సనాతన ధర్మము-దాని విశిష్టత
ప్రస్తుత చర్చనీయాంశమగు 'సనాతన ధర్మము-దాని విశిష్టత"ను షడ్విధములు గా విభజించవచ్చును. (1) ధర్మము - దాని నిర్వచనము, (2) సనాతన ధర్మము-దాని నిర్వచనము, (3) సనాతన ధర్మము యొక్క ప్రబోధములు, (4) ధర్మాచరణ యొక్క విశిష్టత, (5) సనాతన ధర్మము యొక్క విశిష్టత, (6) ధర్మరాహిత్యము యొక్క దుష్ఫలితము.
పై విషయములను క్రమముగా ఒక్కొక్కటి సవిస్తారముగా చర్చించెదము. 1. ధర్మము-దానియొక్క నిర్వచనము
ప్రప్రథముగా ధర్మమననేమి, దానియొక్క నిర్వచనమేమి యను విషయమును విచారించెదము.
'ధర్మ’మను పదము సంస్కృతములోని 'ధృ' యను బీజశబ్దము నుండి పుట్టినది. 'ధృ' యను శబ్దమునకు అర్ధము 'ధరించునది' లేక 'భరించునది' లేక 'సంరక్షించు నది'. కాబట్టి 'ధర్మ' పదమును ఈ క్రింది విధముగా నిర్వచించిరి.
1) ‘ధరతి విశ్వం ఇతి ధర్మః' - విశ్వమును ధరించునది లేక సంరక్షించునది ధర్మం.
2) 'ధరతి లోకం వేతి ధర్మః' - లోకమును లేక ప్రపంచమును ధరించునది లేక సంరక్షించునది ధర్మమని తెలియబడున
3) ‘యతో భ్యుదయ నిఃశ్రేయస సిద్ధిః స ధర్మః' ఇహలోకమునందు అభ్యుదయమును, పరలోకమునందు శ్రేయస్సును కల్గించునది ధర్మం. -
4) సంవర్త స్మృతి క్రింది విధముగా నిర్వచించుచున్నది
'యస్మిన్ దేశే య ఆచారః పారంపర్య క్రమాగతః ! ఆమ్నాయై రవిరుద్ధ శ్చ స ధర్మః పరికీర్తితః ॥
'వేద విరుద్ధము కానటువంటిదియు, దేశములోని ఏ ప్రాంతములోనైనను పారంపర్యముగా అనుసరింపబడుతూ వస్తున్న సదాచారమును ధర్మమందురు'.
5) మరియు, భగవాన్ శ్రీ వ్యాసమహర్షి మహాభారతములో క్రిందివిధముగా నిర్వచించినాడు.
'ధారణాద్ధర్మ ఇత్యాహుః ధర్మో ధారయతే ప్రజాః। యత్ స్యాద్ధారణ సంయుక్తం స ధర్మ ఇతి నిశ్చయః|
'ఏదైతే ధరించునో లేక సంరక్షించునో దానిని ధర్మమందురు. ధర్మము ప్రజలను సంరక్షించును. ఏదైతే రక్షణాయుతమై (రక్షణతో గూడి) యున్నదో దానినే ధర్మమందురు. ఇది నిశ్చయము.
కనుక, మానవాళి మనుగడకు ధర్మమే ఆధారం. ధర్మము యొక్క బలము చేతనే విశ్వము నడచుచున్నది. ధర్మము పూర్తిగా నశించినపుడు, మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లి, విశ్వము గూడ నశించును. అందులకే “సత్యం వద, ధర్మం చర” యను వేదవాక్కు అతి ప్రసిద్ధమయినది. ప్రతి మానవుడు “సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి" యని శ్రుతిమాత ప్రబోధించుచున్నది. ఇదియే మన భారతీయ సంస్కృతికి పునాది.
II. సనాతన ధర్మము దాని యొక్క నిర్వచనము
ఇపుడు, సనాతన ధర్మమననేమి, దాని యొక్క నిర్వచనమేమి యను విషయమును తెలిసికొందము.
సనాతన ధర్మమును చతుర్విధములుగా నిర్వచించవచ్చును.
మొదటిది :
"సనాతనస్య ధర్మ ఇతి సనాతన ధర్మః" 'సనాతునుని (శాశ్వతుని లేక పరమాత్ముని) యొక్క ధర్మమును సనాతన ధర్మమందురు'. ఇది షష్ఠీతత్పురుష సమాసము. స్ధాపిత, స్థాపక సంబంధమును తెలుపుచున్నది. సనాతనుడైన భగవానుని చేత స్ధాపింపబడినదగుటచే దీనిని సనాతన ధర్మమందురు. ఉదా హరణకు క్రైస్తవులు, మహమ్మదీయులు, బౌద్ధులు-క్రీస్తును, మహమ్మదును, బుద్ధుని ఆయా మతముల యొక్క స్థాపకులుగా విశ్వసింతురు. అలాగుననే, సనాతన ధర్మము సనాతనుడైన భగవానునిచేతనే అమలు జరపబడినది గాని మరి ఏ మానవుని చేతను గాదని స్పష్టమగుచున్నది.
సనాతన ధర్మము తప్ప మిగిలిన ధర్మములను రెండు విధములుగా విభజించ వచ్చును. (1) భూతకాలములో ఉండి వర్తమానములో లేనివి, (2) భూతకాలములో
'సనాతన ధర్మము-దాని విశిష్టత 28
లేక వర్తమానములో ఉన్నవి. సనాతన ధర్మము ఈ రెండు తెగలకు సంబంధించినది గాదు. సనాతన ధర్మము అన్ని ధర్మముల కంటే ముందునుండి ఉన్నది, ఇపుడు గూడ జీవించియున్నది. కాని, దీనియొక్క భవిష్యత్తు ఏమిటి? యను ప్రశ్న రావచ్చును. దీనికి సమాధానమిచ్చునపుడు మనము ప్రకృతి నియమమును మనస్సులో నుంచు కొనవలయును. ఏదైతే పుట్టుతుందో అది గిట్టక తప్పదు - "యజ్జన్యమ్ తదనిత్యమ్”. ఈ నియమమును ఉల్లంఘించుటకు ఎవరికిని సాధ్యము కాదు. ఉల్లంఘించుట ఇంతకు ముందు జరిగియుండలేదు; భవిష్యత్తులో గూడ జరగబోదు. ఉదాహరణకు భగవానుడు సహితము ధర్మసంస్థాపనార్ధమై అనేక రూపములలో అవతరించినపుడు గూడ ఆ కార్యము నెరవేరిన వెంటనే తన అవతారమును చాలించుచున్నాడు. ప్రకృతి నియమమును ఉల్లంఘింప భగవానునికి సహితము సాధ్యము కాదు.
సనాతన ధర్మమునకు పుట్టుక అంటూ లేదు గాబట్టి, గిట్టుట గూడ ఉండదు. ఇది శాశ్వతమైనది, ఆద్యంతములు లేనిది.
రెండవ నిర్వచనము
“సనాతనశ్చాసౌ ధర్మశ్చ ఇతి సనాతన ధర్మః" - సనాతనమైనది (శాశ్వతమైనది) మరియు ధర్మమును అయినదగుటచే దీనిని సనాతనధర్మమందురు. ఇది కర్మధారయ సమాసము.
సనాతనుడైన భగవానునిచేత స్ధాపింపబడుటచేతనే దీనిని సనాతనధర్మ మనలేదు, ఇది స్వతః సనాతన మగుటచేతను దీనిని సనాతన ధర్మమనిరి. సనాతన ధర్మమునకు ఆద్యంతములు లేవు. ఇది సృష్టితో పాటు ఆవిర్భవించుచున్నది. సృష్టి యున్నంతవరకు ఇదియు నిలిచియే యుండును. ప్రళయకాలములో సహితము ఇది నశించుట లేదు. అపుడు గూడ ఇది బీజరూపములో ఉండి, మరల సృష్టి మొదలయినపుడు ఇది గూడ ప్రజలను సంరక్షించుటకున్ను, వారి నైతిక విలువలను పెంచుటకున్ను ఆవిర్భవించుచున్నది. సృష్టితో పాటు ఇదియు భ్రమించుచునే యుండును. అందువలన సనాతనధర్మమునకు ఆదియును, అంతమును లేదు. శాశ్వతమైనది.
అంతియే గాక, ప్రజల యొక్క నైతిక విలువలను పెంచుటకు కావలసిన ప్రబోధములను చేయుచున్నది. అందుచే ఇది ధర్మమును అయియున్నది. కాబట్టి, ఇది సనాతనము అయి యున్నది మరియు ధర్మమును అయి యున్నది. కనుక, దీనిని “సనాతన ధర్మ”మనిరి.
4 | iN+ : సనాతన ధర్మము-దాని విశిష్టత
మూడవ నిర్వచనము
ఇచట గూడ "సనాతన ధర్మము” కర్మధారయ సమాసములోనే చెప్పబడినది. కాని, “సనాతన”యను పదమునకు రెండవ నిర్వచనములో చెప్పినదానికంటే, కొంత విశేషమైన అర్ధమును ప్రతిపాదించుట జరిగినది. ఇచట దీనిని ఈ క్రింది విధముగ నిర్వచించవచ్చును.
“సదా భవః సనాతనః, సనాతనం కరోతి ఇతి సనాతనయతి! సనాతన యతీతి సనాతనః ! సనాతనశ్చాసౌ ధర్మశ్చ ఇతి సనాతన ధర్మః " ‘శాశ్వతముగా నిలిచి యుండునది సనాతనము, ఒక వ్యక్తిని సనాతనునిగా జేయునది గూడ సనాతనము, ఏదైతే సనాతనము మరియు ధర్మము అయియున్నదో అది సనాతన ధర్మము.
సనాతన ధర్మము, సనాతనుడైన భగవానునిచేత స్థాపింపబడిన దగుటయే గాక, తాను స్వతః సనాతనమగుటయు మరియు దానిని విశ్వసించి, ఆచరించిన వారిని ‘సనాతనులను’గా గూడ జేయును -అనగ వారికి అమృతత్వమును ప్రసాదించును. ఇన్ని కారణములచే దీనిని “సనాతన ధర్మ”మనిరి.
ఇపుడు, సనాతన ధర్మము నాచరించువారికి ఏ విధమైన అమృతత్వము లభించును? అనిన ప్రశ్న ఉదయించును. దానికి సమాధానము నాల్గవ నిర్వచనము లో విపులీకరించబడినది.
నాల్గవ నిర్వచనము
"సనాతనయతి ఇతి సనాతనః" 'సనాతనుని చేయును గాన సనాతన'మని పైన చెప్పబడినది. ఏవిధమైన సనాతనత్వమును ప్రసాదించును అనిన ఆ విష యము ఇపుడు విపులముగా వివరించబడినది. “సనాతనయతి" అనిన పదమునకు అర్ధము “సనాతనం పరమాత్మ స్వరూపం ప్రాపయతి ఇతి" అనగా పరమాత్మ స్వరూపమును పొందుటకు సనాతన ధర్మము మనకు సహకరించును.
త్రికరణశుద్ధితో సనాతన ధర్మము నాచరించు వ్యక్తులు ఆత్మ సాక్షాత్కారమును పొంది, పరమాత్మలో లీనమగుదురు. మోక్షమును బొందుదురు. ఇదియే సనాతన ధర్మము యొక్క గొప్పతనము. భారతదేశము ఆధ్యాత్మికముగ ఉచ్ఛస్థితిలో నుండుటకు ఇదియే కారణము.
సనాతన ధర్మము - దాని విశిష్టత....
5
భారతీయ సంస్కృతీ భవనము విదేశీయదాడులను ప్రతిఘటించి, ఈనాటికిని చెక్కుచెదరక, తన శోభను కోల్పోవక నిలిచియున్నదంటే, దానికి కారణము సనాతన ధర్మము వేసిన దృఢమైన, బలీయమైన పునాదులే.
సనాతనధర్మము శ్రుతి, స్మృతి, పురాణాలలో మహోన్నతమైన దైవీయ దృష్టితో దర్శనాత్మకముగా ప్రవచించిన సర్వధర్మ క్రోడీకరణ.
సనాతన ధర్మమునకు మూలాధారములను మనుస్మృతి ఈ క్రింది విధముగ సూచించుచున్నది.
శ్లో ॥ వేదః స్మృతిః సదాచారః స్వ స్య చ ప్రియమాత్మనః | ఏతచ్చతుర్విధం ప్రాహుః సాక్షాద్దర్మస్య లక్షణమ్ ||
(మను. II-12)
1) వేదములు, 2) స్మృతులు, 3) సాధుసంత్ల యొక్క ఆచార వ్యవహారములు, 4) ఆత్మకు ఆహ్లాదమును కలిగించు సత్కర్మలు - ఈ నాల్గు లక్షణములపై సనాతన ధర్మము ఆధారపడియున్నది.
సనాతన ధర్మము జీవుడు తన ఉపాధిగతమైన పరిధులలో ఎలా ప్రవర్తిస్తే తరిస్తాడో బోధిస్తుంది.
సనాతన ధర్మము ముఖ్యముగా సత్యవాక్పరిపాలన, అహింసాపాలన, సత్ప్రవర్తన (సచ్ఛీలత), శాంతి, త్యాగము, దయ, క్షమించుట, ఇంద్రియ నిగ్రహము, పరోపకార పరాయణత, క్షమ (ఓర్పు లేక సహనము), ద్వేషరహితము, క్రోధరహితము, అస్తేయము (పరుల వస్తువులను దొంగిలించకుండుట), నీతి, నియమము, ధర్మతత్పరత మొదలగు దైవీ సంపత్తిని పెంపొందించుకొని, మానవుడు తన జీవితమును దివ్యమయ మొనర్చుకొని, జీవిత పరమ లక్ష్యమైన 'మోక్షమును' బడయుటకు కావలసిన ప్రేరణనిచ్చును.
దైవీ సంపత్తికి కావలసిన గుణములను శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో క్రింది విధముగా పేర్కొన్నాడు.
శ్లో॥ అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్ధితిః |
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవమ్ ||
4)
సనాతన ధర్మము-దాని విశిష్టతలు
శ్లో॥ అహింసా సత్య మక్రోధ స్వాగశ్శాంతి రపైశునమ్। దయా భూతే ష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్ || శ్లో॥ తేజః క్రమా ధృతి శ్శాచ మద్రోహెూ నాతిమానితా |
భవన్తి సంపదం దైవీ మభిజాతస్య భారత ! ॥
(16-1,2,3)
'అర్జునా! అభయము, చిత్తశుద్ది, జ్ఞానోపాయమునందు దృఢమగు నిష్ఠ, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము, వేదాధ్యయనము, తపస్సు, సరళత, అహింస, సత్యవాక్పాలన, అక్రోధము, త్యాగము, శాంతస్వభావము, పరనిందను విడచుట, భూతదయ, లోభము లేకుండుట, మృదుత్వము, లజ్జ కలిగియుండుట, చాంచల్యము లేకుండుట, తేజస్సు, ఓర్పు, ధైర్యము, పరిశుభ్రత, వైరభావము లేకుండుట నిరభిమానిత్వము-ఈ గుణములన్నియు దైవీసంపదలో పుట్టినవానికి ఉండెడి లక్షణములు'.
మనుస్మృతి ధర్మము యొక్క ముఖ్యమైన పది లక్షణములను సూచించుచున్నది.
శ్లో॥ ధృతిః క్షమా దమో స్తేయం శౌచమింద్రియ నిగ్రహః | ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మ లక్షణమ్ ॥ (మను. VI-92)
'ఓర్పు, క్షమ, దమము, అస్తేయము, శౌచము, ఇంద్రియనిగ్రహము, ధీ, విద్య, సత్యము, అక్రోధము (క్రోధరహితము) ఇవి ధర్మము యొక్క పది లక్షణములు’.
సనాతన ధర్మము ప్రప్రథమముగా మనుష్యజన్మము యొక్క వైశిష్ట్యమును వేనోళ్ళ పొగడుచున్నది. మరియు ధర్మాచరణ చేత ఈ మానవజన్మను ఎలా సార్ధకము చేసికొనవలయునో బోధించుచున్నది.
మనుష్యజన్మ అతి దుర్లభమైనదనియు, అది దైవకృప వలననే లభించుననియు సనాతన ధర్మము చాటుచున్నది.
శ్లో॥ దుర్లభం త్రయమేవై తత్ దైవానుగ్రహ హేతుకమ్ |మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః ॥
'మనుష్యత్వము, మోక్షమునందు కోరిక, మహాపురుషులనాశ్రయించుట మూడును లభించుట చాలాకష్టము. అవి దైవానుగ్రహం వలనగాని లభింపవు'. అందుచేత మానవజన్మను సార్ధకము చేసికొనవలయును. 3
* సనాతన ధర్మము - దాని విశిష్టత 32-31.40
మానవుడు విషయభోగములను త్యజించి, దైవచింతనయందు నిమగ్నుడైయుండి, మోక్షమును బడయవలయునని సనాతనధర్మము నొక్కి వక్కాణించుచున్నది.
"ఎహి తన కర ఫల విషయ నభా ఈ । స్వర్గఉ స్వల్ప అంత దుఃఖదాఈ”
(తులసీదాసు)
ఈ మనుష్యజన్మ విషయభోగముల ననుభవించుటకు మనకు లభించలేదు. ఈ జన్మ స్వర్గవాసుల కంటెను చాలా ప్రశస్తమైనది. స్వర్గవాసులు తమ సత్కర్మల యొక్క ఫలమును స్వల్పకాలము ననుభవించి, మరల మర్త్యలోకము (భూలోకము) నకు తిరిగి రావలసినదే (క్షీణే పుణ్యేమర్త్యలోకం విశంతి -గీత), కాని మానవుడు ధర్మాచరణ చేతను, తపస్సుచేతను మోక్షమును బడయుటకు అవకాశమున్నది. ఈ అవకాశము స్వర్గలోకవాసులకు గూడలేదు. వారియొక్క అంతిమదశ దుఃఖదాయకమైనది. కాబట్టి, మనుష్యజన్మ దేవతల కంటెను మిన్నయైనదని శ్రీతులసీ దాసు వెల్లడిచేయుచున్నాడు.
ఇదే విషయమును శ్రీకృష్ణ పరమాత్మ గూడ భగవద్గీతలో అర్జునునికి బోధించినాడు. శ్లో!! తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి | ఏవం త్రయీధర్మ మనుప్రపన్నాః
గతాగతం కామకామా లభంతే ॥
‘వారు విశాలమగు స్వర్గసుఖము ననుభవించి, పుణ్యము క్షీణించినంతట మనుష్య లోకమున ప్రవేశింతురు. వేదత్రయ కర్మకాండను శరణుబొందు కామదాసులకు రాకపోకల యాతనలు తప్పవు'.
కాబట్టి, మానవుడు లౌకిక సుఖముల కొరకు కర్మకాండను శరణుబొందక, రాకపోకల యాతనల ననుభవింపక, అనన్య చింతనతో భగవానుని సేవించి, మోక్షమును బడయవలయునని సనాతనధర్మము బోధించుచున్నది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి