21, సెప్టెంబర్ 2023, గురువారం

నవగ్రహ పురాణం - 60 వ అధ్యాయం*

 *నవగ్రహ పురాణం - 60 వ అధ్యాయం*

🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷


*సూర్యగ్రహ చరిత్ర - 3*



*"సంజ్ఞా!"* సూర్యుడి కంఠం ఆకాశంలో ఉరుములా ధ్వనించింది. పిలుపు మందిరమంతా ప్రతిధ్వనించింది.


ఛాయ లేచి ఆందోళనగా చూసింది. తండ్రిని చూడగానే , శనీ , సావర్ణి , తపతీ అసంకల్పితంగా తల్లి చాటుకు తప్పుకున్నారు..


*"యముణ్ణి శపిస్తావా ?”* సూర్యుడు ఛాయ దగ్గరగా నిలుచుని , ఆమె ముఖంలోకి , కళ్ళలోకి తీక్షణంగా చూశాడు. ఆయన శరీరంలోంచి భయంకరమైన వేడి చుట్టూ వ్యాపిస్తోంది. సూర్యుడి ఆగ్రహ జ్వాల తనని భస్మం చేసేస్తుందేమో అన్న భయంతో , ఛాయ అప్రయత్నంగా వెనుకకు జరిగింది.


*“నీ కుమారుణ్ణి శపిస్తావా ?”* సూర్యుడు హుంకరించాడు. *"తల్లికి తగిన ప్రవర్తనేనా ఇది ? నువ్వు... నువ్వు... తల్లివేనా ? చెప్పు !"*


ఛాయ వణుకుతూ ఆయన కళ్ళలోకి చూసింది. సూర్యుడి విశాల నేత్రాలు నిప్పులతో నిండిన బంగారు గిన్నెల్లా ఉన్నాయి. మహా ఆగ్రహజ్వాలలు ఆ కళ్ళల్లోంచి వెయ్యి కిరణాలుగా , వాడిగా , వేడిగా ఛాయ కళ్ళల్లోకి దూసుకుంటూ వెళ్ళాయి.


ఛాయ శరీరం చెమట బిందువులతో తడిసిపోతోంది. కళ్ళల్లో వేడిగా నీళ్ళు తిరుగుతున్నాయి. ఆమె శరీరం వణకసాగింది. *“నువ్వు తల్లివేనా ? తల్లివేనా ? తల్లివేనా ?"* సూర్యుడి అరుపు గుహలో సింహనాదంలాగా ఛాయ చెవుల్లో , ఆమె సర్వస్వంలో సుళ్ళు తిరిగింది.


అప్రయత్నంగా ఆమె పెదవులు కదిలాయి. *"నేను... నేను... ఆ ముగ్గురికీ తల్లిని... కాను...”*


*“సంజ్ఞా !”* సూర్యుడి కంఠంలో ఆశ్చర్యం గంటలా మ్రోగింది.


*"నేను... నన్నేం చేయకండి..నేను.. నేను...సంజ్ఞాను కాను...”.*


*“సం.....జ్ఞా !"*


*"నేను ఛాయను ! సంజ్ఞా ఛాయను ! తన ఛాయ అయిన నాకు ప్రాణం పోసి , సంజ్ఞా ఇక్కడికి పంపింది...”*


సూర్యుడు తన ఆగ్రహాన్నీ , తననూ , సర్వస్వాన్నీ మరిచిపోయి , ఉప్పెనలా కప్పేసిన నిబిడాశ్చర్యంలో మునిగిపోయి వింటున్నాడు. ఆరుగురు పిల్లలూ బొమ్మల్లా నిల్చున్నారు. ఛాయ వణికే కంఠంతో చెప్పుకు పోతోంది.


*“నాన్నగారూ..."* అంటూ యమి సూర్యుడి దగ్గరకు వెళ్ళి , చేతుల్తో ఆయన్ని చుట్టింది. *“అమ్మ... ఇంక రాదా ?”*


కూతురి ప్రశ్నకు సమాధానంగా సూర్యుడి చేతులు యమిని అక్కున చేర్చుకున్నాయి. సూర్యుడి హృదయం జాలితో నిండుతోంది. ఇంత కాలమూ తను తన బిడ్డల్ని తల్లి కాని తల్లి రక్షణలో ఉంచి , క్షోభకు గురిచేశాడు ! తాను 'ఛాయా సౌఖ్యం' అనుభవించాడు, ఛాయతో ! ఆ దాంపత్యం యధార్థం కాదు , ఆ సుఖం యధార్థం కాదు !


*"నాన్నగారూ ! మాకు మా అమ్మ కావాలి !"* వైవస్వతుడూ , యముడూ ఒకేసారి అన్నారు.


సూర్యుడు తల వాల్చి కూతురి తల మీద ఆప్యాయంగా చుంబించాడు. ఆమెను నెమ్మదిగా కుమారుల వద్దకు జరిపాడు. ముగ్గుర్నీ తదేకంగా చూశాడు. *"మీ అమ్మను తీసుకొస్తాను ! బాధపడకండి ! భయపడకండి !"* అన్నాడు. ఆయన స్వరంలో నిర్ణయం స్పష్టంగా పలికింది.


సూర్యుడు ఛాయ మాటల ద్వారా తెలిసిన వివరాల ఆధారంగా అరణ్య ప్రాంతం చేరుకున్నాడు. వాతావరణం ప్రశాంతంగా , శాంతంగా ఉంది. ధర్మపత్ని సంజ్ఞా కోసం ఆయన హృదయం ఆరాటపడుతోంది.


ఛాయ , సంజ్ఞ కాదు అని తెలిసిన క్షణం నుంచి సంజ్ఞ పట్ల విరహజ్వాల ఆయనను దహించడం ప్రారంభించింది. తన స్వాభావిక తాపాన్ని మించిన తాపంగా మారింది. ఆ విరహతాపం.


ఆయన నేత్రాలు నిర్విరామంగా సంజ్ఞ కోసం ఆ అరణ్యంలో గాలిస్తున్నాయి. ఆయనలోని ప్రతి అణువూ సంజ్ఞ కోసం ఆరాటపడుతోంది. ఆయన సర్వస్వమూ మౌన భాషలో సంజ్ఞను పిలుస్తోంది.


అరణ్యంలో అర్ధాంగి కోసం ఆదిత్యుడి అన్వేషణ నిర్విరామంగా సాగుతోంది. మనోజ్ఞమైన కాననవాతావరణంలో రకరకాల జీవజంతువుల అరుపులు ఆయనకి వినిపిస్తున్నాయి. ఇంత ప్రశాంతమైన అరణ్యంలో తపస్సు చేస్తున్న ఏ తాపసీ కనిపించడం లేదు. ఆలోచిస్తూ సంచరిస్తున్న సూర్యుడి చెవులకు ఒక కొత్త శబ్దం వినిపించింది... గుర్రం సకిలింత !


సూర్యుడి పాదాలు అప్రయత్నంగా సకిలింత వినవచ్చిన వైపు కదిలాయి. చెట్లనూ , పొదలనూ , అల్లిబిల్లిగా అల్లుకున్న తీగలనూ తప్పుకుంటూ సూర్యుడు వెళ్తున్నాడు. ఆయననే పిలుస్తున్నట్టు గుర్రం సకిలింత వినిపిస్తూనే ఉంది.


సూర్యుడు పొదలు దాటి , అప్రయత్నంగా ఆగి , చూశాడు. ఎదురుగా అందమైన సరోవరం. అటువైపు గట్టు మీద అందమైన పొదరిండ్లు , చెట్లు , గుబాళిస్తున్న పూల మొక్కలు , వాటి ముందు నిగనిగలాడుతున్న అందమైన గుర్రం !


తన సౌందర్యంతో దృష్టిని లాగి పట్టుతున్న శ్వేతాశ్వం ! తోక - సుందరాంగి వాలుజడలా అటూ ఇటూ సమ్మోహనకరంగా కదుల్తోంది. దాని శరీరం ఆరోగ్యంగా , పుష్టిగా మెరుస్తోంది. అది అశ్వరాజం కాదు ! ఆడ గుర్రం , బడబ ! అశ్వకాంత !


సూర్యుడు అసంకల్పితంగా ముందుకు కదిలాడు. గుర్రం ఉన్నట్టుండి చెవులు రిక్కించి , వెనుదిరిగింది. దాని ఎర్రటి కళ్ళు సూర్యుణ్ణి చూడగానే గుండ్రంగా పెద్దవిగా అయ్యాయి. తన వైపే చూస్తున్న ఆ కెంపుల్లాంటి కళ్ళలోకి చూస్తూ ఆగాడు సూర్యుడు.


ఎందుకో అశ్వకాంత శరీరం కొద్దిగా వణుకుతోంది. చెవులు రిక్కించుకునే ఉన్నాయి. గుండ్రటి కళ్ళు రెప్పపాటు మరిచిపోయి చూస్తున్నాయి. అందమైన శరీరాన్ని ఆవరించిన ఏదో స్పందన ఆ అశ్వకాంత కాళ్ళను చలింపజేస్తోంది. నాట్యం చేస్తున్నట్టు , రెండేసి కాళ్ళు ఒక్కసారి వంతున కదుల్తున్నాయి. ఆ కదలికలతో ఆ అశ్వకాంత తనువు సమ్మోహనకరంగా స్పందిస్తోంది. ఆ స్పందన హోయలు ఒలికే వగలాడి నడకను గుర్తుకు తెస్తోంది సూర్యుడికి.


సూర్యుణ్ణి చూస్తూ , వాలుజడలా వాలాన్ని ఊపుతూ , ఉన్న చోటనే కదం తొక్కుతూ కళ్ళకు విందుచేస్తోంది అశ్వకాంత ! అది అశ్వకాంత కాదు , అశ్వకామిని ! సూర్యుడి ముఖం మీద చిరునవ్వు నాట్యం చేసింది...


ఆ అశ్వకామిని ఆయనలోని రక్తాన్ని ఉరకలెత్తిస్తోంది. తన వైపే చూస్తున్న ఆ కెంపుల కళ్ళల్లో ఆయనకు సంజ్ఞ నేత్రాలు గోచరిస్తున్నాయి. విశేషమైన చలనంతో - అశ్వకామిని తనకు ఏదో సంజ్ఞ చేస్తోంది. ఔను ! సంజ్ఞ - సంజ్ఞ చేస్తోంది ! అశ్వభాషలో తనను ఆహ్వానిస్తోంది.


సూర్యుడు ఏదో ఉద్రేకంతో ముందుకు కదిలాడు. మరుక్షణం అశ్వకాంత కళ్ళల్లో , శరీరంలో ప్రత్యక్షమైన బెదురు ఆయనను కదలకుండా చేసింది.


సూర్యుడు అశ్వభామినినే చూస్తూ , చిరునవ్వు నవ్వాడు. ఏకాగ్రతతో ఏదో సంకల్పించాడు. క్షణంలో సూర్యుడు అందమైన అశ్వరాజంగా మారిపోయాడు. యవ్వనంతో తొణికిసలాడుతున్న అందమైన మగ గుర్రాన్ని చూడగానే అశ్వకాంత ఉత్సాహంగా కదిలింది. పురుషాశ్వం కూడా అశ్వకాంత వైపు కదిలింది. అంతే ఉత్సాహంగా , కదం తొక్కుతున్నట్టు , అశ్వకాంత అశ్వకాంతుడి వైపు అడుగులు వేసింది. అశ్వకాంతుడు అశ్వకాంత వైపు అడుగులు వేశాడు.


'సంజ్ఞాశ్వ' 'సూర్యాశ్వం' వైపు వయ్యారంగా అడుగులు వేసింది ! 'సూర్యాశ్వం' సంజ్ఞాశ్వం వైపు ఠీవిగా అడుగులు వేశాడు.


అద్భుతమైన , అద్వితీయమైన అశ్వశక్తి ఆ ఇద్దర్నీ ఒకరి వద్దకు మరొకర్ని నడిపించింది. సూర్యాశ్వం సంజ్ఞాశ్వం ముఖం దగ్గరగా తన ముఖాన్ని వుంచి ఆఘ్రాణించింది.

కామెంట్‌లు లేవు: