8, అక్టోబర్ 2020, గురువారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..

వ్యాపారం..వాత్సల్యం..


1980 వ సంవత్సరం లో (అప్పటికి శ్రీ స్వామివారు సిద్ధిపొంది నాలుగు సంవత్సరాల కాలం పూర్తి అయింది..) శ్రీ మీరాశెట్టి గారికి కందుకూరులో నూనె మిల్లు స్థాపించి, వంట నూనెల వ్యాపారం చేయాలని ఆలోచన వచ్చింది..తనకు తోడుగా తన బావమరిది రామయ్య శ్రేష్టి ని కలుపుకోవాలని అనుకున్నారు..రామయ్య శ్రేష్టి కూడా అందుకు సమ్మతించారు..ఆ సమయం లో నేను కూడా కందుకూరు లో వ్యాపారం చేస్తూ వున్నాను..శ్రీ మీరాశెట్టి గారు కూడా మా దుకాణం నుంచే తన వ్యాపార కార్యకలాపాలు చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు..


ఏదైనా పని మొదలు పెట్టేముందు..మొగలిచెర్ల వెళ్లి, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని రావడం శ్రీ మీరాశెట్టి గారికి అలవాటు..అదే ఆనవాయితీ పాటిస్తూ..శ్రీ రామయ్య శ్రేష్టి తో కలిసి మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..తాము చేయబోయే వ్యాపారానికి శ్రీ స్వామివారి అనుమతి తీసుకోవాలని మీరాశెట్టి గారి అభిప్రాయం..ఉదయాన్నే శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకున్నారు..ఉత్సవ విగ్రహం వద్ద అర్చన చేయించుకున్నారు..ఆ సమయం లో మీరాశెట్టి గారి మనసులో ఒక రకమైన వేదన కలిగింది..శ్రీ స్వామివారి నుంచి అనుమతి రాలేదు అనే భావన కలిగింది..అయినా సర్దిచెప్పుకున్నారు..మనం చేసేది మంచి పనే కదా..ఇంకెందుకు ఆలోచించడం అని ఒక భరోసాను తనకు తానే ఇచ్చుకున్నారు..కానీ ఆరోజు రాత్రి మీరాశెట్టి గారికి శ్రీ స్వామివారు స్వప్న దర్శనం ఇచ్చి.."అనవసరపు ఆర్భాటాలు వద్దు..ఉన్నంతలో జీవితాన్ని గడుపమని" చెప్పారట..ఉలిక్కిపడి లేచి కూర్చున్నారు..వ్యాపారం కొనసాగించాలా?..వద్దా?..అనే మీమాంసే లేదు..శ్రీ స్వామివారు వద్దు అని సంకేతం ఇచ్చారు..ఇక కొనసాగించడం మంచిదికాదు..కానీ..ముందుగానే కొంత పెట్టుబడి పెట్టి, బావమరిది రామయ్య ను కూడా కలుపుకొని వున్న కారణంగా..ఎలా వెనక్కురావాలని రెండు రోజుల పాటు బాధ పడ్డారు..చివరకు రామయ్య శ్రేష్టి కి అసలు విషయం చెప్పారు.. రామయ్యశ్రేష్టి గారు తాను నిర్వహించుకుంటానని గట్టిగా చెప్పారు..మీరాశెట్టి గారు తనకు శ్రీ స్వామివారి ఆదేశం ఇచ్చిన సంగతిని కూడా దాచుకోకుండా చెప్పేసారు..అయినా రామయ్య శ్రేష్టి గారు తాను నూనె వ్యాపారం చేస్తానని పట్టుబట్టారు..విధిలేక మీరాశెట్టి గారు ఆ వ్యాపారాన్ని ఆయన కు అప్పచెప్పారు..


మరో నెలరోజుల కల్లా..రామయ్యశ్రేష్టి నూనె వ్యాపారాన్ని ప్రారంభించాడు..ఆరేడు నెలలు గడిచాయి..రామయ్య శ్రేష్టి గారు అనుకున్నట్లు గా వ్యాపారం జరుగలేదు..నష్టం కనబడసాగింది..అప్పుడు శ్రీ స్వామివారు మీరాశెట్టి గారిని హెచ్చరించిన విషయం స్ఫురణకు వచ్చింది..ఇక ఆలస్యం చేయకుండా..మరింత నష్టం మూటకట్టుకోకుండా.. ఆ వ్యాపారాన్ని మూసి వేశారు రామయ్య గారు..తక్కువ నష్టాలతో బయటపడ్డారు..శ్రీ స్వామివారు వాత్సల్యం తో సకాలంలో హెచ్చరించి.. తనను నష్టాల పాలుకాకుండా కాపాడారని మీరాశెట్టి గారు పదే పదే చెప్పుకునేవారు..


మీరాశెట్టి గారికి సంబంధించినదే మరో అనుభవం..


ఒకసారి మీరాశెట్టి దంపతులు శ్రీ స్వామివారి వద్దకు రావాలని బయలుదేరారు..వారి స్వగ్రామం నుండి శ్రీ స్వామివారి ఆశ్రమానికి సుమారు పది కిలోమీటర్ల దూరం ఉంది..నడుచుకుంటూ వచ్చారు..శ్రీ స్వామివారు ఆ సమయానికి ఆశ్రమం బైట వున్నారు..మీరాశెట్టి దంపతులను చూసి.."రండి..మీ కోసమే ఎదురుచూస్తున్నాను.." అన్నారు..శ్రీ స్వామివారికి నమస్కారం చేసుకొన్నారు..వారిద్దరినీ తీసుకొని ఆశ్రమం లోపలికి వెళ్లారు శ్రీ స్వామివారు..తాను ధ్యానం చేసుకునే గది బైట మీరా శెట్టి గారిని కూర్చోమని చెప్పి..ఆ దంపతుల కెదురుగా పద్మాసనం వేసుకొని స్వామివారు కూర్చున్నారు.."మీరాశెట్టి..మీరు నా మీద విశ్వాసం తో ఈ ఆశ్రమాన్ని కట్టించారు..భవిష్యత్ లో ఇది ఒక దత్త క్షేత్రంగా మారుతుంది..మీ పేరు కూడా నిలిచిపోతుంది..మీకు నా పరిపూర్ణ ఆశీస్సులు ఉంటాయి.." అన్నారు..శ్రీ స్వామివారు ఆదరంతో చెప్పిన ఆ మాటలను మీరాశెట్టి గారు ఎప్పుడూ మననం చేసుకుంటూ వుండేవారు..


శ్రీ స్వామివారికి అత్యంత సన్నిహితంగా మెలిగినా.. ఏనాడూ తన పరిధులు దాటి అహంకరించకుండా..శ్రీ స్వామివారిని భక్తి విశ్వాసాలతో కొలచిన ధన్యజీవి శ్రీ మీరాశెట్టి గారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: