**దశిక రాము**
*
నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్తైరనభ్యర్ధితాన-
ప్యర్థాన్ కామానజస్రం వితరతి పరమానందసాంద్రాం గతిం చ।
ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధికఫలః పారిజాతో హరే! త్వంక్షుద్రం తం శక్రవాటీద్రుమమభిలషతి వ్యర్థవర్థివ్రజో౾యమ్||
భావం.
హరీ! నీ రూపము జనులను అనుగ్రహించుటకు అవతరించిన పారిజాతవృక్షము (కల్పవృక్షము). వినమ్రులయి నిన్ను స్మరించిన వారి ఎదుట నీవే స్వయముగా నిలిచి వారి మనోభిష్టములను తీర్చెదవు. పరిపూర్ణమయిన గతిని (ముక్తిని) ప్రసాదించదవు. ఈ విధముగా అవధి లేని మహా ఫలములను అనుగ్రహించు పారిజాతవృక్షము నీ రూపము నందు ఉండగా నీ మహిమ తెలుసు కొనలేనివారు దేవలోకము నందలి పారిజాతవృక్షమును తమ కోరికలు తీర్చుటకు యాచించుచున్నారు.
(తెలుగుభాగవతం.ఆర్గ్).
వ్యాఖ్య. పురాణేతిహాసాల్లో పారిజాత చెట్టు.. దాని పుష్పాలకున్న విశిష్టత ఇంతంత కాదు. క్షీర సముద్ర మథనంలో అమృతంతో పాటు ఉద్భవించిన అద్భుతమైన వాటిలో అది కూడా ఒకటి. దానికోసం మహామహుల మధ్య యుద్ధాలు కూడా జరిగాయి. అదే పారిజాతం చెట్టు. దేవతల రాజయిన ఇంద్రుడు ఈ చెట్టును తీసుకువెళ్లి తన ఉద్యానవనంలో ఉంచుకున్నాడు.
తన తల్లి కుంతీ దేవి కోరిక మేరకు అర్జునుడు ఇంద్రుడి వద్ద నుండి పారిజాత చెట్టును భూమికి తెచ్చాడని మహాభారతం చెపుతుంది. ఆ పుష్పాలతో కుంతీదేవి శివుడికి పూజలు అర్పిస్తుంది. ఈ పుష్పాలతో పూజలు చేసినందువల్లే పాండవులకు కురుక్షేత్ర మహాయుద్ధంలో విజయం లభించిందిట..
అఃతటి పారిజాతం కన్నా స్వామివారి క్రృపే మిన్న అని భట్టతిరి ఎందుకు అంటున్నారో చూద్దాం.
పంచైతే దేవతరవ: మందార: పారిజాతక:!
సంతాన: కల్పవృక్షశ్చ పుంసివా హరి చందనమ్!! (అమరకోశం)
మందారం, పారిజాతం, సంతాన వృక్షం, కల్ప వృక్షం, హరిచందన వృక్షం ఈ అయిదు దేవతా వృక్షాలుగా క్షీరసాగర మదనంలో ఆవిర్భవించాయి. ఇవన్నీ కోరిన వాటిని ప్రసాదించేవే. అన్నింటిలో విశేషమైనది కల్ప వృక్షం.
ఈ కల్పవృక్షం కోరిన ప్రతి కోరికను వెంటనే తీరుస్తుంది. కానీ ఆ కల్పవృక్షం కోరికను తీర్చిన వాడు శ్రీమన్నారాయణుడు. కోరిన వారి కోర్కెలు తీర్చే శక్తిని తనకు ప్రసాదించమని కల్పవృక్షము ప్రార్థిస్తే దాని కోరిక పరమాత్మ తీర్చాడు. అందుకే కల్పవృక్షానికి కల్పవృక్షం పరమాత్మ.
తనకు ఈ వరం ఇచ్చినందుకు స్వామికి సేవ చేసే భాగ్యం ప్రసాదించమని మరో కోరిక కోరింది కల్పవృక్షం. స్వామి ఆ కల్పవృక్షాన్ని వాహనంగా చేసుకొని ఆ కోరికా తీర్చాడు.
నిజమైన కల్పవృక్షం తానే అని
అందుకే తననే ఆశ్రయించి, సేవించమని, అన్నీ తానే ఇస్తానని కల్ప వృక్షం లోపల ఉండి కోరిన వారి కోరికలు తీరుస్తున్నది తానే కావున భక్తజన కల్ప వృక్షం తానేనని తక్కిన వారందరూ తన సేవకులు మరియు వాహనాలే అని కల్పవృక్ష వాహన ఉపదేశం.
కల్పవృక్షం కోరితేనే ఇస్తుంది కానీ గర్భాలయంలో ఉన్న స్వామి భక్తులు తనను మాడవీథులకి రమ్మని కోరకుండానే తన దర్శనాన్ని ప్రసాదించి తరిపంచేస్తున్నారు. అందుకే కోరితేనే కోరికలు తీర్చే చెట్లను, పుట్టలను ఆశ్రయించరాదని శాసించడానికే కల్పవృక్ష వాహనాన్ని అధిష్టించి నాలుగు మాడవీధులలో ఊరేగుతున్నాడు మలయప్ప స్వామి.
కల్పవృక్ష వాహనం పై విహరిస్తున్న స్వామిని దర్శించిన వారికి సకల కామనలు తీరుతాయి, కోరని మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు స్వామి. (శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు - mprabha.news)
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి