13, జులై 2021, మంగళవారం

శ్రీమత్ భగవత్ గీత - కర్మల వివరణ

 శ్రీమత్ భగవత్ గీత - కర్మల వివరణ 

 భగవత్ గీత 4 వ అధ్యాయం 17 వ శ్లోకం చదివి ఇది వ్రాస్తున్నాను. . 

 ముందుగా ఈ శ్లోకము దాని టీకా తాత్పర్యాలు చుడండి. 

కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః ।

అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః ।। 17 ।।

కర్మణ — చేయవలసిన (విహిత) కర్మలు; హి — నిజముగా; అపి — కూడా; బోద్ధవ్యం — తెలుసుకొనుము; బోద్ధవ్యం — అర్థం చేసుకొనుము; చ — మరియు; వికర్మణః — నిషిద్ధ కర్మలు; అకర్మణః — అకర్మలు; చ — మరియు; బోద్ధవ్యం — అర్థం చేసుకొనుము; గహనా — గంభీరమైనది; కర్మణ — పనుల; గతిః — నిజమైన మార్గము.

కర్మ, వికర్మ, అకర్మ - నీవు ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి – వీటి గురించి ఉన్న యదార్థం నిగూఢమైనది మరియు అర్థం చేసుకోవటానికి క్లిష్టమైనది.

పని అనేది శ్రీ కృష్ణుడి చే మూడు రకాలుగా వర్గీకరించబడినది – కర్మ, వికర్మ మరియు అకర్మ.

కర్మ: ఇంద్రియ నియంత్రణ మరియు చిత్త శుద్దికి దోహదపడే విధంగా ఉండే శాస్త్ర విహితమయిన మంగళప్రద పనులు.

వికర్మ: శాస్త్రములచే నిషేధింపబడిన ఆశుభకర మయిన పనులు; ఇవి హాని కారకమయినవి మరియు ఆత్మ అధఃపతనానికి దారితీసేవి.

అకర్మ: ఫలాసక్తి లేకుండా కేవలం భగవంతుని ప్రీతి కోసం మాత్రమే చేసే పనులు. వీటికి కర్మ ప్రతిక్రియలు ఉండవు మరియు ఇవి జీవాత్మ ను బంధించవు.

ఇక్కడ కృష్ణ భగవానుడు మనకు కర్మల గూర్చి తెలియచేయుచున్నారు. అవి మూడు రకములని వాటిని 1) కర్మ 2) వికర్మ 3) అకర్మ అని పేర్కొన్నారు.  అందులో అకర్మ క్రిందికి వచ్చే కర్మలను మనం చేయటం శ్రేష్ఠమైనవని అవి జీవాత్మను బంధించవని పేర్కొన్నారు. 

మనందరికీ పాప పుణ్యాల గూర్చి బాల్యంలోనుండే తెలుసు.  మన గృహాలలో మన పెద్దలు నిత్యం పాప కర్మలు చేయవలదు, పుణ్యకర్మలు చేయమని మనకు శిక్షణ ఇచ్చియున్నారు.  మనము కూడా పాప బీతితో పాప కర్మలను చేయ వెనుకాడుతుంటాము. ఇది సర్వజన అనుభవమే  

పాప కర్మలు, పుణ్య కర్మలు అంటే  ఏవి తెలుసుకుందాము.  సాధారణ దృష్టితో చూసిన పాపము కానిది పుణ్యము అని మనమెరుగుదము. అట్టి తరి విడి విడిగా పాపమన నేమి పుణ్యమన నెమో విశ్లేషించ ప్రయత్నించెదము. ప్రతి మనిషికి ఒక మనస్సు ఉండును   ఆ మనస్సు సంతోషకరంగా,  ఆనందకరంగా, దుఃఖ కరంగా, బాధా కరంగా అనేక వికృతులకు లోనగునని మనకెరుకే.  ఇట్లు పరి పరి రీతుల మనస్సు స్థితులను పొందుటకు రెండు కారణాలు 1) ఎవరికి వారు వారు చేయు కర్మల వలన కలిగిన ఫలితాలు, 2) ఇతరులు తనయెడఁ చేసిన కర్మల ఫలితాలు. 

ఈ విషయాలను ఇంకా కూలంకుషంగా విశదీక రించెద. నీవు ఒక అద్దె ఇంట్లో ఉంటున్నావు.  నీకు దైవానుగ్రహం వలన వలసినంత ధనము లభించి ఒక స్వంత గృహాన్ని నిర్మించి అందు నివసించ వెడలినావనుకో అప్పుడు నీ మనస్సు అమితానందభరితంగా  ఉంటుంది. అదే గృహం నీవు కాకుండా మీ తండ్రిగారో లేక మీ దగ్గరి ఇంకొక బంధువో నీకు కలిగించినారనుకో అప్పుడు కూడా నీకు ఆనందం కలుగుతుంది. నీవు నీఅంతట నీవు గృహమును కలిపించుకోవటం నీవు నీ యెడ చేసిన కర్మ అదే నీకు యితరులు నీకు కలిపించటం ఇతరులు నీ యెడ చేసిన కర్మ. నీ యెడల యితరులు ఏ కర్మ చేయటం వలన నీ మనస్సుకు ఆనందము కలిగిందో ఆ కర్మ ఫలితంగా వారికి లభించేది పుణ్యం. 

ఇప్పుడు ఇంకొక పరిస్థితిని పరిశీలిద్దాము. నీవు వీధిలో వెళుతున్నావు ఒక చెట్టు క్రిందినుండి వెడలునపుడు  నీ తలమీద  చెట్టు మీదినుంచి ఒక కాయ పడి నీకు గాయమైనది తత్ద్వారా నీకు బాధ కలిగింది.  అది నీ స్వయంకృత అపరాధం అనుభవించాలసిందే.  అదే నీ తలకు  ఎవరో రాయి విసిరి  గాయ పరచారనుకో అప్పుడు నీకు కలిగిన  బాధ కూడా ఇంతకూ ముందు బాధ లాంటిదే కానీ దాని కారకుడు  ఆ రాయి విసిరినవాడు. రాయి విసరటం తత్ ద్వారా నీకు బాధ కలుగ చేయటం అనే కర్మ చేసిన  దానికి ప్రతిగా అతనికి లభించే కర్మ ఫలమే పాపము. 

అంటే నీకు ఇతరులు ఏది చేస్తే నీ మనస్సు ఆనందపడుతుందో అది నీవు ఇతరులకు చేయటం అనే కర్మకు లభించునది పుణ్య ఫలము.  అదే మాదిరిగా నీకు ఇతరరులకు  ఏది చేస్తే నీకు బాధ కలుగుతుందో అది నీవు ఇతరులకు చేసిన ఆ కర్మకు లభించిన ఫలమే పాపము. 

పాప పుణ్యాలు రెండు మనకు ఇప్పుడు తెలిసినవి మరి ఆ ఫలితం అని అంటున్నం కదా మరి ఫలితం అనుభవంలోకి రావాలి కదా అది ఎప్పుడు. దీని వివరణకు మనము ముందుగా చెప్పుకున్న గృహ ఉదాహరణ లోకి వెళదాము. నీవు సొంతంగా గృహాన్ని నిర్మించుకున్నావు అంటే నీకు ధనము లభించినది ఆలా ధనము లభించటం నీవు గతంలో చేసుకున్న కర్మ యెక్క పుణ్య ఫలము ఆ ఫలము నీకు ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది అన్నమాట.  అదే విధంగా నీ తలకు చెట్టు కాయ పడి గాయము అవటం అన్నది నీవు గతంలో చేసుకున్న పాపా ఫలము ఇప్పుడు అనుభవానికి వచ్చింది అని అర్ధం చేసుకోవాలి. 

మనము బ్యాంకులో అకౌంటు తెరుచుకుంటాము. అంటే మనం సంపాదించిన ధనాన్ని బ్యాంకులో దాచుకుంటాము.  మనకు అక్కరకు వచ్చినప్పుడు బ్యాంకునుండి ధనాన్ని తీసుకొని వాడుకుంటాము.  అదే విధంగా మన పుణ్య ఫలం కూడా మనకు ఉపయోగ పడుతుంది.  మనం ఏదైనా కోరిక నెరవేరటానికి ఒక వ్రతమో, పూజో, జపమో ఆచరిస్తాము కదా అప్పుడు మనం కోరుకునే కోరిక నెరవేరటం  కద్దు. కొంతమంది అంటుంటారు నేను తిరగని క్షేత్రం లేదు మునగని తీర్ధం లేదు ఏ దేముడు కూడా నన్ను కరుణించటంలేదు నా కస్టాలు కష్టాలుగానే వున్నాయి.  ఇది సహజకుడా. నీవు ఏ కోరికతో నోము నోమావో అదే విధాంగా నేను చేసానే మరి నీకు ఫలించి నాకెందుకు ఫలించలేదు అని పలువురు చెప్పటం మనకు  తెలిసిందే. 

ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి భగవంతుడిని మనం ఒక బ్యాంకు మేనేజరుగా ఒక్క సారి ఉహించు కుందాము. నేను ఒక లక్ష రూపాయల చెక్కు బ్యంకులో ద్రవ్య విడుదలకు ఉంచాననుకోండి అది చూసి మేనేజరుగారు నా అకౌంటులో బ్యాలన్సు లక్ష కన్నా ఎక్కువ ఉంటే వెంటనే దానిని ఆమోదించి నాకు లక్ష రూపాయలు విడుదల చేస్తారు.  నాలాగా నీవు కూడా లక్ష రూపాయల చెక్కు బ్యాంకులో వేశావనుకో నీకు అకౌంటులో యాబై వేలే వున్నాయనుకో నీ చెక్కుకు నీవు కోరిన లక్ష రూపాయలు ఇవ్వకుండా నీ చెక్కు నీకు వాపసు చేయటం కద్దు. ఈ ఉపమానాన్ని మనం భగవంతుని విషయంలో అనుసరిద్దాము. నీవు చేసిన పూజ, జపము, నోము అనునవి భగవంతుడైన బ్యాంకు మేనేజరుగారికి అందచేసిన చెక్కు లాంటిది.  నీ అకౌంటులో పుణ్య ఫలము నీవు కోరుకున్న కోరికకు సరిపడా ఉంటే నీ చెక్కు ఆమోదించబడింది అంటే నీ నోము ఫలిస్తుంది తద్వారా నీ కోరిక ఇడేరుతుంది.  కానీ నీ అకౌంటులో పుణ్యఫలం తక్కువగా వున్న నీ చెక్కు రిటర్న్ అవుంతుంది అంటే నీ కోరిక తీరదు. ఇక్కడ మనం తెలుసుకోవలసింది భావవంతుడు ఎవరి కోరికలు తీర్చడు లేక తీర్చ నిరాకరించడు కేవలము నీ పాప పుణ్య ఫలితాలను మాత్రమే నీకు అందచేస్తాడు.  అందుకే భగవంతుడిని ఒక సాక్షి భూతంగా పేర్కొంటారు. 

ఇప్పటి వరకు మనం కృష్ణ భగవానులు తెలిపిన  కర్మ, వికర్మలను విశదీకరించుకున్నాము. మరి అకర్మ అంటే  ఏమిటి అది ఏరకమైన కర్మ. 

సామాన్య దృష్టితో ఆలోచిస్తే కర్మ అంటే సుకర్మ అని చెప్పుకోవచ్చు అంటే మంచి పని.  అదేవిధంగా వికర్మ అంటే దుష్ట కర్మ చెడుపని అని చెప్పుకోవచ్చు మరి ఈ రెండు కానిది ఇంకొకటి ఉండే అవకాశమే లేదు కాదా  అటువంటప్పుడు ఈ అకర్మ ఏమిటి. దీనిని కర్మ లేదనే భావంలో కూడా అర్ధం చేసుకోవచ్చు కదా అనగా కర్మ చేయకుండా వుండటమా అని మనం అనుకోవచ్చు.  కానీ నిజానికి అకర్మ అంటే కర్మ చేయకుండా వుండటము కాదు. ఉదాహరణకు యోగ్యుడు అంటే సమర్ధుడు అనే అర్ధం చెప్పుకున్నాము అదే విధంగా అయోగ్యుడు అంటే అసమర్ధుడు అని కదా మన అర్ధం ఐతే అకర్మ అంటే కర్మ కాదు లేక కర్మలేదు అనే అర్ధాలు చెప్పవచ్చా అంటే ఆలా చెప్పవీలు లేదు. . 

మనిషి ఊపిరి పోసుకున్నప్పడినుండి ఊపిరి ఆగే వరకు కర్మలు చేస్తూనే ఉంటాడు.  అయితే మనం కర్మలు రెండు రకాలుగా చేస్తున్నాము 1) బుద్దితో చేసే కర్మలు అంటే మనం ఉద్దేశపూర్వకంగా చేసే పనులు. 2) బుద్ధికి తెలియకుండా చేసే పనులు. ఇవి శరీర అంతరకర్మలు మరియు జ్ఞాన రహిత కర్మలు అంటే మన బుద్ధికి తెలియని పనులు  అని అనవచ్చనుకుంటా. మనం నిత్యం శ్వాసిస్తూ  ఉంటాము. గాలిలో అనేక సూక్ష్మ జీవులు మన నాసాపుటాల ద్వారా మన శరీరంలోకి వేళ్ళ వచ్చు.  అందులో కొన్ని మన శరీర ఉష్ణోగ్రతకు చనిపోవచ్చు కూడా. ఆ విషయం మనకు తెలియనే తెలియదు.  ఈ కరోనా వైరస్ తీసుకోండి అది మన కంటికి కనిపించదు గాలిలో ఉంటుంది.  అది గాలిలోంచి యెట్లా శరీరంలోకి వస్తుంది ఎవరు  గుర్తించలేరు. అది శరీరాన్ని వినాశనం చేశాకే  తెలుస్తుంది. అదే మనిషికి ముందుగా దాని ఉనికి తెలిసి ఉంటే ఎవ్వరు దాని జోలికి పొరుకదా. అదే విధంగా మనం రోజు నీళ్లు తాగుతుంటాము, ఆహారము తీసుకుంటాము తత్ ద్వారా అనేక సూక్ష్మ జీవులు మన శరీరంలోకి మనకు తెలియకుండా వెడలి నశించ వచ్చు. 

మన శరీర అంతర్గత కర్మలే కాకుండ శరీర బహిర్గత కర్మలు కూడా కొన్ని  మనము బుద్ధికి తెలియకుండా చేస్తాము. గమనించండి మనం వీధిలో నడుచుకుంటూ పోతున్నామనుకోండి మన పాదాల  క్రింద ఎన్నో చీమలు అంతకంటే చిన్న చిన్న క్రిమి కీకాదులు పడి చనిపొవచ్చు వాటి గూర్చిన వివరాలు మనకు కనీసం తెలియను  కూడా తెలియదు. ఇప్పుడు సమస్య ఏమిటంటే ఈ రకంగా చేసే కర్మలు మనం పాప కర్మలుగా భావించ వచ్చా లేదా. నిజానికి ఈ కర్మల ఫలితం పాపమే అయి ఉండాలి . కానీ కాదు ఎందుకంటె ఈ కర్మలు చేసింది నీవే అయినా అవి నీవు ఉద్దేశపూర్వకంగా చేయలేదు కాబట్టి వాటి ఫలితంగా పాపము సోకదు. 

ఇక్కడ మన భారత న్యాయశాస్త్ర సంబంధిత ఉదాహరణ ఇవ్వ ప్రయత్నింతును.  ఒక మనిషిని ఎవరైనా చంపినారనుకోండి దానిని ఆంగ్లములో "మార్దరు' అని ఐపీసీ 300 సెక్షను ప్రకారము నిర్వచించి వున్నారు దానికి శిక్ష  ఐపీసీ 302 సెక్షను ప్రకారము జీవిత కాల జైలు శిక్ష లేక ఉరి శిక్ష అని వుంది. . అదే ఒక వాహనము క్రింద మనిషి పొరపాటున పడి చనిపోతే కేవలము 3 సం. జైలు శిక్ష మాత్రమే విధిస్తారు. ఫై కేసులో మరియు క్రింది కేసులో రెండిటిలో మనిషి ప్రాణం పోయిందికదా మరి శిక్షలలో తేడా ఎందుకు అంటే మొదటి కేసులో ఉద్దేశము అంటే బుద్ది  వుంది రెండవ కేసులో ఉద్దేశ్యము అంటే ఆ మనిషి చనిపోతాడని బుద్ది లేదు.  భగవంతుని దృష్టిలో కూడా ఇదే విధిగా ఉంటుంది. 

ఈశ్వరార్పణగా  చేసే కర్మలు వీటినే భగవానులు అకర్మలు అన్నారు.  మనం ఒక జపం చేస్తాము చివరన " ఏతత్ ఫలం సర్వం ఈశ్వరార్పణమస్తు " అని భగవంతునికి ఆ జప ఫలాన్ని  దార పోస్తాము. అంటే మనం చేసిన జప ఫలం మనం ఉంచుకోకుండా అర్పితం చేసామన్న మాట. అప్పుడు ఆ ఫలము మనకు పుణ్యం కోటాలో కానీ    అది వికర్మ కూడా కాదు కాబట్టి పాపం కోటాలో కూడా రాదు.  ఈ రెండు అకౌంట్లలో జమ కాని కర్మ అనుమాట అందుకే అక్కడ కర్మ ఉన్న దాని ఫలితము లేదు.  ఎప్పుడైతే కర్మ ఫలము ఉండదో అప్పుడు ఆఫలితానిని అనుభవించటం కూడా ఉండదు. 

సామాన్యు మానవ దృష్టితో చుస్తే అందరు పుణ్య కర్మలు చేసి పుణ్యం పొందాలని చూస్తారు.  కానీ కర్మ ఫలాన్ని ఈశ్వరార్పణ చేయాలనుకోరు. మరి ఇటుటుంవంటి కర్మలు ఎందుకు చేయాలి అన్న సందేహం కలుగుతుంది. ఏ జీవుడి పాప పుణ్యాలు సమతుల్యం అవుతాయో వాడు మోక్షాన్ని పొందుతాడు.  అది ఎలా సాధ్యం అంటే చేసే కర్మలను ఈశ్వరప్పణ చేయటం వలెనే సాధ్యం అని మహర్షులు మనకు విశదీకరించారు. 

మోక్షం పొందటానికి సులువైన మార్గము: 

నేనే దేముడిని ప్రతి మనిషి తనకు తానూ దేముడు అనుకోటము ఉత్తమము.  ఇప్పుడు మీకు మీరు దేముడిని అనుకున్నారనుకోండి.  అప్పుడు దేముడు ఎలా ఉంటాడో ఆలా మీరు వుండండి.  దేముడికి త్రిగుణాలు ఉన్నాయా లేవు మీరు కూడా త్రిగుణాలను త్యజించండి. అంటే మీకు మేలు చేసే వారి మీద ప్రేమ మీకు కీడు చేసే వారి మీద కోపము, ప్రతికారము వుండవన్నమాట.  మీకు మేలుచేసిన వారిపై కృతజ్ఞత లేదు, కీడు చేసిన వానిపై కోపము లేదు.  అంటే మీరు ఏ ఫలము పొందారన్న మాట అప్పుడు మీ పాపా పుణ్యాల అకౌంట్ షీట్ ఖాళీగా ఉంటుంది.  దాని పర్యవసానం గా మీరు ఏ ఫలము అనుభవించ పనిలేదు. కర్మ ఫలము ఎప్పుడైతే సూన్యము అవుతుందో అప్పుడు ప్రారబ్ద ఫలము  ఏమి ఉండదు.  ప్రారబ్ధము లేనపుడు జన్మ లేదు.  అంటే మీకు సిద్దించేది కేవలము  మోక్షము 

ఒకసారి నేను నా బుద్దిమాంద్యముతో కృష్ణ భగవానుని గీతలో ముఖ్యమైన శ్లోకము ఏది అని యోచన చేసి యుంటిని.  తరువాత నా అనుభవంలోకి వచ్చిన విషయము.  శ్రీమత్ భగవత్గీతలో మొదటి అధ్యాయం మొదటి శ్లోకము నుండి చివరి అధ్యాయము చివరి శ్లోకము వరకు ప్రతిదీ ముఖ్యమైనదే అని నా మాది తట్టినది.  ఇది సరి కాదని ఎవరైనా అనగలరా. 

మనం తరించాలంటే గీత మొత్తం చదవనవసరము లేదు ఏ ఒక్క శ్లోకాన్నేనా పరిపూర్ణంగా అవగతము చేసుకుంటే చాలని నాకనిపించింది. 

ఓం తత్ సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

సర్వే జన సుఖినో భవంతు 

మీ సుజన విధేయుడు 

సి. భార్గవ శర్మ 





కామెంట్‌లు లేవు: