12, జులై 2021, సోమవారం

సౌందర్య లహరి – సాధన*

 *శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః*

*శ్రీ సద్గురు పరమాత్మనే నమః*

*సర్వమహర్షిభ్యోనమః*

*జగద్గురు ఛారిటబుల్ ట్రస్ట్*

*9063939567*

*ఓం శ్రీ లలితాంబికాయై నమః*

*సౌందర్య లహరి – సాధన*

*ప్రథమ భాగః – ఆనంద లహరి*


*శ్లోకం 7*


*క్వణత్కాఞ్చీదామా కరికలభకుంభస్తననతా*

*పరిక్షీణా మధ్యే పరిణతశరచ్చంద్రవదనా |*

*ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః*

*పురస్తాదాస్తాం నః పురమథితు రాహోపురుషికా || 7 ||*


*ప్రతిపదార్థము :*


*అహో పురుషికా* = అహంకారం ఆకారంగా కలిగిన జగన్మాత;

*క్వణత్కాంచిదామా* = సవ్వడిచేస్తూన్న మొలనూలు కలిగినది;

*కరికలభ కుంభస్తనభరా* = గున్నటేనుగుల కుంభ స్థలాలతో పోటీ పడగల చన్నులు గలది ౼ అనగా పెద్ద స్తనాలున్నది, (పాఠాంతరం ప్రకారం - ఆ భారం వల్ల కొంచెం ముందుకు వంగినది అని అర్థం);

*పరిణత శరత్ చంద్రవదనా* = శరదృతువులో వెన్నెల వికాసాన్ని తలదన్నేలా ఉన్న ముఖం కలది;

*కరతలైః* = 4 చేతులలో;

*ధనుర్భాణాన్పాశం సృణిమపిదధానాం* = పాశం - అంకుశం - విల్లు - బాణం ధరించినది;

*పురమధితుః* = త్రిపుర సంహారకుడైన శివుని యొక్క;

*నఃపురస్తాత్* = మా హృదయాల్లో;

*అస్తాం* = కొలువుండుగాక!


*తాత్పర్యము / భావం :*


*మ్రోగుతున్న బంగారు మొలత్రాడు కలదీ, గున్న ఏనుగు కుంభస్థలాల వంటి కుచాలతో వంగియున్నదీ, సన్నని నడుము కలదీ, శరత్ పూర్ణిమా చంద్రుని వంటి వదనారవిందం కలదీ, హస్తాలలో పాశాంకుశాలను ధరించినదీ, త్రిపురహరుని అహంకార స్వరూపిణి అయిన పరదేవత మా సమక్షంలో (అంటే ధ్యానంలో) ఉండును గాక!*


*ఈ శ్లోకంలో దేవీ స్వరూపం దర్శింపచేస్తున్నారు. (దీని తరువాత శ్లోకం "సుధాసింధోర్మధ్యే") ముందుగానే తదుపరి శ్లోకాన్ని దృష్టిలో ఉంచుకొని ౼ అందుకు భూమికగా ఉపయుక్తంగా సమయాచారులకు చతుర్విధైక్యాను సంధాన మహిమ (సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుజ్యా)లచే, మణిపూర చక్రమందు భగవతి రూపమెటువంటిది గోచరిస్తూందో అట్టి రూపమును ప్రస్తుతించుచున్నారు.*


*త్రిపుర సంహారియగు పరమశివుడు తన పౌరుష రూపమయిన అహంకారమును స్త్రీ రూపమందునట్లు గావించెను. అదియే యీ రూపం.*


*విశేష వ్యాఖ్య:*


*1. ఇది వీర రస ప్రధానమగు సగుణరూపము.*


*2. "ఆహోపురుషికా దర్పాద్యాస్యాత్సంభావనాత్మని” అని అమర నిఘంటువు.*


*3) త్రిపుర సంహారానంతరము శివునిలో తనంతటి వీరుడు లేడను భావము కలిగెను. అదియే ఆహోపురిషిక, అదియే స్త్రీ రూపము దాల్చెనని భావము.*


*4) “ఆహో శబ్దః ఆశ్చర్యవాచీ ౼  పురుష శబ్దస్య ప్రత్యగాత్మ వాచిన్యః అహంశబ్దవాచ్యత్వం లక్ష్యతే ౼ అతః ఆహోపురుషికా అహంకార ఇతి యావత్" అని లక్ష్మీధరుల వ్యాఖ్య.*


*పరమాత్మ నిర్వికారము, నిరాకారమైనను భక్తుల అనుగ్రహార్థము స్త్రీ పుంరూపముల ధరించునని పురాణములు చెప్తున్నాయి.*


*దేవానాం కార్యసిధ్యర్థమావిర్భవతి సా యదా౹*

*ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యాప్యభిధీయతే౹౹*


*అని మార్కండేయ పురాణ వచనము. దేవతల కార్యసిద్ధికై ఆ పరమాత్మ స్త్రీ రూపమును ధరించి నపుడు దేవియే పుట్టినదని లోకములో వ్యవహరింపబడునని  భావము. ఆమెనే 'నిత్యా' అన్నారు.*


*"త్వం స్త్రీ త్వం కుమార ఉతవా కుమారీ" అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు స్త్రీ రూపమునను పరమాత్మ అగపడునని బోధించుచున్నది. ఆ స్త్రీ స్వరూపము అనుపమ సౌందర్యవతిగా భక్తులందరకు భక్తి భావమును గల్గించునని అర్ధం.*


*తొలి వనిత ఆ ఆదిశక్తియే. ఈ విధమైన అమ్మవారి భౌతిక రూపము శివునికి చాల ఇష్టం! ఇష్టమే కాదు. గర్వకారణము కూడా ! ఈ గర్వము అహంకారము సూచించును కాబట్టి ౼ ఈ అమ్మవారి రూపము శివుని "అహంకార స్వరూపము" అని శంకరులు అంటున్నారు. శివుడు ౼ ఒక ఆకారము, రూపము మొదలైన గుణములు లేని నిర్గుణుడు. అమ్మవారితో కూడినప్పుడే అవి ఏర్పడి సగుణుడవుతున్నాడు. అనగా ౼అమ్మవారిది (౼'నేను ' అనే స్థితిని) సూచించే శివునికి ఏర్పడిన 'మేను' స్వరూపము అన్నమాట! ఈ 'అహం' కు ఏర్పడిన ఆకారము కాబట్టి శివుని యొక్క 'ఆహోపురుషిక' లేదా 'అహంకార స్వరూపం' అయినది. తొలి అచ్చు అయిన 'అ' మొదలు తుది హల్లు అయిన 'హ' వరకు ఉన్న (అక్షరముల) వర్ణ స్వరూపిణి కాబట్టి - 'అ-హం కార స్వరూపము'.*


*లలితా సహస్ర నామములోని ౼  'రణత్ కింకిణీ మేఖలా', 'క్రోధాకారాంకుశోజ్వలా',  'మనోరూపేక్షుకోదండా', 'లక్ష్యరోమలతా ధారతాసమున్నేయ మధ్యమా' 'శివమూర్తిః', 'మాతృకావర్ణరూపిణీ', 'శాతో దరీ', 'వర్ణరూపిణీ', 'తలోదరీ', 'శరచ్చంద్ర నిభాననా ౼ మొదలైన నామములతో ఈ శ్లోకమునకు సమన్వయమున్నది.*


*పైన చెప్పబడిన స్వరూప విశేషము గల అమ్మవారు మాకు ఎదురుగా సాక్షాత్కరించు గాక ౼ అని శంకరులు కోరుకొంటున్నారు. అనగా, అమ్మవారిని ప్రత్యక్షము చేసుకోడానికి ఈ రూపమును ధ్యానము చెయ్యాలని అర్థము.*


*ఉపాసన :*


*పైన ఇచ్చిన "శత్రుంజయం" అనే పేరుతో అత్యంత ప్రసిద్ధి చెందిన యీ యంత్రాన్ని బంగారపు రేకుపై మాత్రమే వ్రాయించాలి.*


*ఉత్తరదిక్కున ప్రతిష్టించి, తూర్పు ముఖంగా కూర్చుని - ఆరాధించాలి.*


*నెలలు రోజులు దీక్షతో చేసే యీ ఉపాసనలో - పై శ్లోకాన్ని బీజాక్షర సంయుతంగా రోజుకు వెయ్యి (1000) సార్లు చొప్పున జపించాలి.*


*ప్రతిరోజూ పాలూ పంచదారతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా వుంచాలి. క్షుద్రభావరహితంగా పూజిస్తే శత్రువులందరి పైనా విజయం తధ్యం!*


*మరో పద్ధతి :*


*అంతా పై విధంగానే జరపాలి. కాని దీనిరీత్యా ౼ యంత్రాన్ని తూర్పుదిశలో ప్రతిష్టించి ఉపాసకులు ఉత్తరదిక్కునకు అభిముఖంగా కూర్చుని పూజ చేయాలి. దీక్ష 12 రోజులే! రోజుకు వేయి ( 1000) సార్లు జపం, పాలూ-పంచదారతో చేసిన పాయసమే దీనిలోనూ నైవేద్యం. ఫలితం ౼ పైన చెప్పబడినదే!*


💐💐💐*శ్రీమాత్రే నమః*💐💐💐

*మీ సందేహాలు / పరిష్కారాలు / సలహాల కోసం ఈ క్రింది లింకు ప్రెస్ చేసి మాకు పంపవచ్చును.*

*https://wa.me/919494970459?text=సౌందర్యలహరి.సాధన*

💐💐💐💐💐💐💐💐💐

.*

*

*క్వణత్కాఞ్చీదామా కరికలభకుంభస్తననతా*

*పరిక్షీణా మధ్యే పరిణతశరచ్చంద్ర-వదనా |*

*ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః*

*పురస్తాదాస్తాం నః పురమథితు రాహో-పురుషికా || 7 ||*

💐💐💐💐💐💐💐💐💐

కామెంట్‌లు లేవు: