8, అక్టోబర్ 2020, గురువారం

పోత‌న త‌ల‌పులో...76

 


శ్రీ‌కృష్ణ పరమాత్మ చిలిపి చేష్టలు,ఆయన త‌మ‌కు అడుగ‌డుగునా అండ‌గా ఉండి చేసిన మేలు గురించి ఎన్నో విధాలుగా గుర్తు చేసుకుంటున్నాడు అర్జునుడు....


               **

చెలికాఁడ రమ్మని చీరు న న్నొకవేళ,-

  మన్నించు నొకవేళ మఱఁది యనుచు,

బంధుభావంబునఁ బాటించు నొకవేళ,-

  దాతయై యొకవేళ ధనము లిచ్చు,

మంత్రియై యొకవేళ మంత్ర మాదేశించు,-

  బోధియై యొకవేళ బుద్ధి సెప్పు,

సారథ్య మొనరించుఁ జనవిచ్చి యొకవేళఁ,-

  గ్రీడించు నొకవేళ గేలి సేయు,

             **

  నొక్క శయ్యాసనంబున నుండుఁ, గన్న

తండ్రి కైవడిఁ జేసిన తప్పుఁ గాచు,

హస్తములు వట్టి పొత్తున నారగించు,

మనుజవల్లభ! మాధవు మఱవ రాదు.

              **

ఆ వాసుదేవునికి నేనంటే ఎంత ప్రేమ, ఒక సారిచెలికాడా రా రమ్మని పిలిచేవాడు. ఇంకోసారి ముద్దుల మరదీ అని ముద్దు చేసేవాడు, ఒకమాటు ఆత్మబంధువై ఆదరించేవాడు. మ‌రొక‌మారు ఔదార్యమూర్తియై బహుధనాలు బహూకరించేవాడు. ఇంకోసారి మంత్రియై హితోపదేశం చేసేవాడు. మ‌రొక‌సారి గురువై కర్తవ్యాన్ని బోధించేవాడు. ఇంకో సంద‌ర్భంలో సారథియై చనువు చూపేవాడు. ఒక్కోసారి క‌ల‌సి ఆటలాతూ విహరించేవాడు, వేరొకమారు ఆత్మీయుడై హాస్యమాడుతూ ఆటలు పట్టించేవాడు. ఇంకొక మారు ఒకే ప్రక్కమీద కూర్చోపెట్టుకొని కన్నతండ్రి వలె నా తప్పులు సరిదిద్దేవాడు. మరొకమారు నా చేతులు పట్టుకొని బలవంతం చేసి ఆరగింప జేసేవాడు.

అటువంటి మాధవుణ్ణి మరచిపోవటం ఎలా మహారాజా?

         **

వారిజగంధులు దమలో

వారింపఁగరాని ప్రేమ వాదము సేయన్,

వారిజనేత్రుఁడు ననుఁ దగ

వారిండ్లకుఁ బనుపు నలుక వారింప నృపా!

           **

అప్పుడప్పుడు తనకు అంతఃపుర కాంతలతో ప్రణయకలహం సంభవించినప్పుడు, వారి అల‌క‌ను తీర్చటం కోసం నన్ను బ్రతిమాలి వారి యిండ్లకు పంపే వారిజాక్షుని ఏ విధంగా విస్మరించగలం? ప్రభూ!


                 **


నిచ్చలు లోపలికాంతలు

మచ్చికఁ దనతోడ నాడు మాటలు నాకున్

ముచ్చటలు సెప్పు మెల్లన

విచ్చలవిడిఁ దొడలమీఁద విచ్చేసి నృపా!


         **

తాను చనువుగా నా చెంత చేరి, నిత్యమూ తన ప్రియురాళ్లకూ- తనకూ మధ్య జరిగే రహస్య సంభాషణలన్నీ పూసగ్రుచ్చినట్లు మెల్లగా నా చెవిలో చెప్పేవాడు.


     **

అటమటమయ్యె నా భజన మంతయు భూవర! నేఁడు సూడుమా

యిటువలె గారవించు జగదీశుఁడు గృష్ణుఁడు లేని పిమ్మటం

బటుతర దేహలోభమునఁ బ్రాణములున్నవి వెంటఁబోక, నేఁ

గటకట! పూర్వజన్మమునఁ గర్మము లెట్టివి చేసినాఁడనో?


అయ్యయ్యో! నా సేవ అంతా నిరర్థకం అయిపోయింది మహాప్రభో! చూడు ఇవాళ, ఇలా ఆప్యాయంగా నన్ను ఆదరించే శ్రీకృష్ణ‌ప‌ర‌మాత్మ‌ ఈ లోకం విడిచి వెళ్ళిపోయాక కూడా, ఇంకా నా ప్రాణాలు ఆయన వెంట పోకుండా ఉన్నాయి. దేహం మీద ఇంతటి లోభం ఉందంటే పూర్వ జన్మలలో ఎంతటి పాపకృత్యాలు చేసానో కదా


       **

కాంతారంబున నొంటి దోడుకొని రాఁగాఁ జూచి గోవిందు శు

ద్ధాంతస్త్రీలఁ బదాఱువేల, మదరాగాయత్తులై తాఁకి నా

చెంతన్ బోయలు మూఁగి పట్టికొన, నా సీమంతినీ సంఘమున్

భ్రాంతిన్ భామిని భంగి నుంటి విడిపింపన్ లేక; ధాత్రీశ్వరా

         **

ఆ మహానుభావుడు తనువు చాలించిన అనంతరం, ఆయన అంతఃపురకాంతలను పదహారువేలమందినీ వెంటబెట్టుకొని వస్తుండగా అరణ్యమధ్యంలో మదోన్మత్తులైన కిరాతులు చుట్టుముట్టి పట్టుకొన్నారు. వారి బారినుండి ఆ నారీమణులను కాపాడలేక విస్తుపోయి కళ్లప్పగించి చూస్తూ ఊరుకొన్నాను.


          **


ఆ తే, రా రథికుండు, నా హయము, లా యస్త్రాసనం, బా శర

వ్రాతం, బన్యులఁ దొల్లి జంపును, దుదిన్ వ్యర్థంబు లైపోయె; మ

చ్చేతోధీశుఁడు చక్రి లేమి భసితక్షిప్తాజ్య మాయావి మా

యాతంత్రోషరభూమిబీజముల మర్యాదన్ నిమేషంబునన్.

       **

ఆత్మేశ్వరుడు చక్రధారి యైన శ్రీకృష్ణుడు లేకపోడంతో ఆ రథం, ఆ రథంపై నున్న నేను, ఆ గుఱ్ఱాలు, ఆ విల్లంబులు శత్రుసంహారకా లైన అవన్నీ ఇదివరకటివే అయినా నిరుపయోగ మైపోయాయి. అన్నీ బూడిదలో పోసిన నెయ్యిలా, మాయావి యందు ప్రయోగించిన మాయలా, చవిటినేల‌లో చల్లిన విత్తనాల్లా తుదకు అన్ని క్షణకాలంలో నిరర్థకాలు అయిపోయాయి.

            **


యదువీరుల్ మునినాథుశాపమునఁ గాలాధీనులై, యందఱున్

మదిరాపాన వివర్ధమాన మదసమ్మర్దోగ్ర రోషాంధులై

కదనంబుల్ దమలోన ముష్టిహతులం గావించి నీఱైరి న

ష్టదశం జిక్కిరి నల్వు రేవు రచటన్ సర్వంసహావల్లభా!

          **

ధరణీవల్లభా! ఇంతకు ముందు మీరు పేర్కొన్న య‌దు వీరులంతా విధివైపరీత్యం వల్ల మునిశాపోపహతులై, వారందరూ , ఆగ్రహావేశంతో ద్వేషరోషాలతో కన్నూ మిన్నూ కానక తమలో తాము పోరాడుకొన్నారు. ముష్టిఘాతాలతో పరస్పరం కొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకొన్నారు. పోయినవారు పోగా నలుగు రైదుగురు మాత్రం ఎలాగో బ్రతికి బయటపడ్డారు.

             **

భూతములవలన నెప్పుడు

భూతములకు జన్మ మరణ పోషణములు ని

ర్ణీతములు సేయుచుండును

భూతమయుం డీశ్వరుండు భూతశరణ్యా!


      **

ఆశ్రితవత్సలా! అన్నా! ధర్మరాజా! 

పరమేశ్వరుడు సర్వభూతాంతర్యామి. 

ఆయన ప్రాణులకు సృష్టి స్థితి సంహారాలను

 తోటి ప్రాణుల వలననే కలుగజేస్తూ ఉంటాడు

          **

బలహీనాంగులకున్ బలాధికులకుం బ్రత్యర్థి భావోద్యమం

బులు గల్పించి, వినాశమున్ నెఱపి, యీ భూభారముం బాపి, ని

శ్చలబుద్ధిం గృతకార్యుఁడై చనియె; నా సర్వేశ్వరుం, డచ్యుతుం,

డలఘుం, డేమని చెప్పుదున్ భగవదాయత్తంబు పృథ్వీశ్వరా!


     **

పృథ్వీనాథా! బలవంతులైన వారికీ బలహీనులైన వారికీ నడుమ పగలు కల్పించి, పరస్పర సంహారం చేయించి, ఈ భూభారాన్ని తీర్చి ఆ అచ్యుతుడు, ఆ అప్రమేయుడు, ఆ అఖిలేశ్వరుడు, ఆ శ్రీకృష్ణుడు వచ్చిన కార్యం పూర్తి చేసుకొని నిబ్బరంగా, నిశ్చలంగా వెళ్లిపోయాడు. ఇంకా ఏమి చెప్పేది ఆ సర్వేశ్వరుని సంకల్పం ప్రకారం జరిగిపోయింది.



  🏵️ పోత‌న ప‌దం🏵️

🏵️ప‌ర‌మాత్మ‌త‌త్వావిష్క‌ర‌ణం🏵️

కామెంట్‌లు లేవు: