*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*451వ నామ మంత్రము* 13.10.2021
*ఓం విఘ్ననాశిన్యై నమః*
విద్యా (జ్ఞానమునకు కలుగు) విఘ్నములను పోగొట్టు జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *విఘ్ననాశినీ* యను అయిదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం విఘ్ననాశిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ధ్యానించు భక్తులను ఆ తల్లి సర్వకాల సర్వావస్థలయందును శుభములను కలిగించుచూ, శాంతిసౌఖ్యములతో సుఖజీవనము కొనసాగునటులనుగ్రహించును.
పరమేశ్వరి తన భక్తులలోని అవిద్య (అజ్ఞానము) కు సంబంధించిన విఘ్నములను రూపుమాపి విద్యా (జ్ఞాన) స్వరూపులుగా పరివర్తింపజేయును. ఆ తల్లిని ఆరాధించు సమయంలో చిత్తచాంచల్యము అనునది ఒక మహావిఘ్నము. అటువంటి విఘ్నములు కలుగకుండా నిర్మలచిత్తముననుగ్రహించును. పరిపూర్ణమైన మనసుతో ధ్యానముచేయు సమయంలో అప్రస్తుత శబ్దములు, అనావస్యక అవరోధములు కలుగకుండా, ధ్యాననిమగ్నతను ఏర్పరుచును. విఘ్నములు అనునవి అనేకవిధములుగా ఆయా సందర్భములను బట్టి ఏర్పడుచుండును. *ఓం విఘ్ననాశిన్యై నమః* అని తలచినతోడనే, దైవకార్యములు, గృహసంబంధ శుభకార్యములు, ప్రయాణములు మొదలైన సందర్భములలో ఏర్పడు విఘ్నములను ఆ తల్లి నిరోధించి సర్వశుభములను అనుగ్రహించును. గనుకనే అమ్మవారు *విఘ్ననాశినీ* యని అనబడినది.
*మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా* యను (78వ) నామ మంత్రమునందు రాక్షసులు ప్రయోగించిన విఘ్నయంత్రాలను నశింపజేసే మహాగణేశుణ్ణి చూసి అమ్మవారు సంతసించినది అనిగలదు. ఆ మహాగణేశుడు ఎవరు? సాక్షాత్తు తన కుమారుడు. ఈమె విఘ్ననాశిని అయినది గనుకనే తన కుమారుడు అయిన గణేశ్వరుడు విఘ్నేశ్వరుడై, విఘ్నములను నిరోధించువాడు అయినాడు. భండాసురాది రాక్షసులంటేనే విఘ్నములను కలుగజేయు దుష్టులు. అమ్మవారు వారితో యుద్ధముచేయు సమయములో అమ్మవారిని నిరోధించడానికి ఎక్కడికక్కడే అనేక విఘ్నయంత్రములను ప్రతిష్టించి ఆ తల్లిని నిరోధించాలని ప్రయత్నించారు. గణేశ్వరుడు అమ్మకు సాయంగా నిలిచి రాక్షసుల విఘ్నయంత్రాలను ఛిద్రంచేయగా, తనకుమారుని ప్రతిభను చూసి తనంతటివాడు తన కుమారుడని ఆ పరమేశ్వరి సంతసించినది. పరమేశ్వరి తన భక్తులకు తాము తలచిన కార్యములయందు అంతరాయము లేర్పడకుండా కాపాడుతుంది గనుకనే *విఘ్ననాశినీ* యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం విఘ్ననాశిన్యై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి