*12.10.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - పదునాలుగవ అధ్యాయము*
*భక్తియోగమహిమ - ధ్యానవిధి వర్ణనము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*14.23 (ఇరువది మూడవ శ్లోకము)*
*కథం వినా రోమహర్షం ద్రవతా చేతసా వినా|*
*వినాఽఽనందాశ్రుకలయా శుధ్యేద్భక్త్యా వినాఽఽశయః॥12751॥*
నిశ్చలమైన భక్తిచే వ్యక్తియొక్క శరీరము పులకాంకితము గావలెను. హృదయము ద్రవింపవలెను. ఆనందాశ్రువులు స్రవింపవలెను. అట్లుకానినాడు అతని అంతఃకరణము పూర్తిగా పరిశుద్ధముకాదు.
*14.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*
*వాగ్గద్గదా ద్రవతే యస్య చిత్తం రుదత్యభీక్ష్ణం హసతి క్వచిచ్చ|*
*విలజ్జ ఉద్గాయతి నృత్యతే చ మద్భక్తియుక్తో భువనం పునాతి॥12752॥*
భక్తిప్రభావములో మునిగినవానికి కంఠము గద్గదమగును. చిత్తము ద్రవించును. ఆ స్వామి దర్శనమునకై గట్టిగా పిలుచుచు అతడు ఏడ్చును. తనలోతాను నవ్వుకొనును. ఆ పారవశ్యములో ఏమాత్రమూ సిగ్గుపడక బిగ్గరగా ఆ ప్రభువును కీర్తించును. ఒడలు మరచి నృత్యము చేయును. అట్టి దృఢభక్తిచిత్తుడు ఈ లోకమునే పునీతమొనర్చును.
*14.25 (ఇరువది ఐదవ శ్లోకము)*
*యథాగ్నినా హేమ మలం జహాతి ధ్మాతం పునః స్వం భజతే చ రూపమ్|*
*ఆత్మా చ కర్మానుశయం విధూయ మద్భక్తియోగేన భజత్యథో మామ్॥12753॥*
అగ్నిలో పుటము పెట్టిన పిదప బంగారములోని మాలిన్యము లన్నియును తొలగిపోవును. అనంతరము అది తన సహజమైన వన్నెతో ప్రకాశించును. అట్లే భక్తియోగముద్వారా సాధకుని కర్మవాసనలు అన్నియును రూపుమాయును, అంతట స్వస్వరూపసాక్షాత్కారముతో అతడు నన్ను సేవించుచు తరించును.
*14.26 (ఇరువది ఆరవ శ్లోకము)*
*యథా యథాఽఽత్మా పరిమృజ్యతేఽసౌ మత్పుణ్యగాథాశ్రవణాభిధానైః|*
*తథా తథా పశ్యతి వస్తు సూక్ష్మం చక్షుర్యథైవాంజనసంప్రయుక్తమ్॥12754॥*
కాటుక పెట్టుకొనుటచేత తిన్నతిన్నగా నేత్రమునందలి దోషములు తొలగిపోవును. అందువలన సూక్ష్మములైన వస్తువులు స్పష్టముగా కనబడును. అట్లే పరమపవిత్రములైన నా పుణ్యగాథలను వినుటవలనను, నామ సంకీర్తనవలనను క్రమక్రమముగా సాధకునిలోని చిత్తమాలిన్యములు అన్నియును దూరముకాగా, అతనికి సూక్ష్మమైన నా వాస్తవతత్త్వము బోధపడును.
*14.27 (ఇరువది ఏడవ శ్లోకము)*
*విషయాన్ ధ్యాయతశ్చిత్తం విషయేషు విషజ్జతే|*
*మామనుస్మరతశ్చిత్తం మయ్యేవ ప్రవిలీయతే॥12755॥*
పురుషుడు నిరంతరము శబ్దాది విషయములనే చింతించుచున్నచో అతని చిత్తము వాటిలోనే చిక్కుకొని పోవును. నన్ను ధ్యానించు చుండువాని చిత్తము నాలోనే లీనమగును.
*14.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*
*తస్మాదసదభిధ్యానం యథా స్వప్నమనోరథమ్|*
*హిత్వా మయి సమాధత్స్వ మనో మద్భావభావితమ్॥12756॥*
అసద్వస్తువుల (నశ్వరవస్తువుల) చింతనము స్వప్నమనోరథములవలె మిథ్యయే యగును. కావున వాటిని చింతించుటమాని, సద్వస్తువునైన (శాశ్వతుడనైన) నన్నే ధ్యానించుచు, మనస్సును నాయందే లగ్నమొనర్పుము.
*14.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*
*స్త్రీణాం స్త్రీసంగినాం సంగం త్యక్త్వా దూరత ఆత్మవాన్|*
*క్షేమే వివిక్త ఆసీనశ్చింతయేన్మామతంద్రితః॥12757॥*
*14.30 (ముప్పదియవ శ్లోకము)*
*న తథాస్య భవేత్క్లేశో బంధశ్చాన్యప్రసంగతః|*
*యోషిత్సంగాద్యథా పుంసో యథా తత్సంగిసంగతః॥12758॥*
స్త్రీల సాంగత్యమువలన గాని, స్త్రీల సాంగత్యముగల వారితోడి సాంగత్యమునగాని క్లేశములు, బంధములు పరంపరగా పెరుగును. కనుక వారినుండియు, ఇతర లంపటములనుండియు దూరముగా తొలగిపోవలయును. కనుక సాధకుడు పవిత్రమైన ఏకాంతప్రదేశమున కూర్చొని, జితేంద్రియుడై సావధానముతో నన్ను ధ్యానింపవలెను. తత్ప్రభావమున క్లేశములు నశించును, బంధములు తొలగును.
*ఉద్ధవ ఉవాచ*
*14.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*
*యథా త్వామరవిందాక్ష యాదృశం వా యదాత్మకమ్|*
*ధ్యాయేన్ముముక్షురేతన్మే ధ్యానం త్వం వక్తుమర్హసి,12759॥*
*ఉద్ధవుడు పలికెను* "కమలనయనా! ముముక్షువు నీయొక్క ఏరూపమును ధ్యానింపవలెను? ఎట్లు ధ్యానింపవలెను? ఈ విషయములను నాకు విపులముగా తెలుపుము"
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి