13, అక్టోబర్ 2021, బుధవారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి లీలలు..


*నడిపించే దైవం..*


అవధూతల, సద్గురువుల చరిత్రలు చదివేటప్పుడు, కొన్ని కొన్ని సంఘటనలు మన మనసులో ముద్ర వేస్తాయి..

మొదట్లో ఇది నిజమా అనే సందేహం తో మొదలయ్యి, క్రమంగా బలమైన నమ్మకాన్ని కలిగిస్తాయి..

అలా సందేహం నుంచి మన మనసు సమాధాన పడే దాకా మన వెనుక వుండి నడిపేది కూడా ఆ సద్గురువే అన్న నిజం కాలక్రమేణా అవగతం అవుతుంది..


మన కళ్ళెదుటే దైవాన్ని త్రికరణశుద్ధి గా నమ్మి, బాగుపడే వ్యక్తులను చూసినప్పుడు ఏ సందేహాలకు తావుండదు..


అటువంటి ఓ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాము..


పిల్లి మాల్యాద్రి అనే వ్యక్తిని, (రోళ్ళపాడు గ్రామం, వలేటివారి పాలెం మండలం, ప్రకాశం జిల్లా) సుమారు ఒక సంవత్సరం క్రిందట అతని భార్య మొగలిచెర్ల గ్రామంలో సిద్ధి పొందిన శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి తీసుకొని వచ్చింది..


మాల్యాద్రి నడువలేడు..మాట్లాడలేడు.. అంతకు 6నెలల ముందు జబ్బు చేసింది..ఒంగోలు లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించారు..డబ్బూ ఖర్చు అయింది..ఫలితం కనబడలేదు..


ఆ ఇల్లాలికి దిక్కు తోచలేదు..మరో రెండు మూడు వైద్యశాలల్లో చూపించింది..ఎక్కడికి వెళ్లినా..చేతిలో ఉన్న డబ్బు ఖర్చు అవుతున్నది కానీ..భర్త పరిస్థితిలో మార్పులేదు.కాలం గడిచి పోతోంది..ఆవిడ మనో వేదన తీరడం లేదు..


ఒకనాడు, మొగలిచెర్ల గ్రామంలో సిద్ధి పొందిన శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి తీసుకొని పోయి, కొన్నాళ్ళు అక్కడ వుండి స్వామి వారిని నమ్మి కొలవండి మంచి జరుగుతుంది అని ఆవిడకు తెలిసిన వాళ్లలో ఒకరు చెప్పారు..ఆ మాటలు ఆ తల్లికి మనసులో నాటుకున్నాయి.."స్వామీ! అన్ని విధాలా నేను ప్రయత్నం చేసాను..చిట్ట చివరి ఆశగా నీ చెంతకు నా భర్తను తీసుకొని వస్తున్నాను..నీదే భారం.."అని మనసులో ప్రార్ధించి..నేరుగా మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి సమాధి సన్నిధి చేరుకున్నది..


క్రమం తప్పకుండా శ్రీ స్వామి వారి మందిరం చుట్టూరా ప్రదక్షిణాలు భర్తను పట్టుకుని నడిపించుకుంటూ చేసింది..ఓ పదిహేను రోజులు గడిచేసరికి క్రమంగా మార్పు కనబడసాగింది..మాల్యాద్రి మెల్లగా ఒకొక్క అడుగూ వేయసాగాడు.. మరో వారం కల్లా..భార్య సహాయం లేకుండానే తానే నడిచే స్థాయికి వచ్చాడు..అలాగే మాటలు కూడా కూడబలుక్కుని మాట్లాడసాగాడు..ఇంకొక పక్షం రోజులు గడిచేసరికి..మాల్యాద్రి తానొక్కడే వరుసక్రమం లో నిలబడి..క్యూ లైన్ లో నడచివచ్చి..శ్రీ స్వామివారి తీర్ధ ప్రసాదాలు తీసుకోసాగాడు.. సరిగ్గా మండలం రోజులు గడిచేసరికి..మాల్యాద్రి కి ఉన్న జబ్బులో డెబ్భై శాతం నయమై పోయింది....ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు!..


శ్రీ స్వామివారి సన్నిధిలో వుండే మేము ఎన్ని సార్లు, యెంతో మందిని చూసినా, ప్రతి భక్తుని అనుభవమూ మాకు పాఠమే.. 


ఆ స్వామి నమ్మినవారికి నేనున్నాను అనే అభయం ఇస్తూనే ఉన్నాడు...నిష్కల్మష భక్తీకి తాను లొంగుతానని, పదే పదే ఋజువు చేస్తూనే ఉన్నాడు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం... ప్రకాశం జిల్లా.. సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: