప్పుడు తోటి రాక్షసుల పిల్లలతో ఆటలాడడు. ఆయన తనతో మాట్లాడుతున్నప్పుడు ఇతరులతో మాట్లాడడు. ఆయనను తనలో ధ్యానించుకునే సమయంలో మరింక దేనిని చూడడు. హరిధ్యానముతో మనసు నిండి ఉన్నప్పుడు అతడు ఆనందపూర్ణుడై అన్ని వదిలేసి, మోహము లేకపోయినా, పిచ్చివాడి లాగ కనబడతాడు.
*11. పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాస లీ లా నిద్రాదులు చేయుచుం దిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృ తాస్వాద సం ధానుండై మఱచెన్ సురారిసుతుఁ డే త ద్విశ్వమున్ భూవరా!*
*భావము:-* రాజా! ప్రహ్లాదుడు అన్నము తింటూ నీళ్ళు త్రాగుతూ మాట్లాడుతూ నవ్వుతూ వినోదిస్తూ నిద్రపోతూ కాని ఎపుడైనా సరే ఏమరుపాటు లేకుండా శ్రీ హరి ధ్యానంలోనే నిమగ్నమైన చిత్తము కలిగి, ఈ ప్రపంచమును మరచిపోయి ఉంటాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి