13, అక్టోబర్ 2021, బుధవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*452వ నామ మంత్రము* 13.10.2021


*ఓం తేజోవత్యై నమః*


సూర్యుడు, చంద్రుడు, అగ్ని వంటి తేజోమూర్తులకు తేజస్సును ప్రసాదించిన తేజస్స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *తేజోవతీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం తేజోవత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను స్మరించు భక్తులు తేజోవంతులై, సదా ఆరోగ్యపరిపూర్ణతతో విరాజిల్లుదురు.


జగన్మాత సోమసూర్యాగ్ని తేజస్సులకు ఆధారమైన తేజస్సుగలిగియున్నది.


వేదములందు *ఓ గార్గీ! ఈ పరమాత్మయందు సూర్యచంద్రులిద్దరును ధరింపబడియుండిరి* అని గలదు. అనగా సూర్యుడు, చంద్రుడు, అగ్ని వంటి తేజోమూర్తులకు తేజస్సును అమ్మవారే ప్రసాదించినది అని భావింపదగును.


శంకరభగవత్పాదులవారు సౌందర్యలహరియందు పదునాలుగవ శ్లోకంలో వివరించిన విధానం ఇలా ఉన్నది.


*క్షితౌ షట్పంచాశ - ద్ద్విసమధిక పంచాశ దుదకే*


*హుతాశే ద్వాషష్టి - శ్చతురధిక పంచాశ దనిలే |*


*దివి ద్విఃషట్త్రింశ - న్మనసి చ చతుఃషష్టిరితి యే*


*మయూఖాస్తేషామప్యుపరి తవ - పాదాంబుజయుగమ్ || 14 ||*


*షట్చక్రాలలోని సహస్రారములో ఉండు దేవి పాదప్రకాశ వైభవం.*


*భావము*


అమ్మా...భగవతీ..యోగసాధనలో సాధకుడు షట్చక్రాలనూ అధిగమించి,సహస్రారములో ఉన్న నీపాదపద్మాలు చేరాలంటే తన దేహంలో ఉన్న పృధివీతత్వంతో కూడిన మూలాధార చక్రంలో 56 కిరణాలను దాటి, జలతత్వాత్మికమైన మణిపూరక చక్రంలో 52 మయూఖములను దాటి, అగ్నితత్వాత్మికమైన అనాహత చక్రంలో54 కాంతిరేఖలు దాటి,ఆకాశతత్వాత్మికమైన విశుద్దచక్రమునందు 72 కాంతికిరణాలు దాటి, మనస్తత్వంతో కూడిన ఆజ్ఞాచక్రము నందు 64 కిరణపుంజాలు దాటి, ఈ ప్రకారముగా ప్రసిద్ధములైన ఈ మయూఖములు దాటి పైకి చేరుకోగా అచట సహస్ర దళ మధ్యగత చంద్రబింబాత్మకమైన బైందవ స్థానమున, సుధాసింధువునందు నీయొక్క పాదపద్మముల జంట గోచరమగుచున్నది.


*ఈ శ్లోకములో ఆది శంకరులు చెప్పిన ప్రకారం*


శ్రీ చక్రమునందు మూలాధార, స్వాదిష్టాన, మణిపూర. అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రములును, సహస్రారము కలవు. ఈ ఆరు చక్రములును సోమ, సూర్య, అనలా(అగ్ని)త్మకములుగా మూడు ఖండములు. ''మూలాధార, స్వాదిష్టాన యుగళమైన ప్రథమ ఖండమునకు పై భాగమున ''అగ్నిస్థానము'' అదియే (రుద్రగ్రంథి). మణిపూర, అనాహత చక్రములు రెండోవ ఖండము. ''సూర్యస్థానము'' అదియే (విష్ణుగ్రంథి). విశుద్ధ, అజ్ఞాచక్రములు మూడవ ఖండము ''చంద్రస్థానము'' అదియే (బ్రహ్మగ్రంథి)

ప్రథమఖండము పైనున్న అగ్ని తన జ్వాలలచేత ప్రథమఖండమును వ్యాపింపజేయును. రెండవ ఖండము పైనున్న సూర్యుడు తన కిరణముల చేత రెండవ ఖండమును వ్యాపింపజేయును.

మూడవఖండము పైనున్న చంద్రుడు తన కళలచేత మూడవఖండమును వ్యాపింపజేయును. పృథ్వీ తత్త్వాత్మిక మూలాధార చక్రమున (పృథ్వీ అగ్ని జ్వాలలు 56), మణిపూర చక్రమున (ఉదక తత్త్వాత్మిక జ్వాలలు 52) కలిపి 108 అగ్ని జ్వాలలు.

అట్లే స్వాధిష్టాన (అగ్ని తత్త్వాత్మిక కిరణములు 62), అనాహత చక్రమున (వాయు తత్త్వాత్మిక కిరణములు 54) కలిపి 116 సూర్య కిరణములు. 

ఆకాశ తత్త్వాత్మకమగు (విశుద్ధ చక్రమున 72), మనస్తత్త్వాత్మకమగు (ఆజ్ఞా చక్రమున 64) కలిసి 136 చంద్రుని కళలు అగుచున్నవి. ఇవి 108+116+136 మొత్తం 360 కిరణములు అగును. ఈ కిరణాలన్నియు అమ్మవారి పాదములనుండి వెడలినవే. సూర్యుని ప్రకాశం వలన పగలు, చంద్రుని ప్రకాశం వలన రాత్రి, అగ్ని వలన సంధ్యాసమయములు ఈ జగత్తునందలి సకల వ్యాపారములు సాగుచున్నవి. ఈ కిరణములు శ్రీచక్రమునందలి తొమ్మిది ఆవరణములనుండి ప్రసరించుచున్నవి. సాక్షాత్తు శ్రీచక్రస్వరూపిణియైన పరమేశ్వరి, అందుచేతనే *తేజోవతీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం తేజోవత్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: