8, అక్టోబర్ 2020, గురువారం

రామాయణమ్ 124

 

.

అగస్త్య భ్రాత ఆశ్రమములో ఆయన ఆతిధ్యం స్వీకరించి ఆ రాత్రికి అక్కడే ఉండి తెల్లవారగానే మహర్షి వద్ద సెలవు తీసుకొని ఆయన చూపిన బాట వెంట నడిచి అగస్త్యమహాముని ఆశ్రమానికి చేరుకొన్నారు సీతారామలక్ష్మణులు.

.

ఆ ఆశ్రమ సమీప వనమందు రాముడు వివిధరకములైన వృక్షజాతుల చెట్లు ఏపుగా పెరిగి ఉండటాన్ని గమనించాడు

.

పనస ,తాటి,తినాస,పొగడ,చండ్ర,గానుగ,ఇప్ప,మారేడు,

తిమ్మికి చెట్లున్నాయక్కడ.వందలకొలది పక్షులు ఆ చెట్ల మీద కూర్చుండి ధ్వని చేస్తున్నాయి.

 మృగాలన్నీ జాతి వైరాన్ని మరచి కలసిమెలిసి జీవిస్తున్నాయి..

.

ప్రశాంతంగా ఆహ్లాదకరంగా కనపడుతున్న వాతావరణం చూసి రాముడు లక్ష్మణునితో ,ఇది అగస్త్య మహాముని ఆశ్రమమే !

.

ఆ మహానుభావుడు గొప్పతపఃశాలి. 

అగస్త్యః ఇతి .

  అగస్త్యడు అనగా పర్వతమును నిలిపిన వాడు అని అర్ధము (అగము అంటే పర్వతము అని అర్ధము). ఆ మునిని చూస్తే రాక్షసులకు గుండె దడ..

.

లక్ష్మణా మనము మిగిలిన వనవాస కాలాన్ని ఈ గొప్ప తపఃసంపన్నుడిని సేవిస్తూ ఇక్కడే ఉండి పోదాము

.

నీవు ముందుగా లోనికి వెళ్లి మన రాక అగస్త్య మహర్షికి తెలుపు, అని పలికి ఆశ్రమ ప్రాంగణంలో వేచి ఉన్నారు సీతారాములు.

.

లక్ష్మణుడు లోనికివెళ్ళి మహర్షి శిష్యుడొకరితో దశరధ మహారాజు పెద్ద కొడుకు భార్యా సమేతంగా మిమ్ముచూడటానికి వచ్చి వాకిలివద్ద వేచిఉన్నాడనిమహర్షితో చెప్పమన్నాడు..

.

ఆ శిష్యుడు లోనికి వెళ్లి మునితో ఈ కబురు చెప్పాడు.

.

ఆయన వెంటనే రాముడు వచ్చాడా! ఇక్కడకు వస్తే బాగుండును అని మనసులో అనుకుంటున్నాను రానే వచ్చాడు దాశరధి.

.

 నా అనుమతి తీసుకొనకుండగనే నీవు వారిని వెంట పెట్టుకు రావలసినది.నన్ను చూడటానికి రామునికి అనుమతి కావలెనా? తక్షణమే ఇక్కడకు తీసుకొనిరా అని అగస్త్య ముని శిష్యుడితో రామసందర్శనాభిలాషతో తొందరపెట్టాడు.

.

ఆ శిష్యుడు వడివడిగా బయటకు వచ్చి రాముడెక్కడ మునిని చూడటానికి ఆయనకు అనుమతి అవసరములేదు అని పలికాడు. అగస్త్యముని శిష్యులు రాముని తగురీతిన సత్కరించి ఆశ్రమము లోనికి సగౌరవముగా తీసుకుని వెళ్ళారు.



రామాయణమ్...125

.

అగస్త్య మహర్షి ఆశ్రమములోనికి ప్రవేశించాడు రాముడు .అక్కడ ఉన్న వివిధ దేవతల పూజా స్థానాలను చూస్తూ అడుగులు వేస్తున్నాడు.

.

ఆయనకు అక్కడ బ్రహ్మ ,అగ్ని,విష్ణువు,ఇంద్రుడు ,వివస్వంతుడు ,సోముడు, భగుడు,కుబేరుడు,ధాత ,విధాత ,వాయువు,నాగరాజు,ఆదిశేషుడు,గాయత్రి,వసువులు,వరుణుడు,కుమారస్వామి,

యమధర్మరాజు .....ఇందరు దేవతల పూజా స్థానాలు కనబడ్డాయి. నడుస్తున్నాడు రాముడు.

.

రాముడికి ఎదురు రానే వచ్చారు అగస్త్యమహర్షి.ఆయనను చూడగానే ఆయన పాదాలు తాకి నమస్కరించారు మువ్వురూ.అంజలి ఘటించి నిలుచున్నారు ఆయన చెంత.

.

అగస్త్యుడు రామునకు ఆసనమిచ్చి కూర్చుండబెట్టి అర్ఘ్యప్రదానాదులచేతఅతిధులనుపూజించాడు.

 తరువాత ఆహారమిచ్చాడు. 

.

భోజనం చేసిన తదుపరిరాముడికి మరొక్కమారు తనివితీరా ఫలపుష్పాదులు ఇచ్చి ,

ఒక ధనస్సును,ఉత్తమమైన ఒక బాణాన్ని ఇచ్చాడు. 

.

రామా ఈ ధనుస్సు విష్ణుదేవునిది, దీనిని విశ్వకర్మ నిర్మించాడు.ఇదిగో ఇది బ్రహ్మ ఇచ్చిన బాణము అని వాటిగురించి తెలిపి ఇంకా అక్షయతూణీరము ,దేవేంద్రుడు ఇచ్చిన స్వర్ణఖడ్గము కూడా ఇచ్చాడు.

.

రామా ఈ ఆయుధాలు సామాన్యమైనవి కావు వీటివల్ల నీకు ఎల్లప్పుడూ జయము లభిస్తుంది.

.

అగస్త్యుడు అప్పుడు విదేహరాజపుత్రి ముఖంలోని అలసటను గమనించాడు ఆవిడను ఒక్కసారి చూసి...

.

రామా ఈ జనకుని కూతురు ఎవ్వరూ చేయలేని పని చేసిందయ్యా !అత్యంత క్లిష్టమైన ,దుఃఖతరమైన వనవాసాన్ని భర్తకోసం కోరివరించిందయ్యా. 

ఎంతో సుకుమారి !చాలా కష్టపడుతున్నది రామా !

ఆవిడ ముఖములో నాకు అలసట స్పష్టముగా కనపడుతున్నది.ఇక్కడ ఆవిడ సుఖముగా ఉండేటట్లు చూసుకో .

.

సహజంగా ఆడువారిలో ..

 మెరుపులో ఉండే చంచలత్వము,

ఆయుధాలకుందే తీక్షణత్వము ,

గరుత్మంతుడికుండే వేగము ఉంటాయి.

కానీ ఈవిడలో అవేవీ లేవు రామా!

అరుంధతి లాంటిదయ్యా సీత.

.

అగస్త్య మహర్షి మాటలు విని ఆయనకు అంజలి ఘటించి స్వామీ ,మాకు వాస యోగ్యమైన ఒక ప్రదేశాన్ని చూపండి అక్కడ పర్ణశాల నిర్మించుకొని జీవిస్తాము అని వినయంగా పలికాడు శ్రీరాముడు.

కామెంట్‌లు లేవు: