8, అక్టోబర్ 2020, గురువారం

శ్రీ లక్ష్మీఅమ్మవారి ఆలయం, అడిగొప్పుల

 శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీఅమ్మవారి ఆలయం, అడిగొప్పుల.


దర్శనం సమయం: ఉదయం 6:00 నుండి రాత్రి 8:00 వరకు.


గుంటూరుజిల్లా దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలో నిదానంపాటి శ్రీలక్ష్మీఅమ్మ వారి ఆలయం వుంది.పేరులో శ్రీలక్ష్మీ అని వున్నా ఈమెను పార్వతీదేవి అంశగా భావిస్తారు.

పార్వతీదేవి శ్రీలక్ష్మీ అమ్మవారుగా ఎందుకు జన్మించిందో మీకు తెలుసా? శ్రీలక్ష్మీ అమ్మవారిని సంతానంతో పాటు సకలసంపదలను ఇచ్చే తల్లిగా కొలుస్తారు. మరి పార్వతీదేవి శాపానికిగురై శ్రీలక్ష్మీ అమ్మవారుగా ఎందుకు జన్మించింది? ఈ ఆలయం ఎక్కడ వెలసింది?అనే విషయాలను తెలుసుకుందాం.


ఇక ఆలయపురాణం విషయానికొస్తే పూర్వం కైలాసంలో పార్వతీపరమేశ్వరులు కూర్చొనివుండగా ప్రమధ గణాలు నాట్యం చేస్తున్నాయి.అప్పుడు నందీశ్వరుని చూసి పార్వతీదేవి హేళనగా నవ్విందట.అప్పుడు జగన్మాత నా కుమారుణ్ణి చూసి ఎందుకు నవ్వావు అని మహర్షి శిలాదుడు ఆమెను ప్రశ్నించగా అతడి నాట్యంలో తాళము,భావం ఏమీలేవని నవ్వుతూ పార్వతీదేవి చెప్పిందట.


అప్పుడు శిలాదుడికి కోపంవచ్చి కలియుగంలో నీవు భూలోకంలో జన్మించి అవివాహితవైన నీవు చిన్నతనంలోనే గర్భందాల్చి అవమానాలను ఎదుర్కొనగలవు.అని శపించాడు. అప్పుడు పార్వతీదేవి శాపవియోగమార్గమేమని అడుగగా నీతోపాటు కామధేనువు గో మాతగా అవతరిస్తుంది. నీవు రోజూ దానిని పూజిస్తావు.ఆ తరువాత నీవు ఒక విచిత్ర గర్భం ధరిస్తావు.


నా నాట్యంలో నంది అసంపూర్ణుడు అన్నావుకాబట్టి నీ గర్భంలో నందీశ్వరుడు అసంపూర్ణంగా వుంటాడు. పెళ్ళికాకుండానే గర్భవతివైన నిన్ను మీ వాళ్ళు అగ్నికి ఆహుతి చేస్తారు. ఆ విధంగా నీవు మానవరూపంవదలి నిదానంపాటి అమ్మవారుగా భక్తులకోర్కెలు తీరుస్తుంటావు. వారిచే పూజలు అందుకుంటావని చెప్పాడు.


ఆ విధంగా శాపానికి గురైన పార్వతీదేవి సుమారు 700ఏళ్ల కిందట గుంటూరు జిల్లా పల్నాటిప్రాంతంలోని యాగంటిరామయ్య ఇంట్లో జన్మించిందని చెపుతారు. నలుగురు కుమారుల తరువాత పుట్టిన ఆమెకు శ్రీలక్ష్మి అని పేరు పెట్టారు. రామయ్యకి పశుసంపదలో కామధేనువు అనే గోవు వుండేది.శ్రీలక్ష్మి ప్రతిరోజూ గోశాలకి వెళ్లి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి గోపంచతాన్ని తాగుతూవుండేది.


ఒక రోజు ఆ కామధేనువుతో ఆంబోతు క్రీడించింది.ఆ విషయం తెలియని శ్రీ లక్ష్మి రోజూలాగే వెళ్లి గోమాతను పూజించి గోపంచతాన్ని తాగింది.అప్పుడు ఆమె కొన్నాళ్ళకు గర్భవతిఅయింది. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు ఆమెని,వారి ఇంటివారిని చాలా అవమానించారు.


దాంతో కోపానికి గురైన ఆమె అన్నయ్యలు శ్రీలక్ష్మిని పొలానికి పిలిపించి ఆమెకి నిప్పుపెట్టారు. అప్పుడు ఆ అగ్నిలోకి గోశాలలో వున్న కామధేనువు కూడా వచ్చి అగ్నిలోకి దూకి ఆహుతైంది.అలా మంటలకు ఆహుతైన శ్రీ లక్ష్మి శిలగా మారిపోయింది.తరువాత ఆమె ఒక 11ఏళ్ల బాలికను పూని ఆదివారం నన్ను అగ్నికి ఆహుతిచేసారు కనుక ప్రతీ ఆదివారం పసుపు, కుంకుమలతో నన్ను పూజలు చేయాలి.


నన్ను దర్శించుకునేవాళ్ళు అందరూ కూడా ఎండలోనే నిలబడాలి. నాకు ఆలయాన్ని నిర్మించవద్దు అని చెప్పిందట. అందుకే అమ్మవారు వెలసిన స్థలంచుట్టూ 10అడుగుల మేర స్థలాన్ని విడిచిపెట్టి మందిరాన్ని నిర్మించారు.అమ్మవారు దీక్షచేసే భక్తులు 40రోజులు దీక్ష పూర్తయ్యాక ఇరుముడులు కట్టుకుని కాలి నడకన వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఈ విధంగా శాపానికి గురైన పార్వతీదేవి శ్రీలక్ష్మి అమ్మవారుగా వెలసి భక్తులకి దర్శనం ఇస్తున్నారు.


రైలు మరియు రోడ్డు మార్గం ద్వారా గుంటూరు నగరాన్ని సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడున్న రైల్వే స్టేషన్ దేశంలో ని మిగిలిన ప్రాంతాలకి చక్కగా అనుసంధానమై ఉంది. ఢిల్లీ, కోల్ కత్తా, ముంబై, చెన్నై, హైదరాబాద్ అలాగే బెంగుళూరు వంటి మెట్రో పోలిటన్ నగరాల నుండి గుంటూరు కి రైళ్ళు అందుబాటులో కలవు.


సర్వేజనా సుఖినోభవంతు 

🙏😊

కామెంట్‌లు లేవు: