13, అక్టోబర్ 2021, బుధవారం

గౌరీపూజ ఎందుకు చేయాలి ?

 గౌరీపూజ ఎందుకు చేయాలి ?

(జగద్గురుబోధల నుండి)



ఆంధ్రదేశంలోనూ, ఉత్తరదేశంలోనూ వివాహకాలంలో గౌరీపూజచేసే అలవాటొకటి చాలాకాలంనుంచీ వస్తున్నది. రుక్మిణీదేవి కృష్ణునే వివాహంచేసుకోవాలని సంకల్పించుకొని తనకోరిక నెరవేరడంకోసం గౌరీపూజచేసి కృష్ణుని భర్తగా పొందినట్లు భాగవతంలో మనం చదువుతున్నాం.


అయితే రుక్మిణీదేవి ఏ సరస్వతినో, లక్ష్మినో ఆరాధించక అందుకు అంబికనే ఎందుకు ఎన్నుకొంది? అవివాహితలైన కన్యలు పెండ్లికాగానే పాతివ్రత్యం పరిపాలించాలంటే, అన్నివిషయాలలోనూ భర్తకు అనుగుణంగా నడుచుకోవాలి. ఎంతో చిత్తదార్ఢ్యం ఉంటేకాని అది జరిగేమాట కాదు. పతీత్వపాతివ్రత్యాల ఆకృతియే అంబిక. ఆమె దక్షునకు కూతురైనపుడు తన తండ్రి భర్తను దూషించినాడన్న కారణంచేత శరీరమే త్యాగంచేసింది. పార్వతిగా పుట్టినపిదపకూడా ఆపరమేశ్వరునే పెళ్లాడాలని ఉగ్రతపం చేసింది. తాను అనుకొన్న కార్యం సాధించింది.


లక్ష్మీదేవి పతివ్రతగా ఉన్నదంటే అందు పెద్దవిశేషమేమీ లేదు. అందమూ, చందమూ, అలంకారమూ, ఐశ్వర్యమూ ఉన్న మహాప్రభువు మహావిష్ణువు. అట్టివాడు భర్త అయితే ఎవరయినా పతివ్రతయే అయిపోతుంది. మాధవుని తీరు ఒకటి, మహాదేవుని తీరు మరొకటి. ఈయన ఉనికి వల్ల కాట్లో, పాములు మెడలో, కపాలం చేతిలో, ఇట్లా ఈయనది ఘోరమైన స్వరూపం.


యాతే రుద్ర శివాతనూ రఘోరాపాపకాశినీ,

అఘోరేభ్యో థఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః 


(రుద్రము)



ఈమహాఘోరస్వరూపాన్ని భర్తగా వరించి, పాతివ్రత్యాన్ని అనుష్ఠిస్తూ, భర్తను తండ్రి దూషించినాడన్న కారణంగా శరీరత్యాగంచేసి, మరల అతనికై తపస్సుచేసి, అతనినే పెళ్ళిచేసుకొన్న పరమసతి సర్వమంగళను ఆరాధిస్తే పాతివ్రత్యమూ లభిస్తుంది, ఆమె అనుగ్రహమూ స్థిరంగా ఉంటుంది. స్త్రీకి పాతివ్రత్యం ఎంత ముఖ్యమో, పురుషులకు గురుభక్తి అంత ముఖ్యం.


ఓంకార పంజరశుకీ ముపనిష దుద్యానకేళి కలకంఠీం

ఆగమ విపినమయూరీ మార్యా మంతర్విభావయేగౌరీం


దయమాన దీర్ఘనయనాం దేశికరూపేణ దర్శితాభ్యుదయాం.



అని కాళిదాస మహాకవి అంబికాస్తవం చేశాడు. అందులో ఆచార్యస్వరూపము సాక్షాదంబికయే అని వ్రాశాడు.


అవటుతటఘటితచూలీం తాడితపలాశ తాటంకాం,

వీణావాదనవేలా కంపిత శిరసం నమామి మాతంగీమ్‌||



అనేది ఆయన వ్రాసినదే మరొకశ్లోకం. తాళీపలాశం అనగా తాటాకు. మాతంగికి తాటాకులే తాటంకాలట. అందుచేతనే గౌరీపూజలో నల్లపూసలూ, తాటాకు ఈనాటికిన్నీ వినియుక్తమవుతున్నవి. అందుచేత పెండ్లి చేసుకొనే కన్నెపడుచులు నిత్యకల్యాణంగా ఆనందంగా ఉండాలని కోరుకొనేటట్లయితే సర్వమంగళను ఆరాధించవలె.


అంబికను ఆరాధించేవారికి గురుభక్తీ పతిభక్తీ సులభము లయిపోతవి. రుక్మిణీదేవి గౌరీపూజ చేయడంకూడా అందుకోసమే. అంబిక తాటంకములను కాళిదాసు వర్ణించినట్లే శంకర భగవత్పాదులవారున్నూ వర్ణించినారు.


పురా రాతే రంతః పురమసి తత స్త్వ చ్చరణయో

స్సపర్యా మర్యాదా తరళ కరణానామ సులభా,

తథాహ్యేతే నీతా శ్శతమఖముఖా స్సిద్ధి మతులాం

తవ ద్వారోపాస్త స్థితిభి రణిమాద్యాఖిరమరాః 


(సౌందర్యలహరి)



శ్రీచక్రము మహామేరు స్వరూపమైనది. అందు పలు ఆవరణ లున్నవి. ప్రతి ఆవరణకున్నూ అధిదేవత లున్నారు. బిందుస్థానమే పరాశక్తి. అది అన్నిటికంటె ముఖ్యమైనది. తక్కినవన్నీ చిన్న చిన్న శక్తిస్వరూపాలు. అంబిక ఉండే చింతామణి గృహంలో నవావరణ లున్నవి (తొమ్మిది ఆవరణలు). ఇవి ఒకదానికొకటి కోటియోజనాలదూరంలో ఉన్నవి. కడపటి ద్వారం అణిమాది అష్టసిద్ధులకై ఏర్పడినది. ఆద్వారానికిన్నీ అంబిక ఉన్న స్థానానికిన్నీ ఎంతో దూరము అయినప్పటికిన్నీ ద్వారోపాంతంలో నిలబడేసరికి ఆణిమాదిశక్తుల అనుగ్రహం చేత ఐశ్వర్యం లభిస్తుంది.


ఇంద్రాదిదేవతలు ఈతొమ్మిదవ ఆవరణనే దాటలేదు. అక్కడకు వచ్చేసరికి వాళ్లు అష్టవిభూతిశక్తుల అనుగ్రహం పొందుతున్నారు. వీళ్ళకు పరదేవతను చూడగల ఇంద్రియ నిగ్రహం లేదు. అసలు సనకాది యోగివర్యులకే లేదు. అంతఃపురంలోకి వెళ్ళవలెనంటే ఎంత ఇంద్రియనిగ్రహం ఉండాలి?


అట్టి అనుత్తరమైన శక్తి అంబికది. ఆమెయొక్క పరిపూర్ణచైతన్యము ముందు కలికాలపు జనులు ఆగలేరనియే, ఆచార్యులవారు జంబుకేశ్వరక్షేత్రానికి వెళ్ళినపుడు, అఖిలాండేశ్వరిని ప్రార్థించి, ఆమె శక్తిని ఆకర్షించి, రత్నమయమైన శ్రీచక్రాన్ని ఒక కర్ణంలోనూ, పంచాక్షరీయంత్రాన్ని మరొక కర్ణంలోనూ తాటంకాలుగా ప్రతిష్ఠచేసి ఆమెను సౌమ్య స్వరూపిణిగా చేశారు.


ఇంత మహిమ పరమేశ్వరునికి సిద్ధించిందంటే, దానికి మూలం నీ తాటంకమహిమే కదా అంటూ అఖిలాండేశ్వరి తాటంకాలను స్మరిస్తూ ఆచార్యులవారు ఈక్రిందిశ్లోకాన్ని సౌందర్యలహరిలో వ్రాసినారు.


సుధామప్యాస్యాద్యా ప్రతిభయ జరామృత్యు హరిణీం

విపద్యంతే విశ్వే విధిశత మశాద్యా దివిషదః,

కరాళం యత్వేక్షళం కబళిత వతః కాలకలనా

నశం భో స్తన్మూలం జనని తాటంక మహిమా||



తమకు జరామరణాలుండరాదని అమృతం త్రాగారు. కాని ప్రళయకాలంలో వాళ్ళుకూడా విపత్తుపొందుతున్నారు. భయగ్రస్తులవుతున్నారు. కాని హాలాహలాన్ని మింగికూచున్న పరమేశ్వరుడుమాత్రం చెక్కుచెదరకఉన్నాడు. విషం తిని విశ్వేశ్వరుడు ఏ అభిప్రాయమూలేక సురక్షితంగా ఉంటే, అమృతపానం చేసిన అమరులు దిక్కులేక చస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే, నీ తాటంకమహిమే అని ఆచార్యుల వారన్నారు.


యాతే రుద్ర శివాతనూః శివా విశ్వాహ భేషజీ,

శివా రుద్రస్య భేషజీ తథానో మృడజీవసే 


(రుద్రము)



'పరమేశ్వరా నీవు పుట్టినావు సరే నీకు మందు ఎవరిస్తున్నారు? రెండురకాలయిన శరీరాలున్నాయి నీకు. అందులో ఒకటి ఘోరమైనది. మరొకటి మంగళకరమైనది. ఘోర స్వరూపము నీది. పరమమంగళస్వరూపముతో విలసిల్లుతున్న దేహమున్నదే అది అంబికది. ఈవిశ్వానికంతా ఆ విశ్వేశ్వరి ఔషధప్రాయంగా ఉన్నది. ఆమె కటాక్షముంటే చాలు. అకాలమృత్యువనే మాట ఆ చుట్టుప్రక్కల ఎక్కడా వినబడదు. నీకున్నూ ఆమెయే భేషజియై, వైద్యం చేస్తున్నది కాబోలు. పరమమంగళకరమైన ఆమె శరీరం నిన్ను అంటిపెట్టుకొని ఉండటం వల్లనే జీవిస్తున్నావు'.


శివః శక్త్యా యుక్తో యదిభవతి శక్తః ప్రభవితుం

నచే దేవం దేవో నఖలు కుశలః స్పందితు మపి,

అత స్త్యా మారాధ్యాం హరిహరవిరించాదిభి రపి

ప్రణంతుం స్తోతుం వా కథ మకృతపుణ్యః ప్రభవతి. 


(సౌందర్యలహరి)



శివుడు శక్తితో కలిస్తేనే జగన్నిర్మాణశక్తి కల్గినవాడవుతాడు. లేకపోతే ఆయనకు కదలటానికి కూడా సత్తువ ఉండదు. పరాశక్తి పరమేశ్వరునికే మూలశక్తిగా ఉన్నది. అటువంటి అంబికను ఆరాధించాలంటే ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి? భర్తయొక్క ఘోరస్వరూపంవల్ల అంబికా పాతివ్రత్యం మరింత ప్రకటితమవుతున్నది. అందుచే ఆమెను ఆరాధించేవారికి ప్రాతివ్రత్యమూ, మంగళమూ, దృఢచిత్తమూ సులభంగా లభిస్తవి.

🙏🙏🕉️🕉️🙏🙏

కామెంట్‌లు లేవు: