26, జూన్ 2022, ఆదివారం

భగీరధ ప్రయత్నం

 తన పూర్వీకులైన సగరుల భస్మ రాశులపై దివిజ గంగను భూమి మీదకు తెప్పించి వారి ప్రేతాత్మలకు విముక్తి కలిగించి  అమరత్వాన్ని కల్పించాడు భగీరధుడు .దీనికి ఆయనకు ఎన్నో అడ్డన్కులేర్పడ్డాయి గంగను భూమి మీదకు దిమ్పాలంటే సరాసరి అది పడితే భూమి బ్రద్దలై పోతుంది అందుకని ముందుశివుని జటాజూటం లోకి అక్కడినుండి  హిమాలయ పర్వతాలపై కి చేర్చాడు,దాని మీద నుండి భూమిపైకి తెప్పించాడు మధ్యలో జాహ్న మహర్షి చెవిలో దూరితే బతిమాలి తప్పించి భూమార్గం పట్టించి సాగరుల భస్మ రాశులపై  పారించి వారికి విముక్తి కల్గించి పితృ ఋణం తీర్చుకొన్నాడు ఆయన చేసినా ఈ కఠోర శ్రమనే భగీరధ ప్రయత్నం అన్నారు .కరువు కాటకాలతో వరదలతో అల్లాడే గోదావరి ప్రాంత జనులకు దాహార్తి తీర్చి, తాగు నీటితో బాటు సాగి నీటి వసతి కల్పించి లక్షలాది ఎకరాలలో నీరు పారించి గోదావరి డెల్టాను సస్య శ్యామలం చేయటానికి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి అంతటి శ్రమనూ పడ్డాడు సర్ ఆర్ధర్ కాటన్ దొర .అందుకే ఆయన్ను ఆ ప్రాంత జనం ‘’అపర భగీరధుడు ‘’ అని ప్రశంశించి కృతజ్ఞతలు చెప్పి నిత్య గోదావరీ స్నానం లో ఆ మహానుహావుడికి సూర్యునితో పాటు అర్ఘ్య ప్రాదానం చేస్తున్నారు వాళ్ళు అలా ఆయన సేవల్ని నిత్యం స్మరిస్తూ ప్రాతస్మరణీయుడు గా భావించారు.

గోదావరి పై సర్వే-ఆనకట్ట ప్రతి పాదన

గోదావరి పై ఆనకట్ట కట్టక పూర్వం గోదావరి జిల్లా ఉత్తరాంధ్ర లను కలిపి ‘’రాజమండ్రి జిల్లా ‘’అని పిలిచే వారు .1831-40మధ్యకాలం లో అతి వృష్టి అనా వృష్టి తుఫాన్లు ఉప్పెనలు జిల్లాను పూర్తిగా కుంగ దీశాయి .1821-లో జనాభా7,38,308  ఉంటె పదేళ్ళ తర్వాతా  1842-43 లో అంతే జనాభా  పెరగలేదుకాని5,61,041కి తగ్గి పోయింది .1815-24 మధ్య ప్రభుత్వానికి శిస్తు ఆదాయం 18 ,72172 రూపాయలు అయితే ,1830–43.మధ్య ఆదాయం పదహారు లక్షలే అయింది అంతకు ముందు గోదావరి డెల్టాకు సాగు నీటి సౌకర్యాలు కల్గించాలని యాభై ఏళ్ళుగా ఎన్నో ప్రతి పాదనలను పంపినా ప్రభుత్వం శ్రద్ధ చూపించలేదు .ఆదాయం తగ్గి పోయే సరికి వాళ్లకు చురుక్కు మని పించింది .ఇప్పుడు ద్రుష్టి పెట్టారు .తగ్గటానికి కారణాలను పరిశీలించమని నివేదికలు పంపమని పరిపాలనా విభాగం లో పని చేస్తున్న ‘’హెన్రి మౌంట్ గోమరీ ‘’ని ప్రభుత్వం ఆదేశించింది .కాని  తన జిల్లాకు వేరే అధికారిని నియమింటం రాజ మండ్రి కలెక్టర్ అవమానం గా భావించి సహాయ నిరాకరణ చేశాడు ప్రభుత్వం వెంటనే స్పందించికలెక్టర్ ను తొలగించి  మాంట్ గోమరీ నే జిల్లా ఎడ్మినిస్త్రేటర్ గాహోదా కల్పించి ,కార్య రంగం లో దిగమని సూచించింది

గోమరీ వెంటనే అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేసి అందులో జిల్లాలో ఇరిగేషన్ పనులను అశ్రద్ధ చేయటం ,రెవిన్యు అధికారుల లంచ గొండి తనం ,అసమర్ధత ,లోప భూయిష్ట ఎస్టేట్ ల నిర్వహణ వల్లక్షామం ఏర్పడి ఆకలి చావులతో జనాభా క్షీణించి ప్రభుత్వాదాయం తగ్గి పోయిందని తెలియ జేశాడు .దీనికి పరిష్కారం గోదావరి డెల్టాలో సాగు నీటి సౌకర్యం కల్గించటం ఒక్కటే శరణ్యం అని చెబుతూ ,దీనికి ఇప్పటికే ఈ రంగం లో తన సమర్ధతను శక్తి యుక్తులను ,వివేకాన్ని కష్ట సహిష్ణుతను రుజువు చేసుకొన్నఆర్ధర్  కాటన్ దొర ఒక్కడే సర్వ సమర్ధుడు అని ప్రభుత్వానికి నిర్ద్వంద్వం గా తెలియ జేశాడు.

అప్పటికే మేజర్ ఆర్ధర్ కాటన్ రెండో శతాబ్దం లో కరికాల చోళుడు కావేరి నది పై నిర్మించిన’’ గ్రాండ్ ఆనకట్ట’’ ‘’కు అడుగున తూములు ఏర్పరచి,కావేరిలో ఒండును తొలగించి లోతు చేసి నీటి నిల్వ సామర్ధ్యాన్ని30 మిలియన్ల ఘన గజాలకు బదులు నలభై మిలియన్లఘనగజాల వరకు పెంచాడు కాలరూన్ నదిపై ఆనకట్టలు కట్టి ,కొంత నీటిని కావేరికి మళ్ళించి వరదలను ఆపి ,తంజావవూర్ జిల్లాను’’ దక్షిణ దేశ దాన్యా గారం’’ చేశాడు  స్తానికం గా దొరికే వాటినే ఉపయోగించి తన ఆలోచన ను రుజువుచేసి సాటి లేని ‘’ఇరిగేషన్ ఇంజినీర్’’ గా   సుస్తిర కీర్తి పొందాడు .  .రెడ్ హిల్స్ కు రైల్ మార్గం ఏర్పరిచాడు .తర్వాతా మద్రాస్ లోపని చేసి నౌకాశ్రయ నిర్మాణం కార్య క్రమం చేబట్టి ,మిలిటరీ బారక్స్ ను తక్కువ వ్యయం తో నిర్మించి ప్రభుత్వ మన్ననలు పొందాడు ఆ తర్వాత విశాఖ లో చర్చి నిర్మించి విశాఖను సముద్ర కెరటాల నుండి రక్షించే రాతి గోడ లు కట్టాడు   ఆ రాళ్ళ మధ్య మట్టి ఇసుక పేరుకొని కట్టలు మరింత ద్రుఢతరం అయ్యాయి సహజ నౌకాశ్రయానికి విశాఖ చాలా అనువైన స్తలం అనీ ,విశాఖను జల మార్గాల ద్వారా ముఖ్య పట్నాలతోలతో కలిపి వృద్ధి చేయాలని విశాఖ పరిసరాల్లో చెరకు ,కాఫీ పండ్ల తోటలపెంపకం చాలా శ్రేష్టం అనీ ప్రభుత్వానికి ముందు చూపుతో సూచనలు చేసిన ‘’ఆధునిక విశాఖ శిల్పి’’ సర్ ఆర్ధర్ కాటన్.అప్పటికే ప్రభుత్వం కోరకుండానే గోదావరి డెల్టా భి వృద్ధికి కొన్ని సూచనలు ప్రభుత్వానికి పంపి ఉన్నాడు .ప్రత్తికి బదులు చెరుకు పండించటానికి ఏర్పాట్లు చేయాలని సూచించాడు ప్రాభుత్వం దీన్ని అంగీకరించింది కూడా . మాంట్ గోమరీ సూచన కు వెంటనే స్పందించిన ప్రభుత్వం కాటన్ ను గోదావరి డెల్టా కు నీటి పారుదల సౌకర్యాలు కల్పించటానికి నివేదిక తయారు చెయ్యమని కాటన్ ను 1844 ఆగస్ట్ అయిదున  ఆదేశించింది .

కాటన్ కార్యక్రమం

ప్రభుత్వ ఆజ్ఞతో విశాఖ నుండి రాజ మండ్ర చేరుకొన్నాడు కాటన్ .పాపి కొండల నుంచి అసముద్రంవరకు గోదావరి నదిని సర్వ్ చేసి వేర్వేరు ప్రదేశాలలో నదీ నీటి మట్టాలను ,వాలును ,ప్రవాహ వేగాన్ని లెక్కలు  కట్టటానికి ఉద్యమించాడు 20లక్షల ఎకరాల్లో సర్వే  చేయాలి. కాలువల మార్గాలని, భూ మట్టాలని నిర్ణయించాలి .ఇదిఎంతో కష్టమైన పని .సర్వే కు ఎనిమిది మంది పని చేసే సోల్జర్లను ఆరుగురు సర్వేయర్లను ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి రాశాడు .పొదుపు మంత్రం పాటించే ప్రభుత్వం అనుభవం లేని ఒక కుర్ర అధికారిని ,శిక్షణ లో ఉన్న ఐదుగురుసర్వేయర్లను మాత్రమె సాంక్షన్ చేసింది .జీపుల్లేని కాలం. ఎడ్ల బండీ లేక గుర్రాల మీదే ప్రయాణ సాధ్యం .సర్వే పరికరాలు ఆధునికమైనవికవు మొరటుగా ఉండేవి .కాని ఏమాత్రం నిస్పృహ కు లోను కాని కాటన్ ఓపిక లేక పోయినా రోజుకు కనీసం పది మైళ్ళు గుర్రం మీద తిరుగుతూ మిక్కిలి శ్రమ కోర్చి అపర భగీరదుడై కేవలం ఎనిమిది నెలల్లో నివేదిక రూపొందించి ప్రభుత్వానికి 1845ఏప్రిల్ పది హేడు న సమర్పించాడు .

కాటన్ నివేదికలో ముఖ్య విశేషాలు

గోదావరి డెల్టాలో నేల స్వభావం వాతా వరణం ,జల వనరులు ప్రపంచం లో ఎక్కడా లేవు వరదలను తట్టుకోనేట్లు లోతట్టు ప్రాంతం లో గోదావరికి రెండు వైపులా మట్టి కట్టలు ఎత్తుగా కట్టాలి .నదికి అడ్డం గా ఆనకట్ట కట్టి ,కాలువలు త్రవ్వి నదీ జలాలను ఎత్తు గా ఉండే పంట భూములకు అందించాలి .చదును భూముల నుండి మిగులు నీటిని బయటికి పంపి పంట దిగుబడికోసం మురికి కాలవలు త్రవ్వాలి .వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కు రోడ్లు, వంతెనలు ఎక్కువగా నిర్మించాలి .వీటన్నిటికి పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది .

ఇలా చేస్తే ఒన గూడే సదుపాయాలేమిటో కూడా కాటన్ వివ రించాడు .గోదావరి కృష్ణా లోయలలో సుమారు ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది .ముప్ఫై లక్షలున్న సంవత్సర ఆదాయం  రెండు కోట్ల రూపాయలకు పెరుగుతుంది .డెల్టాకు అంతటికి నౌకాయాన సదుపాయం ఏర్పడుతుంది .వేసవి లో 30 వేల ఎకరాలకు చెరుకు సాగుకు సరి పడ నీరు అందుతుంది.మారు మూల గ్రామాలకు కూడా తాగునీరు అందుతుంది .వార్షిక రెవిన్యు ఇరవై  లక్షల నుండి అరవై లక్షలకు పెరుగుతుంది  .

    ప్రత్యెక సూచనలు

ఆనకట్ట నిర్మాణం మిలిటరీ కట్టడాల నిర్మాణం అంత పటిష్టం గ ఇంజినీర్ల నిర్వహణలోనే జరగాలి. అనుభవం లేని స్తానిక రెవిన్యు అధికారులకు ఈ పని అప్పగిస్తే పైసా కూడా ఆదాయం రాదు .తన సూచనల్లో ఏదైనా సందేహాలుంటే తనకు రాత పూర్వకం గీ తెలియ జేసి సమాధానం రాయటానికి తనకు తగి నంత వ్యవదినివ్వాలి .

ఇలాంటి సూచనలు, సలహాలు ఇంత్సకు ముందు ఏ అధికారి సాదికారికం గా ప్రభుత్వానికి ఇవ్వలేదు .దీనికి ధైర్యం ఆత్మ విశ్వాసం ఉండాలి. అవి పుష్కలం గా ఉండబట్టే కాటన్ నిర్భయం గా ఈ విషయాలు తెలిపాడు వీటిని రాజ మండ్రిజిల్లా కలెక్టర్ ఫ్రేండర్ గాస్ట్  -మద్రాస్ చీఫ్ ఇంజినీర్ లెఫ్టి నేనెంట్ కల్నల్ ఏ లాయ్ కి పంపిస్తే ,  ఆయన బల పరచి రెవెన్యు బోర్డ్ కు  26-2-1846 న పంపాడు .ఇది సమర్ధించి మద్రాస్ ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం అంగీకరించి లండన్ లో డైరెక్టర్లకు పంపించింది .డైరేక్తర్ల్ కోర్టు ఆనకట్ట నిర్మాణానికి 4,75 572రూపాయలు ,అప్పటికే ఉన్న పంటకాలవల మరమ్మత్తులకు 14,000  రూపాయలు శాంక్షన్క్ చేసింది  1847లో ఆనకట్ట నిర్మాణానికి మద్రాస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది గోదావరి డెల్టా ప్రజల కోరిక, కాటన్ ఆశ, ఒకే సారి నేర వేరాయి .ఇక కాటన్ కార్య రంగం లో దూకటమే మిగిలింది .

ఆనకట్ట నిర్మాణ పనులు షురూ

రాజ మంద్రికి నాలుగు కిలో మీటర్ల దూరం లో ఉన్న ధవళేశ్వరం వద్ద ఆనకట్టనిర్మాణా నికి అనువైన స్థలం గా భావించారు .దీనికి ఎగువన నదిని ‘’అఖండ గోదావరి ‘’అంటారు .ఆనకట్ట ప్రాంతం వద్ద గోదావరి ధవళేశ్వరం ,ర్యాలి ,మద్దేశ్వరం విజ్జేశ్వరం అనే నాలుగు పాయలుగా చీలి పోతుంది .దిగువ కొంత దూరం లో ‘’గౌతమి, వసిష్ట’’ అనే మరి రెండు పాయలౌతుంది .ఆనకట్టలు కట్టాల్సిన ఈ నాలుగు పాయల మొత్తం పొడవు 11,945అడుగులు అంటే రెండున్నర మైళ్ళు .మధ్యలో మట్టి కట్ట వేసి ,ఎత్తు పెంచాల్సిన లంకలు నాలుగున్నాయి  .అవే పిచ్చిక లంక ,బొబ్బర్లంక ,మద్దూరు లంక ,చిగురు లంక .వీటి మొత్తం పొడవు ఒకటిన్నర మైళ్ళు అంటే 7,430అడుగులు .నదీ గర్భం లో ఆరు అడుగుల లోతు వరసకు ఇటుక బావులు నిర్మించి ,వాటిపై పన్నెండు అడుగుల ఎత్తు ఆనకట్ట నిర్మించాలి .దాని పై పద్దెనిమిది అడుగుల వెడల్పు రోడ్డు వేయాలి .’’ఇలాంటి ఆనకట్ట అప్పటికి ఇండియా లోనే కాదు ప్రపంచం మొత్తం మీద మరెక్కడా లేదు’’. ఈ బృహత్ నిర్మాణానికి కావలసింది అసాధారణ సాంకేతిక నైపుణ్యం తో బాటు ఎన్ని ఓడిదుడుకులోచ్చినా నిలబడే గుండె నిబ్బరం కూడా ఉండాలి  .ఈ రెండు కాటన్ దొరలో పుష్కలం గా ఉన్నాయి .అందుకే ఈ అత్యంత క్లిష్టమైన నిర్మాణం చేబట్టాడు .

ధవళేశ్వరం లో ఉన్న డెల్టా క్లబ్ వెనక తాటి దూలాలతో, తాటాకులతో ఒక కుటీరం నిర్మించుకొన్నాడు దొర .అదే దొరగారి బంగాళా .దాని పక్కనే సిబ్బందికి గుడారాలు వేయించాడు .భార్య ఎలిజ బెత్ ,కూతురు బేబీ హాప్ లను కూడా తీసుకొచ్చి ఇక్కడే కాపురం పెట్టాడు .దగ్గరలో ఉన్న కొండ రాయి ఎంతోనాణ్య మైనదిగా భావించాడు .ఇటుకలు తయారు చేయటానికి కావలసిన మంచి మట్టి ,కాల్చటానికి సున్నపు రాయి దగ్గరలోనే ఉన్నాయి .లాకులకు తూములకు పనికొచ్చే ప్రశస్తమైన టేకు ప్రక్కనే ఉన్న అడవిలోనే ఉంది .అన్ని వనరులు ఉన్న ప్రదేశం గా భావించాడు కాటన్ .సున్నపు బట్టీలు ఇటుక ఆవములు తయారయ్యాయి .క్వారీలో పగల గొట్టిన రాయి తేవటానికి రైలు మార్గం ఏర్పడింది .అక్కడి నుండి నదిలోకి వీటి నన్నిటిని చేర్చటానికి ‘’ఫంటు ‘’అంటే బల్లకట్టు నిర్మాణం చేయించాడు .రాళ్ళను సైజులో చెక్కటం ,ఆనకట్టల మధ్య ఉన్న లంకల ను ఎత్తు చేయటం ,వాటిని బల పరచటం చక చకా సాగిపోయాయి .జూన్ నెలాఖర్లో వచ్చే గోదావరి వరదలకు ముందే ఈ పనులన్నీ పూర్తీ చేయాలని కాటన్ లక్ష్యం   గా పెట్టుకొని చురుగ్గా పర్య వేక్షించి పనులు పూర్తీ చేశాడు

కావేరి పై కట్టిన ‘’గ్రాండ్ ఆనకట్ట’’ను నిశితం గా పరిశీలించిన కాటన్ అక్కడ ఉపరితలం పై వాడిన సున్నపు పూతకు బదులు ఇక్కడ చెక్కిన రాయి ని ఉపయోగిస్తే ఆనకట్ట బలం మరింత పెరుగుతుందని నిర్ణయించాడు .ఇలాంటి చెక్కుడు రాయి పని వాళ్ళు రాజ మండ్రి జిల్లా మొత్తం మీద ఎక్కడా దొరక లేదు .ఉన్న వాళ్ళతోనే పని సాగిస్తే నిర్మాణం మరో ఏడాది ఆలస్యం అవుతుంది. దీనికి ఇష్టపడలేదు దొర .అందుకని వ్యూహం మార్చాడు .తూములు ,లాకులు మొదలైన ముఖ్య భాగాలకే చెక్కుడు కొండరాయి ఉపయోగించాలని రాయి వాడకాన్ని పరిమితం చేశాడు .

1847 ఏప్రిల్ లో ఆనకట్ట నిర్మాణం ప్రారంభ మైంది .ఆ నాడు కాంట్రాక్ట్ తీసుకొని చేసే సంస్థలు లేవు .క్వారీలలో కొండ రాయి పగల గొట్టటం ,సున్నపు రాయి కాల్చి గానుగ ఆడి  సున్నం తయారు చేయటం ఇటుకల్ని కాల్చటం మొదలైన పనులకు ప్రభుత్వం 12మంది అధికారుల్ని ,కొందరు సహాయకుల తో బాటు1300మంది కూలీలను ఏర్పాటు చేసింది .కూలీలు నదిలో పనికి ముందు భయపడ్డా ఒక వారం లో మంచి ఉత్సాహం తో ఇది తమ పని అని తమ కోసమే ఆనకట్ట అని పని చేశారు .ఆ తర్వాత చాలా మంది కూలీలు వచ్చి చేరారు .అధికారులు కూడా వారిని ఎంతో దయతో చూసేట్లు చేశాడు దొర. అప్పుడు మగ కూలీకి రోజుకు ఒక అణా అంటే ఇప్పటి ఆరు పైసలు ,ఆడకూలీకి తొమ్మిది పైసలు అంటే ఇప్పటి నాలుగున్నర పైసలు .తాపీ ,వడ్రంగం కమ్మరులు మొదలైన నాణ్యమైన పని వారికి  రోజుకూలీ రెండు అణాల,మూడు పైసలు అంటే నేటి పద్నాలుగు పైసలు .ఆదివారం సెలవు అయినా ,ఆ రోజు కూలి కూడా కలిపి వారానికి మొత్తం శనివారానికే డబ్బు చెల్లించే ఏర్పాటు చేశాడు కాటన్ .రోజు పని మొదలు పెట్టటానికి, ,ముగియ టానికి గుర్తుగా ఫిరంగి మోగించే వారు .

ఇక్కడ జరుగుతున్నా జల యజ్ఞం చూసి కూలీలు విపరేతం గా వచ్చి చేరుతూ సంఖ్యను పది వేలకు చేర్చారు .ఐదు వందల మంది వడ్రంగులు ,మరో అయిదు వందల కమ్మర్లు ,వెయ్యి మంది రాతి చెక్కుడు వాళ్ళను నియమించి వేగం గా పనులు చేయించాడు కాటన్ .రోజుకు అయిదు వందల టన్నుల కొండ రాయి కొట్టి సిద్ధం చేసే వారు .ఈ రాయి సున్నం ఇటుక నది ఒడ్డుకు చేర్చే రైలు మార్గమూ తయారై పోయింది .నాలుగు క్రేనులు పదహారు రైల్వే వాగన్లు తయారయ్యాయి .వీటిని నదిలోకి చేర్చటానికి పద్దెనిమిది ఫంట్లు వచ్చేశాయి .

ఇక్కడ తాటాకు పాకలో ఉన్నప్పుడే కాటన్ కు రెండో కూతురు పుట్టింది .కాని దురద్రుస్ట వశాత్తు ఏడాది మాత్రమె బ్రతికి చని పోయి కాటన్ దంపతులకు తీరని శోకం మిగిల్చింది .మనో వేదన తో తట్టుకో లేక పోయారిద్దరూ .నెమ్మదిగా జన జీవన స్రవంతిలో కలిసి నిర్మాణం పనులు వేగవంతం చేశాడు .పల్లెల నుంచి నిరుపేద స్త్రీలు చంకలో పిల్లల్ని ఎత్తుకొని అర్ధ నగ్నం గా కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా వచ్చి పని చేయటం ఆ దంపతుల్ని కలచి వేసింది బిచ్చ గాళ్ళ బెడద ఉండేది కాదు .కస్టపడి పని చేసి ,దొర మెప్పు సంపాదించుకొన్నారు. తెల్ల దొరలని వీరంతా గౌరవించే వారు. దొరలకు తమ వద్ద ఉన్న కానుక లిచ్చి సంతోష పెట్టె వారు. వాళ్లకు ఇబ్బంది కల్గించకుండా కూలీలు ఏంతో  జాగ్రత్తగా మసలే వారు .

నాలుగు వైపులా కొండను ప్రేలుడు పదార్ధాలతో పగల కొట్టే భయంకర శబ్దాలు, కూలీల పాటలు .మేస్త్రీల అదలింపు ల తో దొర ఇంటి చుట్టూ సందడే సందడి .ఈ గందర గోళానికి దూరం గా కొండ ప్రాంతం లో కి కాటన్ మకాం మార్చాడు .రాయిని మందు సామానుతో పేల్చినప్పుడు రాయి ముక్కలేగిరివచ్చి బంగ్లా పై పడుతూ ఉండేవి .ఈ అదు రుడు కు ఇంటి గోడలు బీటలు ఇచ్చి అందులోంచి గాలి వెలుతురూ ధారాళం గా బంగ్లా లోనికి వచ్చేవి .పాములు బెదిరి ఈ బీటల్లో దూరి భయం కలిగించేవి .పిల్లలు భయ పడే వారు .ప్రజల్లో కాటన్ దొర పై ఆరాధనా భావం ఏర్పడింది .ఆటబొమ్మలు, పంచదార చిలకలు తినే పదార్ధాలు దొర కుటుంబానికి కానుక లు గా ఇచ్చే వారు .

దొర ఇంటి పని వంటపని బట్టలుతికే పనికి ప్రత్యెక సేవకులుండే వారు .ఏకులం వాళ్ళు ఆ పనే చేసే వారు ఒక రోజు ‘’లచ్చి ‘’ అనే ఇల్లు ఊడ్చే పని మనిషి ఎలిజ బెత్ ను బతిమి లాడి అర్ధ రూపాయి జీతం లో అడ్వాన్సుగా అడిగి తీసుకోంది.ఎందుకు అంటే కారణం చెప్పలేదు .లచ్చి వెంటనే రాజ మండ్రి వెళ్లి అర్ధ రూపాయి పెట్టి ఒక చిన్న పాపను కొనుక్కొని తెచ్చుకోంది .పిల్లలు లేకుండా ఒంటరిగా బ్రతకలేనని అందుకే ఈ పిల్లను కొనుక్కోవటానికే అర్ధ రూపాయి అడిగానని చెప్పి పాపను దొరసానికి చూపించింది .ఆమె నిర్వీర్యురాలైంది .ఆడపిల్లల్ని ఎంత కారు చవకగా ఆనాడు అమ్ముతున్నారో అర్ధం చేసుకొని విచారించింది ఎలిజబెత్ .ధవళేశ్వరం ఆనకట్టకు కొన్ని పునాది బావుల నిర్మాణం పూర్తీ అయింది .కాని 1847లో గోదావరికి వచ్చిన వరదలవల్ల పనులు పూర్తిగా ఆగిపోయి కొంచెం నిరాశ కల్గించింది కాటన్ కు.

గోదారి కంఠాభరణం ఆనకట్ట పూర్తి

గోదావరి వరదలోచ్చినా  ,రాళ్ళు పగల కొట్టటం ,సున్నం కాల్చేపని ,ఇటుక తయారీ నిర్విఘ్నం గా జరుగుతూనే ఉన్నాయి .రెండో రైల్ మార్గం పనులూ అయిపోయాయి .ఆరున్నర మైళ్ళ పొడవు గల రైల్వే లైన్ కు కావాల్సిన కర్ర పట్టాలు అమర్చారు .పట్టాల పై భాగాన్ని సమతలం గా చెక్కి వాటిపై రెండు అంగుళాల వెడల్పు ఇనుప రేకులమర్చి దానిపై కొయ్య చక్రాలవాగన్లు తేలిగ్గా తీసుకు పోయే ఏర్పాట్లూ జరిగి పోయాయి .1847అక్టోబర్ నుంచి వరదలు తగ్గాక మళ్ళీ పనులు మొదలైనాయి .25వేల ఘనపు అడుగుల చెక్కిన రాయి సిద్ధమై ఉంది .రోజుకు అయిదు వందల అడుగుల  రాయి ఫంటూలపై ఆనకట్ట ప్రదేశానికి చేరుతోంది .

వేసవి అయినా ఏ శీతల ప్రదేశాల్లో హాయిగా గడపటానికి వీలుగా ఉన్నా, కాటన్ ఎక్కడికీ కదలకుండా నెత్తిన టోపీ పెట్టుకొని ,పర్యవేక్షిస్తూ పని తీరును గమనించాడు .ఎక్కడికైనా కాంప్ మార్చాల్సి వస్తే అతి తక్కువ సామాను తో కుటుంబం తో కదిలే వాడు .ఆర్భాటం ఉండేదికాదు .అవసర సౌకర్యాలు లేక బాధ పడే వాడు .1848జూన్ కు ఆనకట్ట తొమ్మిది అడుగుల ఎత్తువరకు నిర్మించారు .ఇంకొక మూడడుగులు ఎత్తుపెంచాలి .లాకుల పని పూర్తయింది .తలుపులు బిగించాలి .అడుగు తూములు అంటే అండర్ స్లూయిస్ చెక్కుడు రాయి పని కూలీలు దొరక్క నెమ్మదిగా నడిచింది .ప్రధాన తూము అంటే హెడ్ స్లూయిస్ ఆర్చీల మట్టాలకు పూర్తీ అయింది .ర్యాలీ పాయలో కూడా పని మందకొడిగా జరుగుతోంది .లాకు పని అయిపోయి ,కాలువ పని ఉంది .మద్దూరు పాయలో పనులు వేగం గా జరుగుతోంది .వింగ్ వాల్స్ పై భాగం తప్ప అంతా పూర్తీ అయింది .విజ్జేశ్వరం పాయలో ప్రధాన ,అడుగు తూముల పనులు బాగా జరిగాయి .వరద లోచ్చే సరికి దాదాపు అంతా పూర్తీ అయింది .లాకుల పై పని అనుకొన్నంత వరకు బానే జరిగింది .తలుపుల పని మిగిలింది .రెక్క గోడలపై వరద లోచ్చినా పని చేయ వచ్చు .

కాని రెండు వారాల ముందే జూన్ లో వరద లోచ్చాయి . రాతి కట్టడం ఏమై పోతుందో అని భయ పడ్డాడు కాటన్ .దీనికి తోడు ఆయన ఆరోగ్య పరిస్తితి కూడా బాగాలేదు వడ దెబ్బ తగిలి తీవ్ర జ్వరం వచ్చి బాధ పడుతున్నాడు కాని ఆనకట్ట మీద ద్రుష్టి మాత్రం మర్చి పోలేదు .సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోమని భార్య ఒత్తిడి పెట్టింది .మిగిలిన అధికారులు కూడా అలానే చేయమని కోరారు .క్లిష్ట సమయం లోసెలవు పెట్టటం  ఇష్టం లేక పోయినా ఆరోగ్యం దృష్ట్యా సెలవు పెట్టి,ప్రభుత్వ ఆదేశం పై బాధ్యతను కెప్టెన్ చార్లెస్ అలేక్సాండర్ ఆర్ కు అప్పగించి, కాటన్ కుటుంబం తో ఆస్ట్రేలియాకు వెళ్ళాడు .మనసు ఇక్కడా శరీరం అక్కడ గా ఉంది ఆయన పరిస్తితి .సెలవు పై వెళ్ళ టానికి ముందే ఉన్న డబ్బు అంతా ఖర్చు అయినందువల్లా ,మరొక లక్షా ముప్ఫై తొమ్మిది వేల రూపాయలు కావాలని ప్రభుత్వానికి రాశాడు

దీనికి ప్రభుత్వం నుండి వ్యతిరేకం గా శ్రీముఖం వచ్చింది .మితి మీరిన వ్యయం చేస్తున్నాడని పనుల భద్రత, ,నాణ్యత పట్టించుకోకుండా త్వరగాపని చేస్తున్నాడని విమర్శించింది .ఒకరిద్దరు అనుభవమున్న ఇంజినీర్లను పంపి సమీక్షించి ,నివేదిక ఇమ్మని కోరింది .విచారణ సంఘం లో ఇంజినీర్ యి.బకుల్ ,జే.హెచ్.బెల్.,కెప్టెన్ అలేక్సాండర్ ఆర్ ,రాజ మండ్రి సబ్  కలెక్టర్ హెన్రి ఫోర్ట్స్ సభ్యులు . 1848 నవంబర్ లో విచరణ సంఘం ఆనకట్టపనులు పర్య వేక్షించి జనవరి లో ప్రభుత్వానికి నివేదిక పంపింది .అందులో వివరాలు ‘’గోదావరి ఆనకట్ట నిర్మాణం లో మేజర్ కాటన్ ప్రదర్శించిన అపూర్వ శాస్త్ర విజ్ఞాన ప్రతిభను ,అనుభవ పూర్వక సామర్ధ్యాన్ని ,నిర్విరామ కృషిని ఈ కమిటీఎంతో ప్రశంసించింది .అయన మేధా శక్తికి ,ఆత్మనిష్ట కు ,ఒక అమోఘ ఈ నవీన జలదుర్గం ఒక ఉదాహరణ.అనుకో కుండా వచ్చిన వరదల వల్ల  ఆనకట్టకు కొంత నష్టం జరిగి అంచనా వ్యయం పెరిగిందే తప్ప కాటన్ తొందర పాటు కాదు అని మేం పూర్తిగా విశ్వ సిస్తున్నాం .ఇప్పటికే రాజమండ్రి జిల్లా ఈ ఆనకట్ట వల్ల  ఎంతో ప్రయోజనం పొందింది .కనుక మేజర్ కాటన్ ప్రతి పాడించిన అదనపు డబ్బుతో బాటు ,కెప్టెన్ ఆర్ కోరిన మరో మూడు లక్షల యాభై వేల రూపాయలు అత్యవసరం గా మంజూరు చేయమని గట్టిగా సిఫార్సు చేస్తున్నాం ‘’అని కాటన్ దొర పని తనానికి, నిజాయితి కి ,నిర్భీకతకు కీర్తి కిరీటం పెట్టింది ఆ సంఘం.ప్రభుత్వం వెంటనే ఆ డబ్బును సాంక్షన్ చేసి పంపించింది .

రెండేళ్ళు ఆస్ట్రేలియా లో విశ్రాంతి తీసుకొని 1850 సెప్టెంబర్ లో తిరిగి వచ్చి బాధ్యతలు చేబట్టాడు .అనుకున్నట్లు గా పనులన్నీ పూర్తిగా సంతృప్తికరం గా జరిగిపోయాయి కాటన్ అక్కడ లేక పోయినా . .కెప్టెన్ సారధ్యం లో పనులు బాగా జరిగి నందుకు అతన్ని కాటన్ మనసారా అభి నందించాడు .నదిలో పడవలను వేగం గా లాగటానికి స్టీం లాంచ్ అవసర మని ప్రభుత్వానికి రాసినా అనుమతివ్వలేదు .కలకత్తా నుంచి లాంచిని తెప్పించి పని అతి వేగం గా జరిపించాడు .లాంచి వల్ల  ఎంత ప్రయోజనం జరిగిందో ప్రభుత్వానికి రాశాడు. సంతృప్తి చెందిన ప్రభుత్వం కలకత్తా లాంచి రావటానికి ,నిర్వహణకు అయిన డబ్బంతా ఇచ్చేసింది నిజాయితీ ఉన్న ఆఫీసర్ కు  దక్కిన గౌరవం ఇది .నిబద్ధతకు నిలువెత్తు గా కాటన్ నిలిచాడు .ఆయన దగ్గర పని చేసిన ఇంజినీర్లు కూడా పని మీద అత్యంత శ్రద్ధ ఉన్నవారే అవటం ఆయనకు ఎంతో కలిసి వచ్చింది .కెప్టెన్ అలేక్సాండర్ ,కెప్టెన్ హచిన్సన్ ,లెఫ్టి నెంట్ హేగ్ ,లెఫ్టి నెంట్ రున్దాల్ ,ఒవర్సీర్ వేణంవీరన్న ఆనకట్ట నిర్మాణం లో చిరస్మరణీయ సేవ లందించారు .ఏమాత్రం భేదాలు లేకుండా శాయ  శక్తులా కాటన్ కు సహాయ సహకారాలందించి అభిమాన పాత్రులయ్యారు .వేణం వీరన్న ను గూర్చి ‘’వీరన్న గారు లేక పోయి ఉంటె వేలాది కూలీల సమీకరణ జరిగేది కాదు .ఆన కట్ట పని సకాలం లో జరగటానికి వీరన్న సేవలు నిరుపమానం ‘’అని మెచ్చుకొన్నాడు కాటన్. వీరన్నకు ఇంజినీర్ గా ప్రొమోషన్ ఇవ్వటమే కాకుండా ‘’రాయ్ బహదూర్ ‘’బిరుదాన్ని కూడా ప్రభుత్వం చేత ఇప్పించిన పని పక్ష పాతి కాటన్ .

కాటన్ మార్గ దర్శకత్వం ,ఉత్సాహ వంతులైన ఇంజినీర్లకర్తవ్య నిస్ట ,వేలాది కార్మికుల అవిరళ కృషి, ,ప్రజా సహకారం వల్లనాలుగు కిలో మీటర్ల పొడవైన ఆనకట్టలు కేవలం అయిదేళ్ళలోఅంటే 1852లో పూర్తీ చేయగలిగాడు అపర భాగీరదుడు,డెల్టా శిల్పి అయిన  మేజర్ ఆర్ధర్ కాటన్ దొర .రెండు వేల మైళ్ళ పొడవున్న డిస్త్రి బ్యూటర్లు ,మురుగు కాలవలు ,రోడ్లు ,వంతెనలు ,వరద కట్టలు నిర్మించి మాహాద్భుతాన్ని ప్రపంచం లోనే అరుదైన గోదావరి నాదీమ  తల్లికి దివ్య భవ్య కంఠా భరణంఅయిన ధవళేశ్వరం  ఆనకట్ట నిర్మాణాన్ని సమర్ధ వంతం గా పూర్తీ చేశాడు .గోదావరి డెల్టాకు ఏడు లక్షల ఎకరాలకు సాగు నీటి సౌకర్యం కలిగింది . 1889లో ఆనకట్ట ఎత్తు మరో రెండు అడుగులు పెంచారు . 1936లో మరో మూడు అడుగులు ఎత్తుపెంచి ఆయకట్టు విస్తీర్ణం పది లక్షల ఎకరాలకు పెంచారు .

1970 లో ధవళేశ్వరం ఆనకట్ట శిధిలా వస్తకు చేరింది దాని స్స్థానం లో బ్యారేజి నిర్మించి కాటన్ గౌరవ సూచకం గా ‘’సర్ ఆర్ధర్ కాటన్ బారేజి ‘’అని పేరు పెట్టి గౌరవించారు .పది లక్షల ఎకరాలకు రెండు పంటలు పండించే సాగు నీరు లభ్యమై గోదావరి డెల్టా ‘’ఆంద్ర దేశపు దాన్యా గారం ‘’గా రూపొందింది .ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం పూర్తీ అయ్యే సరికి కాటన్ దొర రాష్ట్ర చీఫ్ ఇంజినీర్ గా ప్రమోషన్ పొంది మద్రాస్ కు వెళ్ళాడు

కామెంట్‌లు లేవు: