రామాయణమ్ 331
...
లంకానగర దక్షిణద్వారము వద్ద లక్షమంది యోధులు, పశ్చిమద్వారము వద్ద పది లక్షల సైనికులు,ఉత్తరద్వారమువద్ద కోటి మంది భటులు,తూరుపు ద్వారము వద్ద పదివేల మంది రాక్షసులు కాపలా కాయుచున్నారు.
.
నేను నాలుగు వంతెనలను,ప్రాకారములను మహావీరులైన రాక్షస సైన్యములో ఒక భాగమును నశింపచేసితిని.
.
మనము ,మన సైన్యము సముద్రము ఏదోవిధముగా దాటినచో లంక నాశనమైనట్లే !
.
అయినా ! రామచంద్రా సైన్యమెందులకు ?
.
నేను ,పనసుడు,అంగదుడు,మైందుడు ,ద్వివిదుడు,జాంబవంతుడు,
అనలుడు,నీలుడు ...మేము అందరమూ ఆకాశమార్గాన వెళ్ళి లంకను నాశనము చేసి సీతమ్మను తీసుకొని రాగలము అని హనుమంతుడు పలికిన మాటలు విని రాముడు ఇట్లనెను.
.
సుగ్రీవా ఇదే తగిన మూహూర్తము ఈ ముహూర్తము పేరు విజయము !
.
ఇప్పుడే బయలు దేరెదము ! సూర్యుడు ఆకాశ మధ్యమున ఉన్నాడు! నేడు ఉత్తరఫల్గునీ నక్షత్రము ! సకలసైన్యములనూ బయలుదేరదీయుము.
.
శకునములన్నియు అనుకూలముగా యున్నవి అని రాముడు అనగానే సుగ్రీవుడు అందులకు అంగీకరించెను .
.
ముందుగా ఒక లక్షసైన్యము బయలు దేరవలే ! ఆ సైన్యము మార్గమును సుగమము చేయుచూ వెడలును దానికి నీలుడు నాయకత్వము వహించును.
.
నీలా నీవు వెంటనే బయలుదేరుము మన మార్గములో కల ఆహారములు,జలములు ,ఫలములు,మూలములు రాక్షసులు కలుషితములు ,విషపూరితములు చేసిన చేయవచ్చును ! కావున వాటిని సంరక్షిస్తూ యుండుట నీవు నీసైన్యము చేయవలెను.
.
శత్రుసైనికులు ,గూఢచారులు ఎవరైనా ఉన్నారో లేదో గమనిస్తూ యుండ వలెను.
.
బలహీనులైన వారంతా కిష్కింధలోనే యుండిపోండి ! మనము చేయుకార్యము చాలా క్లిష్టమైనది !
.
జట్లు,జట్లుగా సైన్యమును నడిపించవలే అందులకు గాను గజ,గవయ,గవాక్షులు పూనుకొనవలె.
.
సమస్త సైన్యమునకు గంధమాధనుడు ఎడమవైపు ఉండి రక్షించవలె!
.
నేను హనుమంతునిమీద ఎక్కి ప్రయాణించెదను ,లక్ష్మణుని అంగదుడు తీసుకు రాగలడు .
.
సేన మధ్యభాగములో నేను ఉండెదను.
.
జాంబవంతుడు ,సుషేణుడు సేన మధ్యభాగమును రక్షించ గలరు.
.
అనుచూ సమస్త సైన్యము ఏ విధముగా ప్రయాణము చేయవలెనో రాముడు చెప్పగా అందుకు తగినట్లు సుగ్రీవుడు అందరినీ ఆజ్ఞాపించెను.
.
ఆ వెంటనే వానర సైన్యమంతా గుహలనుండి ,శిఖరములనుండి లేచి ఒక్క సారిగా గాలిలోకి పైకి ఎగిరిరి.
.
ఆ వానర సేన అంతా రాముని అనుసరించి ఉత్సాహముగా బయలుదేరిరి.
.
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి