*కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండన్ మదోద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీకర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైల రక్తౌఘ నిర్ఝర ముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతు నుగ్రాకృతిన్*
మహాభారతం సభాపర్వం, ద్యూతక్రీడా ఘట్టంలో నన్నయ్యగారు రాసిన పద్యం ఇది. అందరికీ తెలిసినదే కదా!
భీమసేనుడి భీషణ ప్రతిజ్ఞ. కురువృధ్ధులు, పెద్దలైన గురువులు, బంధువులు ఇలా అనేకులు చూస్తూండగా ద్రౌపదిని అవమానించబూనిన దుశ్శాసనుడి రొమ్ముని భయంకర యుధ్ధంలో చీల్చి వధించి, వాడి రక్తాన్ని ఉగ్రరూపం ధరించి తాగుతాను అన్నది భీముడు చేసిన ప్రతిన.
ఈ పద్యంలో నన్నయ్యగారు అనేక పొల్లు అక్షరాలు వాడారు.
కురువృధ్ధుల్,
బాంధవులనేకుల్,
చూచుచుండన్,
ఖలున్,
దుశ్శాసనున్,
లోకభీకర లీలన్,
చివరిగా ఉగ్రాకృతిన్!
పొల్లులు ఇన్ని ఎందుకు వాడారు నన్నయ్య గారు. ఏదైనా ప్రత్యేక కారణము కలదా. లేదా కేవలం గణ విభజన గురించే ఇలా వాడుకున్నారా అని కొన్ని రోజులుగా ఆలోచించి ఆలోచించి సతమతమవుతుండే వాడిని.
పై పద్యంలోని విపరీతంగా ప్రయోగించి బడిన పొల్లు అక్షరాల గురించి ఆరా తీస్తున్నప్పుడు దొరికిన పూర్తి వివరాలు ఇవిగో.
ఇలాంటిదే అంటే దీనికి విరుద్ధమైన నన్నయ్య గారి మరో పద్యాన్ని గూడా పరిశీలిద్దాం.
*ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి రంభోరుని జోరు దేశమున మీ నుండగ బిల్చినని ద్దురాత్ము దుర్వార మదీయ బాహు మీ పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరుతరోరు జేయుదు సుయోధను నుగ్ర రణాంతరంబునన్*
పైపద్యం భీముడు దుర్యోధనుడి ఊరువులు పగలకొడతానన్న సంధర్భం లోనిది. అదీ నన్నయ్య గారు వ్రాసిందే.
చివరిలో ఒక్క పొల్లు తప్ప మరెక్కడా పొల్లు కానరాదు. అంటే ఇక్కడ నన్నయ్య గారి ఉద్దేశం కేవలం గణ విభజన ప్రక్రియకు అనువైనదిగా పూరించడానికి గాను ఆ పొల్లును వాడినట్లు మాత్రమే అవగతమవుతుంది. ,
అలాంటప్పుడు మనం మొదట్లో చర్చకు గైకొన్న పద్యంలో నన్నయ్య గారు అన్ని పొల్లులను ఎందుకు వాడినట్టు మరి.
నన్నయ ఈ నకార పొల్లులు ఇన్ని ఎందుకు వాడారో తెలుసుకొనే ముందు మనం తెలుగు వ్యాకరణం గురించి కొద్దిగా తెలుసుకోవాలి. క్షమించాలి, తెలుసుకోవాలి అనడం కన్నా మరోసారి మన జ్ఞాపకాలను తిరగేద్దాం.
*క* నుండి *క్ష* వరకు ఉన్న అక్షరాలను హల్లులు అని అంటారని మనందరికి తెలుసు. అంటే అచ్చుల సహాయం లేనిదే హల్లులు పలకబడవు.
ఉదాహరణకు *క* అనాలంటే *క్*+అ కలిస్తేనే *క* అవుతుంది. వీటిని వ్యంజనములు అని అంటారు.(వ్యజతే అనేన ఇతి వ్యంజనం).
దీనివల్ల అక్షరం స్పష్టంగా చెప్పగలం. ప్రాణములు (అచ్చులు) కలసివుంటాయి కనుక వీటిని ప్రాణులు అనీ అంటారు.
ఇక అచ్చులు 16.అ నుండి అః వరకు ఉన్నవి. ఇవి స్వతంత్రం గా ఉచ్చరింపబడుతవి కనుక వీటిని ప్రాణములనీ, స్వరములనీ అంటారు.
పొల్లు అంటే అక్షరానికి ప్రాణమైన అచ్చు లేకుండా వాడబడిన హల్లు.
ఇలా ప్రాణరహితమైన అక్షరాల లాగానే దుశ్శాసనుడు కూడా నిర్జీవుడౌతాడు సుమా అని హెచ్చరిస్తున్నట్టు అలాంటి పొల్లును నన్నయ్యగారు పదేపదే వాడి భావోద్రేకాన్ని తీవ్రతను సూచించడమే బహుశా కవి యొక్క నెపమేమో.
సమంజసమేనని అనిపిస్తుంది. అంటే కవి ఆ విషయ తీక్షణతను తన పద్య రచనలో ఇలా పొందుపరిచి ఉండవచ్చునని ఓ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. తప్పుకావొచ్చు కూడా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి