🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*పాలవెల్లి ఎందుకు కడతారు?*
వినాయక చవితి రోజున *పాలవెల్లి* ఎందుకు కడతారో మనలో చాలా మందికి తెలియదు...మన పెద్దలు కట్టారని మనమూ కడుతున్నాం... వాళ్ళు ఎందుకు కట్టారో, వారిని మనం ఎందుకు అనుకరిస్తున్నామో తెలుసుకుందాం.....
వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారమూ ఇతర పండుగలకి భిన్నంగానే సాగుతుంది. వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. పాలవెల్లి లేకపోతే గణేశుని పూజకి ఏదో లోటుగానే కనిపిస్తుంది.
ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే...అందుకు ఒకటేంటి చాలా కారణాలే కనిపిస్తాయి....
*ఈ అనంత విశ్వంలో భూమి అణువంతే! ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటానుకోట్లు కనిపిస్తాయి. ఒక పాలసముద్రాన్నే తలపిస్తాయి. అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము. ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు.
గణేశుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా! ప్రకృతిలో సృష్టి, స్థితి, లయలనే మూడు స్థితులు కనిపిస్తాయి. గణేశుని పూజలో ఈ మూడు స్థితులకూ ప్రతీకలని గమనించవచ్చు. ఈ భూమిని (సృష్టి) సూచించేందుకు మట్టి ప్రతిమను, జీవాన్ని (స్థితి) సూచించేందుకు పత్రినీ, ఆకాశాన్ని (లయం) సూచించేందుకు పాలవెల్లినీ ఉంచి ఆ ఆరాధనకి ఓ పరిపూర్ణతని ఇస్తాము.
*గణపతి'* అంటే గణాలకు అధిపతి, తొలిపూజలందుకునే దేవత. మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే కదా! ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అనుకోవచ్చు. అలా పాలవెల్లిని సమస్త దేవతలకూ ప్రతికగా భావించవచ్చు.
పాలవెల్లి అంటే పాలపుంతే అని తేలిపోయింది. మరి అందులో నక్షత్రాలు ఏవి! అందుకే వెలగపండుని కడతాము. దాంతో పాటుగా మొక్కజొన్నపొత్తులు, మామిడిపిందెలు, జామ, దానిమ్మలాంటి పండ్లనీ కడతాము. ఇవన్నీ వివిధ ఖగోళవస్తువులకు సూచన అన్నమాట.
ఏ దేవతకైనా షోడశోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ. కానీ వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా! పైగా గాణపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి. అలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవెల్లి కాక మరేముంటుంది.
గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు. మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుని కొలుచుకునే సందర్భం. బియ్యంతో చేసిన ఉండ్రాళ్లు, చెట్ల మీద పత్రి లాంటి వస్తువులే ఇందులో ప్రధానం. ఏదీ లేకపోతే మట్టి ప్రతిమను చేసి, పైన పాలవెల్లిని వేలాడదీసి, గరికతో పూజిస్తే చాలు....పండగ అంగరంగవైభవంగా సాగిపోయినట్లే! పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టిన పాలవెల్లి గణేశుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది....✍️
🌷🙏🌷
లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి