ఏరీ అలనాటి సర్వారాయుళ్లు?
"శ్రీ లక్ష్మీ కాఫీ హోటల్"
"పరమేశ్వర బ్రాహ్మణ కాఫీ హోటల్"
"ధనలక్ష్మీ ఆర్యవైశ్య కాఫీ హోటల్"
"సుబ్బారావుగారి కాఫీ భోజన హోటల్"
వీధిలోకి వెళ్ళగానే కనిపించే హోటల్లోకి అడుగుపెట్టగానే ముందు గదిలో టేబుల్ మీద పెద్ద సైజ్ రేడియో, బిల్లులను గుచ్చడానికి దబ్బనం లాంటి ఒక పరికరం, ఒకటో రెండో చాకోలెట్స్ సీసాలు పెట్టుకుని కుర్చీలో ఒక పెద్దమనిషి కూర్చుని కనిపిస్తాడు. అతని కుర్చీ వెనుక పదిరకాల దేవుళ్ళ ఫోటోలు గోడకు తగిలించి ఉంటాయి. అగరొత్తులు సుగంధాలు విరజిమ్ముతాయి. లోపలకి వెళ్ళగానే హాల్లో మూడు నాలుగు వరుసల్లో టేబుళ్లు, టేబుల్ కు అటూ ఇటూ రెండు కుర్చీలు కనిపిస్తాయి. మనం ఏదొక కుర్చీలో కూర్చోగానే బట్లర్ లేదా సర్వర్ వస్తారు. "టేబుల్ క్లీన్" అని కేకపెడతాడు. క్షణంలో ఒక వ్యక్తి వచ్చి తడిగుడ్డతో టేబుల్ మొత్తాన్ని కసకసా తుడిచేసి వెళ్ళిపోతాడు.
"ఏమున్నాయి?" ప్రశ్నిస్తాము. "ఇడ్లీ వడ ఉప్మా పూరి ఉల్లిదోసె సాదాదోస పెసరట్టు ఉప్మా పెసరట్టు" అని ఫుల్ స్టాప్, కామాలు లేకుండా ఆరనిముషంలో ఇరవై రకాల టిఫిన్ల దండకాన్ని చదువుతాడు. అలా ఒకసారి కాదు...రోజుకు కనీసం రెండు వందలసార్లైనా ఆ దండకాన్ని చదువుతాడు. అన్నీ విని సరిగా వినపడనట్లు ముఖం పెట్టి కొంతమంది మళ్ళీ అడుగుతారు. ఏమాత్రం విసుక్కోకుండా మళ్ళీ చెబుతాడు. ఆర్డర్ ఇవ్వగానే వెళ్లి రెండు మూడు నిముషాల్లో ప్లేట్ లో తీసుకుని వస్తాడు.
కొన్నిసార్లు ఉదయం వేళల్లో రద్దీగా ఉన్న సమయంలో ఒకేసారి నాలుగైదు ప్లేట్లను కూడా ఒకదానిమీద మరొకదాన్ని పెట్టి తీసుకొస్తాడు. నలుగురి దగ్గర ఆర్డర్ తీసుకుని కిచెన్ లోకి అన్నీ తెచ్చి ఎవరెవరు ఏమి అడిగారో వారికి కచ్చితంగా వాటినే ఇస్తాడు. చిన్నపొరపాటు కూడా జరగదు.
ఇడ్లీ సాంబార్ చాలా ఫేమస్. దానికి సాంబార్ ఇడ్లీ అని చెప్పాలి. మామూలు ఇడ్లీ అంటే ఇడ్లీ ప్లేట్ లో కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, కొద్దిగా కారప్పొడి తో తెస్తాడు. సింగిల్ సాంబార్ ఇడ్లీ అని చెబితే పెద్ద ప్లేట్ లో ఒక్క ఇడ్లీ తీసుకొచ్చి పెద్ద లోటాతో సాంబార్ తెచ్చి పళ్లెం నిండా పోస్తాడు. పావు లీటరు పైగానే ఉంటుంది. కొంతమంది ఆ ఒక్క ఇడ్లీకే మళ్ళీ సాంబార్ వేయించుకుంటారు.
తిన్న తరువాత "ఇంకేమి కావాలి సార్" అడుగుతాడు. "కాఫీ" అనగానే గ్లాసులో నురగలతో కాఫీ తెచ్చి ఇచ్చి చెవి పైభాగంలో దోపుకున్న పెన్సిల్ తీసుకుని జేబులొనించి చిన్న కాగితం ముక్క తీసి ఎంత అయిందో రాసి ఇస్తాడు. నేను తొలిసారి హోటల్లో తిన్నపుడు రెండు ఇడ్లీ పావలా. పూరీ రెండు అర్ధరూపాయి. కాఫీ ఇరవై పైసలు అని గుర్తు. ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ పూరి, తిని కాఫీ తాగితే తొంభై అయిదు అయిదు పైసలు అయ్యేది. రూపాయి నోటు ఇచ్చి "మిగిలింది ఉంచుకో" అనేసి వెళ్ళిపోయేవారు కొందరు.
1975 ప్రాంతంలో ఆంధ్రాలో కానీ, తెలంగాణాలో కానీ, తమిళనాడులో కానీ చిన్న చిన్న ఊర్లలో రెండు ఇడ్లి పావలా, రెండు పూరి అర్ధ రూపాయి, ఉల్లిపాయ దోసె అర్ధ రూపాయి ఉండేవి. స్వీట్ యాభై గ్రాముల బరువున్న ముక్క యాభై పైసలు.
అయితే ఈ సర్వర్లు కొందరు యజమానులు మోసం చేసేవారు. ఎలాగంటే వీరు విధుల్లో లేనపుడు వ్యాపారులు, ఉద్యోగస్తుల ఇళ్లకు వెళ్లి అయిదు రూపాయలు, పదిరూపాయలు అప్పుగా తీసుకునేవారు. వాటిని తీర్చడం వాళ్ళ వల్లయ్యేది కాదు. అందుకని వారు హోటల్ కు వచ్చినపుడు టిఫిన్ బిల్ రెండు రూపాయలు అయితే రూపాయిన్నర వేసి ఇచ్చేవారు. వంటవాళ్లు లోపల ఎక్కడో ఉండేవారు. యజమాని ముందుగదిలో గల్లా పెట్టె దగ్గర ఉండేవాడు. చిన్న చిన్న ఊళ్లు కావడం వలన అందరూ ఒకరికొకరు పరిచయం కలిగి ఉండేవారు. అందువలన వారు ఏమి తిన్నారు ఎంతయింది అనే విషయాలు పట్టించుకునేవారు కారు. ఈ సర్వర్లు చేసే మోసాల కారణంగా కొంతమంది యజమానులు దివాళా తీసి హోటల్ ను మూసెయ్యాల్సి వచ్చేది. తొందరగా మేలుకున్న యజమాని ఆ సర్వర్ ను నాలుగు తన్ని బయటకు గెంటేసేవాడు.
1995 వరకు మన రాష్ట్రాల్లో దాదాపు అన్ని హోటల్స్ ఇలా సర్వర్లతో కళకళలాడేవి. కానీ, ఆ తరువాత సెల్ఫ్ సర్వీస్ టిఫిన్ సెంటర్స్ వచ్చేసాయి. రోడ్డు పక్కన బండ్లు పెట్టుకుని టిఫిన్స్ అమ్మే పధ్ధతి వచ్చింది. హోటళ్లలో అయిదు రూపాయలు ఉండే దోశ బయట బండిమీద ఒక్క రూపాయి ఉండేది. 2000 ప్రాంతంలో అనుకుంటాను..దిల్సుఖ్నగర్ వేంకటాద్రి టాకీస్ ముందు వరుసగా పది బండ్లు ఉండేవి. వారు ఒక్క రూపాయితో దోసెను అమ్మటం స్టార్ట్ చేశారు. వారి దెబ్బకు అక్కడే ఉన్న హరిద్వార్ హోటల్ దివాళా తీసి మూతపడింది. హరిద్వార్ లో అప్పుడు దోశ అయిదు రూపాయలు!
సర్వర్లను పోషించడం ఆర్థికభారం అని భావించిన హోటళ్ల యజమానులు సెల్ఫ్ సర్వీస్ హోటళ్లను ప్రారంభించారు. వీటిలో ముందుగానే టోకెన్ తీసుకోవాలి. టోకెన్ చూపిస్తేనే మనకు టిఫిన్ ప్లేట్ ఇస్తారు. కూర్చోడానికి కుర్చీలు తీసేసారు. గోడకు కొట్టిన ఒక పొడవాటి చక్క మీద ప్లేట్ పెట్టుకుని నిలుచుని తినాలి. చట్నీ మళ్ళీ కావాలంటే మనమే వెళ్లి వేయించుకోవాలి. ఈ సంప్రదాయం కారణంగా వేలాదిమంది సర్వర్లు ఉపాధిని కోల్పోయారు.
ఏ మాటకామాటే చెప్పుకోవాలి. పెద్ద పెద్ద కార్పొరేట్ హోటళ్లలో టిఫిన్లకన్నా బయట బండ్ల మీద అమ్మే టిఫిన్లే నాకు నచ్చుతాయి. మన కళ్ళముందే చేస్తారు. ఉప్పుకారాలు మన అభిరుచికి తగినట్లుగా ఉంటాయి. నిన్న జూబిలీ హిల్స్ లో ఒక పెద్ద హోటల్ కు వెళ్ళాము టిఫిన్ చేద్దామని. అక్కడ రెండు ఇడ్లీ 120 రూపాయలు. రెండు పూరి 180 రూపాయలు. ఉల్లిపాయ దోశ 200 రూపాయలు. ఇడ్లీ గోరువెచ్చగా ఉన్నాయి. సాంబార్ ఉగ్గుగిన్నెతో తెచ్చాడు. నాలుగుసార్లు మళ్ళీ అడగాల్సివచ్చింది. చట్నీ ఎంత పల్చగా ఉన్నదంటే దానికన్నా మంచినీళ్లు చాల చిక్కగా ఉంటాయి. ఉప్పు కారం అనేవి అనే రెండు పదార్ధాలు ఈ ప్రపంచంలో ఆ ఉంటాయని ఆ హోటల్ యజమానులకు తెలుసో తెలియదో తెలియదు. ఇద్దరం తిని అయిదు వందల బిల్లు కట్టి వెంటనే NTV ఆఫీస్ సమీపంలో ఒక బండి హోటల్ ఉంటే వెళ్ళాము. సాంబార్ పెద్ద గంగాళంలో కుతకుత ఉడుకుతుంది. దానిలో పాతిక వడలు మునకలు వేస్తున్నాయి. పొగలు కక్కుతున్న ఆ సాంబార్ ను చూడగానే ప్రాణం లేచివచ్చింది. ఇడ్లీ అడిగాం. పెద్ద పేపర్ కప్పులో ఇడ్లీ వేసి నిండా సాంబార్ పోసి, ప్లేట్లో పెట్టి కొబ్బరి చట్నీ వేసి ఇచ్చాడు. అమృతం కూడా అంత రుచిగా ఉండదేమో! ఒక్క ఇడ్లీకే పావు లీటర్ సాంబార్ అయిపోగా మళ్ళీ బౌల్ నిండా పోశాడు. ఇద్దరం చెరో రెండు ఇడ్లీ తింటే ముప్ఫయి అయిదు రూపాయలు అయింది బిల్! .
మళ్ళీ ఆ పాత రోజులు వస్తాయా? అలాంటి వాతావరణాన్ని మళ్ళీ చూడగలమా?
ఒక మిత్రుని సౌజన్యం తో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి