12, జులై 2021, సోమవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*ముంగిట్లో మృత్యువు..స్వామివారి అభయం!..*


1989 వ సంవత్సరం లో నేను హైదరాబాద్ లో వున్నాను..అమ్మా నాన్నగార్లు (శ్రీ పవని శ్రీధరరావు, నిర్మల ప్రభావతి) శ్రీ స్వామివారి మందిర బాధ్యతలు చూసుకుంటూ వుండేవారు..శ్రీ స్వామివారి మందిరం వద్ద ఉత్సవాల సమయంలో మాత్రం  మమ్మల్ని తమకు సహాయకరంగా వుండటానికి రమ్మనమని చెప్పేవారు..నేనూ నా భార్యా ఇద్దరమూ ఆ నాలుగు రోజులూ మొగలిచెర్ల లో వుండి.. కార్యక్రమాలు పూర్తికాగానే తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయే వాళ్ళం..ప్రతి శివరాత్రికి..అలానే శ్రీ స్వామివారి ఆరాధానోత్సవానికి.. ఇలా జరగడం పరిపాటిగా మారిపోయింది..సహజంగా నాన్నగారి నుంచి ఉత్తరం వచ్చేది..


కానీ..ఆ సంవత్సరం అక్టోబర్ మాసంలో దీపావళి పండుగ ముందు నాన్న గారి వద్దనుంచి.. అమ్మకు ఆరోగ్యం బాగాలేదని..పరిస్థితి ఇబ్బందిగా వున్నదని.. మా అన్నయ్య కు ట్రంక్ కాల్ ద్వారా తెలిపారు..హుటాహుటిన అన్నయ్య వదిన..నేనూ మా ఆవిడ మొగలిచెర్ల చేరుకున్నాము..మేము ఇంటికి చేరే సరికి..అమ్మ స్పృహ లో లేదు..ఆమె కాళ్ళ వద్ద ఒక మనిషి కూర్చుని..అరికాళ్లకు మర్దన లాగా చేస్తున్నది..నాన్నగారు పూర్తిగా ఆశలు వదులుకొని ఓ ప్రక్కగా నిలబడి వున్నారు..ఆ పరిస్థితుల్లో కేవలం దైవం మీద భారం వేయడం తప్ప..ఎవ్వరమూ ఏమీ చేయగలిగింది లేదు..


మొగలిచెర్ల లో సిద్ధిపొందిన ఆ అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ఆశ్రయం కల్పించి..ఆశ్రమం నిర్మాణానికి స్థలం ధారపోసి..ఆయన సాధనకు అన్ని విధాలా సహాయపడిన మా తల్లిదండ్రులలో ఇప్పుడు అమ్మ  ఇలా స్పృహ కూడా  లేకుండా..మృత్యువు కు దగ్గరగా వున్నదనే భావన నాకు జీర్ణం కావడం లేదు..ఏ ఇబ్బందీ లేకుండా సునాయాసంగా చనిపోతే చాలు అని ఆవిడ చాలాసార్లు చెప్పేది..ఈలోపల ప్రక్క ఊరి నుంచి మాకు బాగా తెలిసిన డాక్టర్ గారు కూడా వచ్చి..పరీక్ష చేసి..పెదవి విరిచారు.."ఈ పరిస్థితుల్లో చేయగలిగిందేమీ లేదు..ధైర్యంగా వుండండి.." అని చెప్పారు..ఆయన మాటలు విన్న తరువాత..మాకు ఉన్న కొద్దిపాటి ఆశ కూడా లేకుండాపోయింది..ఇక మిగిలింది ఆ దత్తాత్రేయుడే..ఆయనకే మా దంపతులము మొరపెట్టుకున్నాము..


శ్రీ స్వామివారు మొట్ట మొదట సారి మొగలిచెర్ల వచ్చినప్పుడు..వారు బస చేయడానికి ఉపయోగించిన గది లోనే అమ్మ ప్రస్తుతం ఉన్నది..మేము మనస్ఫూర్తిగా నమ్మిన ఆ స్వామివారు మాకు అన్యాయం చేయరు అని ఒక మూల అనిపిస్తోంది..


అరగంట గడిచింది..అమ్మ మెల్లిగా కదిలి..కళ్ళు తెరచి చూసింది..మమ్మల్నందరినీ తేరిపారా చూసి..పలకరింపుగా నవ్వింది..ఆ తరువాత ఐదు నిమిషాల కల్లా ఆవిడ మాట్లాడటం మొదలుపెట్టింది..భ్రమ కాదు..భ్రాంతి అంతకన్నా కాదు..చావుకు దగ్గరగా వెళ్లిన ఆవిడ..ఆ ఛాయలే లేనట్లు..మామూలుగా లేచి కూర్చుంది..మమ్మల్ని పేరు పేరునా పలకరించుకున్నది..


"ఏమాత్రం అవకాశం లేదు..బ్రతకడం కష్టం.." అని చెప్పిన డాక్టర్ గారు కూడా..ఆశ్చర్యంగా చూడ సాగారు..సాయంత్రానికి అమ్మకు ఉన్న కొద్దిపాటి నీరసం కూడా తగ్గింది..


ఆ సంవత్సరం దీపావళి పండుగ ఉత్సాహంగా జరగడానికి ఆ మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయుడి చల్లని చూపులే కారణం..


మరో అనుభవం రేపటి భాగంలో చదువుకుందాము..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: