21, సెప్టెంబర్ 2023, గురువారం

మూర్ఖుడు

 శ్లోకం:☝️

*ఖాదన్న గచ్ఛామి హసన్న జల్పే*

*గతం న శోచామి కృతం న మన్యే |*

*ద్వాభ్యాం తృతీయో న భవామి రాజన్*

*కిం కారణం భోజ భవామి మూర్ఖః ||*


భావం: నేను నడుస్తూ తినను, నవ్వుతూ మాట్లాడను, గడచిన కష్టాల గురించి దుఃఖించను. నేను గతం గురించి ఆలోచించను. ఇద్దరు వ్యక్తులు ఏకాంతంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి మధ్యలోకి ఆహ్వానం లేకుండా వెళ్లి మూడవవాడిని కాను. నేను ఇవి చేయనందున నిజంగా బుద్ధిశాలిని. అలాంటప్పుడు, ఓ భోజరాజా! నన్ను ఎందుకు మూర్ఖుడు అని పిలుస్తావు?


   ఒకసారి భోజరాజు తన రాణిని ఆమె తోటలో సందర్శించడానికి వెళ్ళాడు. తన ఇష్టసఖితో ఏకాంతంగా మాట్లాడుకుంటూ కూర్చున్న ఆమెను చూశాడు. వారి ఏకాంతాన్ని గౌరవించకుండా, రాజు లోపలికి వచ్చాడు. రాణి అతనిని సమీపించడం చూసి, "ఓ మూర్ఖుడా! లోపలికి రండి!" అని పిలిచింది.

   తరువాత, భోజరాజు తన రాజభవనానికి తిరిగి వచ్చి, రాణి తనను మూర్ఖునిగా ఎందుకు సంబోధించిందో ఆలోచించి సరైన సమాధానం రాకపోవడంతో, అతను ఒక ఉపాయం పన్నాడు.

   భోజుని ఆస్థానంలో 14 మంది పండితులు కవులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆస్థానంలోకి ప్రవేశించడం ప్రారంభించినప్పుడు, అతను ఇలా అన్నాడు: "ఓ మూర్ఖుడా! లోపలికి రండి!" అని

   వారిలో ఎవరికీ ఎలాంటి స్పందన లేదు. వారు తమ తమ స్థానాలలో కూర్చున్నారు, "ప్రభువు నన్ను మూర్ఖుడని ఎందుకు సంబంధించారు? నన్ను ఎంతో గౌరవించేవాడు కదా! మూర్ఖుడిని ఆస్థానంలో ఎవరు నియమిస్తారు?"

చివరికి మహాకవి కాళిదాసు ఆస్థానంలోకి ప్రవేశించాడు. రాజు తన వింత సంబోధనని పునరావృతం చేస్తూ, "లోపలికి రండి, మూర్ఖుడా" అన్నాడు! "మూర్ఖడ"నే పదాన్ని కవి విన్న వెంటనే, అతను దానిని ఒక రకమైన సమస్య అనుకుని స్వీకరించి, తక్షణమే పై శ్లోక రూపంలో పూరణ ఇచ్చాడు.🙏

కామెంట్‌లు లేవు: