*13.10.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - పదునాలుగవ అధ్యాయము*
*భక్తియోగమహిమ - ధ్యానవిధి వర్ణనము*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*శ్రీభగవానువాచ*
*14.32 (ముప్పది రెండవ శ్లోకము)*
*ఆసన ఆసీనః సమకాయో యథాసుఖమ్|*
*హస్తావుత్సంగ ఆధాయ స్వనాసాగ్రకృతేక్షణః॥12760॥*
*శ్రీకృష్ణుడు వచించెను* "ఉద్ధవా! అంతగా ఎత్తైనదిగాని, నిమ్నమైనదిగాని గాక, సమప్రదేశమున ఆసనముపై కూర్చుండవలెను. శరీరమును నిటారుగానుంచి, సుఖముగా ఆసీనుడైయుండవలెను. చేతులను ఒడిలో (ఉత్సుంగమునందు) చేర్చుకొని, నాసికాగ్రమునందు దృష్టిని నిలిపియుంచవలెను.
*14.33 (ముప్పది మూడవ శ్లోకము)*
*ప్రాణస్య శోధయేన్మార్గం పూరకుంభకరేచకైః|*
*విపర్యయేణాపి శనైరభ్యసేన్నిర్జితేంద్రియః॥12761॥*
పిమ్మట సాధకుడు పూరక, కుంభక, రేచకములద్వారాను, మరల విపర్యయముగను ప్రాణాయామముద్వారా నాడీమండలమును శోధింపవలెను. జితేంద్రియుడై తిన్నతిన్నగా ప్రాణాయామమును అభ్యసింపవలెను.
*14.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*
*హృద్యవిచ్ఛిన్నమోంకారం ఘంటానాదం బిసోర్ణవత్|*
*ప్రాణేనోదీర్య తత్రాథ పునః సంవేశయేత్స్వరమ్॥12762॥*
*14.35 (ముప్పది ఐదవ శ్లోకము)*
*ఏవం ప్రణవసంయుక్తం ప్రాణమేవ సమభ్యసేత్|*
*దశకృత్వస్త్రిషవణం మాసాదర్వాగ్జితాఽనిలః॥12763॥*
మూలాధార చక్రమునుండి కమలనాళములోని దారమువలె అవిచ్ఛిన్న భావముతో ప్రాణవాయువును హృదయము వరకు చేర్చి, అచట ఘంటానాద సదృశమైన ఓంకారమును దానితో కలుపవలెను. ఈ విధముగా ప్రాణాయామమును ప్రతిదినము మూడు సమయములందు ఓంకార సహితముగా పదేసిమార్లు అభ్యసింపవలెను. ఇట్లు ఒకమాసము అభ్యసించినచో ప్రాణవాయువు వశమగును.
*14.36 (ముప్పది ఆరవ శ్లోకము)*
*హృత్పుండరీకమంతఃస్థమూర్ధ్వనాలమధోముఖమ్|*
*ధ్యాత్వోర్ధ్వముఖమున్నిద్రమష్టపత్రం సకర్ణికమ్॥12764॥*
*14.37 (ముప్పది ఏడవ శ్లోకము)*
*కర్ణికాయాం న్యసేత్సూర్యసోమాగ్నీనుత్తరోత్తరమ్|*
*వహ్నిమధ్యే స్మరేద్రూపం మమైతద్ధ్యానమంగళమ్॥12765॥*
శరీరమునందు స్థితమైయున్న హృదయమును కమలమునువలె చింతనచేయవలెను. దాని నాళము ఊర్ధ్వభాగమునకును, ముఖము అధోభాగమునకును ఉన్నట్లు భావింపవలెను. దాని ముఖము పైవైపునకు మరల వికసించినట్లు ధ్యానింపవలెను. ఆ పద్మమునకు ఎనిమిదిదళములు, మధ్యభాగమున పసుపుపచ్చని సుకుమారమైన కర్ణిక ఉండును. ఆ కర్ణికయందు క్రమముగా సూర్యచంద్రాగ్నులను స్మరింపవలెను. ఆ అగ్ని మధ్యభాగమునందు మంగళకరమైన నా రూపమును ధ్యానింపవలెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదునాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి