ప్రముఖ నటులు
సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
11-7-1907 ◆ 8-10-1863
నాటకరంగంతోపాటు రెండున్నర దశాబ్దాలు సినిమారంగంలో కూడా వివిధ పాత్రలను ఎంతో ఉదాత్తంగా పోషించి, ప్రసిద్ధ రంగస్థల గాయకుడుగా అత్యుత్తమ కారెక్టర్ ఆక్టర్ గా పురోగమించారు ఆంజనేయులు.
1963 అక్టోబర్ 8న 56 ఏళ్ళ కళాజీవితాన్ని చాలించి తెలుగు సినిమారంగం నుండి ధృవతారగా రాలిపోయిన సి.ఎస్.ఆర్. ఆంజనేయులు అసలు పేరు చిలకలపూడి సీతారామాంజనేయులు.
పూర్వీకుల నివాసస్థలం కృష్ణాజిల్లా బందరవద్ద ఉన్న చిలకలపూడి. ఆ తరువాత గుంటూరు జిల్లాలోని పొన్నూరులో స్థిరనివాసం.
బాల్యమంతా పొన్నూరులోనే గడిపారు. స్కూల్ ఫైనలవరకూ చదివి కొంత కాలం కో ఆపరేటివ్ సూపర్ వైజర్ గా ఉద్యోగం చేశారు.
తండ్రి నటుడవడం వలన ఆ ఛాయలు
సి.ఎస్. ఆర్. మీద కూడా పడ్డాయి. స్నేహితులందరూ హైస్కూల్ విద్య పూర్తిచేసి కాలేజికి వెడుతున్న సమయంలో సి.యస్.ఆర్. నాటకరంగలో ప్రవేశించారు.
ఆంధ్ర నాటకరంగలో ఆనాడు స్థానం,
డి. వి. సుబ్బారావు, పారుపల్లి, జొన్నవిత్తుల, అద్దంకి, కపిలవాయి. తుంగల మొదలైన హేమాహేమీలంతా అగ్రస్థానం వహించి వెలిగిపోతున్న సమయంలో అనతికాలంలోనే వారి కోవలోచేరిపోయిన సి.ఎస్.ఆర్.ఎంతటి ప్రతిభావంతుడో మనం అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఆయన అంతటిస్థానాన్ని ఆక్రమించడానికి కారణం శ్రీకృష్ణ తులాభారం. రాధాకృష్ణ నాటకాలలోని శ్రీకృష్ణ పాత్ర, ఆ పాత్రను ధరించడంలో ఆయనకన్నా అర్హులు ఆ రోజుల్లో ఎవరూ లేకపోవడంవల్లనే
సి.ఎస్.ఆర్. అంతటి ఖ్యాతిని ఆర్జించారు.
భక్తరామదాసులోని రామదాసు పాత్ర, భక్తతుకారాంలోని తుకారాం పాత్ర ఆయనకు అఖండకీర్తిని సంపాదించి పెట్టాయి.
పైన ఉదహరించిన పాత్రలన్నీ ఆయన అభిమాన పాత్రలు. ఆ పాత్రల్లో ఆయన జీవించారనే చెప్పవచ్చు.
సి.ఎస్.ఆర్. ధరించిన పాత్రలలో ఒక పాత్రకూ. మరో పాత్రకూ నటనలో సారూప్యముండేది కాదు. ఏ పాత్రకు ఆ పాత్రే. ఒక ప్రత్యేకతను నిలబెట్టుకునేది.
ఆయన అత్యుత్తమ గాయకుడు. ఏనాడూ,
ఏ నటునీ, ఏ పాటనూ, ఏ అభినయాన్ని అనుకరించలేదు. స్వయంకృషితో, స్వీయప్రతిభతో, సృజనాత్మక శక్తితో వివిధ కోణాలలోనూ ప్రతిభావంతంగా పాత్రలను మలుచుకుని ప్రతి పాత్రనూ ఉన్నత శిఖరాని కెక్కించారు.
ఆయన పద్యపఠనం ఒక ప్రత్యేకత. పద్యాన్ని పద విభాగం చేసి, విరిచి పాడడంలో ఆయనకు ఆయనే సాటి. పద్యం పాడుతూనే మధ్య మధ్య వచనం కల్పించి, తిరిగి పద్యాన్ని ఎత్తుకోవడంతో ప్రేక్షకులను అచ్చెరువొందించేవారు. ఈ విషయంలో ఈయనకు సరితోడు ఉజ్జీ మరొకరు లేరు. ఆ విధంగా సి. ఎస్. ఆర్. బాణి అని
ఒక విశిష్టతను నాటి నాటకరంగంలో
సార్థకం చేసుకున్నారు.
కేవలం పాటలతో, పద్యాలతో నాటకాలలోని పాత్రలను రక్తికట్టించే సమ యంలో సి. ఎస్. ఆర్. పాటనూ, పాటకు తగిన నటననూ, నటనకు తగిన అభిన యాన్నీ, పాత్రోచిత వాచికాన్నీ సమస్థాయిలో నడవడంవల్లనే చిరకాలం అన్ని స్థాయిలలోనూ కాలంతోపాటు ఉత్తమ నటుడుగా మనగలిగారు.
కృష్ణపాత్రలలో పేరుతెచ్చుకున్న సి.ఎస్. ఆర్. ప్రప్రధమంగా ద్రౌపది వస్త్రాపహరణం సినిమాలో శ్రీకృష్ణపాత్రను, సెంట్రల్ స్టూడియోస్ - కోయంబత్తూరు వారు నిర్మించిన భక్తతుకారాంలో తుకారాం పాత్రను హేమాహేమీలతో కలిసి నటించారు.
ఆ తరువాత తల్లి ప్రేమ, సుమతి, చూడామణి, వేంకటేశ్వరమహాత్మ్యం, భీష్మ, మాయలోకం, పాదుకాపట్టాభిషేకం, భక్త తులసీదాస్, గృహప్రవేశం, పరమానందయ్య శిష్యులు, సాయిబాబా, వాలిసుగ్రీవ, మాయాబజారు, పాతాళభై రవి, దేవదాసు, చక్రపాణి, సక్కుబాయి, రోజులు మారాయి, సువర్ణసుందరి, జగదేక వీరుని కథ, అప్పుచేసి పప్పుకూడు మొదలైన 150 చిత్రాలలో ఎన్నో పాత్రలను ధరించారు.
ఆయన నటించిన చిత్రాలు కొన్ని దెబ్బతిన్నా
ఆ చిత్రంలో సి. ఎస్. ఆర్. పాత్రగాని, నటనగాని బాగుండలేదని ఏనాడూ అనిపించుకోలేదు. ధరించిన ప్రతిపాత్రా మణిపూస. ఆయన అకుంఠిత దీక్ష ప్రతి పాత్రను తీర్చిదిద్దేది. ప్రతిపాత్రకూ ఒక వ్యక్తిత్వాన్ని కల్పించుకునేవారు. ఒకసారికి పదిసార్లు సంభాషణ ఎలా చెబితే బాగుంటుందోనని మధనపడేవారు. ఆయనకు తృప్తి కలిగేవరకూ దానిని సాధన చేసేవారు. తుదివరకూ తెలుగు సినీరంగంలో శక్తివంతుడైన నటుడుగా రాణించారు. అన్ని పాత్రలతోపాటు ఆయన హాస్య పాత్రలు కూడా గణనీయమైన స్థానంలో నిలబడినాయి.
ముఖ్యంగా ఆయన ధరించిన పాత్రలలో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలు గృహప్రవేశం, అంతా మనవాళ్ళే, మేలుకొలుపు, జీవితం, నిత్యకళ్యాణం పచ్చతోరణం, మాయా బజారులలో శకుని మొదలైన పాత్రలు. శకుని అంటే సి. ఎస్. ఆర్. ఎప్పటికీ గుర్తుండకపోరు.
ఆయన దేశభక్తుడు. జాతీయవాది.
అస్పృస్యతానివారణ కోసం పతిత పావన నాటకం వ్రాయించి, ఆంధ్రదేశమంతటా ప్రదర్శించి దేశభక్తుల మన్నన లందుకున్నారు.
సుభాస్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఉద్యమానికి 'తుకారాం' నాటకం ద్వారా పదివేల రూపాయలు సంపాదించి ధన సహాయం చేశారు.
పి. ఎస్. ఆర్. విరాడంబరుడు. నిగర్వి. స్నేహపాఠుడ్రు. ధనిక వేద తారతమ్యాలు లేని నిష్కల్మష హృదయుడు.
వెండితెర వెలుగుల్లో మరువలేని మధుర హృదయుడుగా, కళామూ రిగా జీవించిన
సి.ఎస్. ఆర్. మరణించిన రోజున నట లోకమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. శిలాక్షరాలుగా సి. ఎస్. ఆర్, అనే మూడు అక్షరాలు చరిత్రలో నిలిచిపోయాయి.
●●●●●
డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారి 'నటరత్నాలు'
గ్రంథం నుండి సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి