21, సెప్టెంబర్ 2023, గురువారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 28*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

          *🌹సౌందర్యలహరి🌹*

                  *శ్లోకం - 28*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*సుధా మప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యు హరిణీం*

          *విపద్యన్తేమ విశ్వే విధి శత మఖాద్యా దివిషదః |*

          *కరాళం యత్ క్ష్వేళం కబలళితవతః కాలకలనా*

          *న శమ్భో స్తన్మూలం తవ జనని తాటంక మహిమా ||*   


ఈ శ్లోకంలో అమ్మవారి పాతివ్రత్య మహిమను గురించి చెప్తున్నారు.


సుధామప్యాస్వాద్య ప్రతి భయ జరా మృత్యు హరిణీం= దేవతలు పాల సముద్రాన్ని ఎందుకు మధించారు? అమృతాన్ని పొంది వృద్ధ్యాప్య, మృత్యు భయాలను పోగొట్టుకోవటానికి. మరి అమృతం వారిని కాపాడిందా?


విపద్యంతే విశ్వే విధి శతమఖాద్యా దివిషదః = బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ మహా ప్రళయంలో నశించారు కదా! 


కరాళం యత్ క్ష్వేళం కబలితవతః = క్షీరసాగర మధనంలో ఉద్భవించిన కాలకూట విషాన్ని చూసి దేవతలందరూ భయపడి పారిపోయి బ్రహ్మ గారి వద్దకు వెళితే ఆయన వీళ్ళను తీసుకొని శివుడి వద్దకు వెళ్లి అందరూ ప్రార్ధన చేశారు కాపాడమని. అప్పుడు శివుడు ఆ విషాన్ని మ్రింగటానికి ముందుకు వచ్చాడు. దానిని అన్నం ముద్దలాగా మ్రింగి తన ఉదరంలో వున్న లోకాలు నశించకుండా ఆ గరళాన్ని కంఠంలో నిలిపాడు.


కాలకలనా న శమ్భో= కాల, కలన (లెక్కించటం, పరిణామాలని) పరిమితులు లేని శంభుడు ఆ విషాన్ని లోక క్షేమం కోసం కంఠంలో నిలిపాడు. కాల, కలనములకు లోబడి ఉండేవాడు పశువు (మానవుడు) వాటిని తన అధీనంలో ఉంచుకొనేవాడు పశుపతి.(ఈశ్వరుడు)


మరి అమ్మవారు తన భర్త కాలకూట విషాన్ని మ్రింగుతుంటే భయపడి అడ్డు పడలేదా? లేదట. పైగా లోక రక్షణ కోసం ఆమె కూడా ప్రోత్సహించిందట. ఎందుకని ఆమెకు భయం లేదు? అది ఆమె ధరించిన తాటంకముల (చెవికమ్మలు) మహిమయట. ఆమెకు తన మాంగల్యంపై నమ్మకమని శుక మహర్షి పరీక్షిత్తుతో అంటారు. భాగవతంలో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు.


*తాటంక యుగళీ భూత తపనోడుప మండలా* అని అమ్మవారి నామం. తపః అంటే సూర్యుడు, ఉడుప అంటే చంద్రుడు. వీరిద్దరి కదలిక వల్లనే కదా రోజులు,మాసములు, సంవత్సరములు, యుగములు, కల్పములు మున్నగునవి. ఆ విధంగా కాలమును నిర్దేశించే సూర్య చంద్రులను ఆవిడ నియంత్రించి చెవికమ్మలుగా ధరించాక ఇక *కాల కలన* కు ఆమె వెరవవలసిన అవసరం ఏముంది? అమ్మవారు శాశ్వత సుమంగళి. స్వామి శాశ్వత శుభంకరుడు.


అసలు తాటంకములు తాటియాకులతో చేయబడినవి. ఒకప్పుడు చెవి కమ్ములను, మంగళ సూత్రములను కూడా తాటియాకులతోనే చేసేవారట ముహూర్త సమయంలో ధరింపజేయటానికి. అవి సౌమంగళ చిహ్నాలని. అందుకే, శుభకార్యాల సందర్భంగా ఇంటి ముందు తాటాకు పందిరి వేసేవారు. తాటియాకు తోరణాలు కట్టేవారు.


తిరుచిరాపల్లి నగరం కావేరీ నది ఇవతలి ఒడ్డున ఉంటే అవతలి ఒడ్డున తూర్పుగా  శ్రీరంగనాథ క్షేత్రం శ్రీరంగం, పశ్చిమ దిశగా శ్రీ అఖిలాండేశ్వరీ సమేత జంబుకేశ్వర స్వామివారి ఆలయం ఉంటాయి. ఈ క్షేత్రాన్ని తిరు వనై కోయిల్ అంటారు. పంచభూత లింగ క్షేత్రములలో ఇది జల లింగ క్షేత్రం. స్వామివారి లింగరూపం అడుగు నుండి నిరంతరము నీరు స్రవిస్తూ ఉంటుంది.


మిగిలినవి

పృధివీ -ఏకామ్రేశ్వర

కాంచీపురం

తేజో/అగ్ని - తిరువణ్ణామలై అరుణాచలం

వాయు - శ్రీ కాళహస్తి

ఆకాశ లింగ క్షేత్రం - చిదంబరం


ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే జంబుకేశ్వరంలో అమ్మవారు అఖిలాండేశ్వరి ధరించే తాటంకముల గురించి. ఒకప్పుడు అమ్మవారు చాలా ఉగ్రరూపంలో ఉండేవారట. పూజ చేయటానికి వెళ్లిన ప్రతి పూజారి మూర్ఛపోయేవారట. ఈ విషయం ఆది శంకరులకు తెలుపగా, వారు వచ్చి అమ్మవారి ఉగ్రతనం అంతా మంత్రపూర్వకంగా సంగ్రహించి ఈ తాటంకములలో యంత్రరూపంలో ప్రవేశపెట్టారట. వాటిలో ఒకటి శివ చక్రము, రెండవది శ్రీచక్రము. అంతే కాక అమ్మవారి సన్నిధికి ఎదురుగా గణపతి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారట. పుత్ర వాత్సల్యంతో అమ్మవారి ఉగ్రతను శాంతిపొందుతుందని. ఇప్పటికీ బ్రహ్మోత్సవాల సమయంలో ఆ తాటంకములను శుద్ధిచేసి తిరిగి ధరింపజేసే అధికారం కంచి కామకోటి పీఠాధిపతులకు మాత్రమే ఉన్నది. అఖిలాండేశ్వరి అమ్మవారి తాటంకములను దర్శించినవారు సమస్త సన్మంగళములను పొందుతారని స్త్రీలు దీర్ఘ సుమంగళులై ఉంటారని  కన్యలకు త్వరలోనే వివాహ ప్రాప్తి కలుగుతుందనీ విశ్వాసం.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: