🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-67🌹*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
ఈసన్నిధిలో శ్రీరామచన్ద్రుడు సీతా లక్ష్ముణులతో కొలువై ఉన్నారు
ఇందుకు కారణమేమనగా;
దక్షిణ మధురకు సమీపమునగల "కురువిత్తురై" అను గ్రామమునకు "విశ్వంభరుడు" అనుమహర్షికి సాక్షాత్కరించినట్టి అభయప్రద శ్రీరామచంద్రుని (విభీషణునకు అభయమిచ్చిన శ్రీరామచంద్రుని) ఆలయం ఉండేది.
ఆ ఆలయంలో రామలక్ష్మణుల విగ్రహములు మాత్రము ఉండేవి. కొన్ని ఉపద్రవముల వలన ఆ విగ్రహములను అచటి భక్తులు తిరుపతికి తీసికొనిపోయి భగవద్రామానుజులకు నివేదించినారట.
ఆసమయంలో శ్రీమద్రామాయణమున అభయప్రదాన ఘట్టం కాలక్షేపం జరుగుచుండినందు వలన ఆస్వామియే స్వయముగా వేంచేసినాడని తలచి రామానుజులు సీతాదేవి యొక్క అర్చామూర్తిని కూడా వారి ప్రక్కనే ప్రతిష్ఠింపజేసి తిరుక్కల్యాణ మహోత్సవం జరిపించి తిరుమలై లోని తిరువేంగడముడై యాన్ సన్నిధిలో వేంచేసింప చేసారు
. ఆ మూర్తులను నేడు మనం సేవింపవచ్చును. తప్పక సేవించాలి.
ఇట్లే తిరుపతిలోని గోవిందరాజ స్వామి సన్నిధిలో "ఆండాళ్" అర్చా విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసారు. గోవిందరాజస్వామి వారి ఉత్తరమాడ వీధిలో ఒక అగ్రహారాన్ని నిర్మించారు. దీనికి "శ్రీరామానుజపురం" అనిపేరు. తమ ప్రతినిధిగా సన్నిధికై కైంకర్యములు పర్యవేక్షించుటకు "సేనాపతిజీయర్" అనువారికి హనుమన్ముద్రిక నిచ్చి నియమించారు.
ఆముద్రికతోనే నేటికిని రాత్రిభాగమున సన్నిధి తాళములకు సీలు చేయబడుచున్నది.
ఇట్లే "తిరుక్కురువై" అనే గ్రామంలో "కురువైనంబి" అనుకుమ్మరి శ్రీవేజ్కటాచలపతిని అనన్య భక్తితో సేవించుచుండెడివాడు.
అతడు పరమపదించు సమయమున ఇచట స్వామి తిరుమంజనమునకై కిరీటాద్యాభరణములను తొలగించుకొని యుండి సహజ రూపంతోనే ఆ భక్తునకు దర్శనమిచ్చి పరమపదం అనుగ్రహించినాడట.
ఈవృత్తాన్తాన్ని వినిన భగవద్రామానుజులు ఆగ్రామంలో ఒక ఆలయం నిర్మించి అందు కిరీటాదుల లేక సహజరూపంలో ఉండు శ్రీవేజ్కటాచలపతిని, ఆప్రక్కనే "కురువైనంబి" విగ్రహాన్ని ప్రతిష్ఠించారట.
ఈకురువై నంబి స్వామికి అంతరంగికులు.
శ్రీఆళవన్దారుల ఆజ్ఞానుసారం పెరియతిరుమలనంబిగారు భగవద్రామానుజులకు తిరుమల అడివారంలో శ్రీమద్రామాయణ కాలక్షేపం సాయించేవారట.
ప్రతినిత్యం తిరుమలలో తీర్థ కైంకర్యాదికం పూర్తిచేసికొని కొండదిగివచ్చి కాలక్షేపం సాయించు చుండుట చేత మాధ్యాహ్నిక సేవ లభించుట లేదే అనివారు ఒక రోజు చింతించుచుండగా స్వామి ఆరాత్రి వారికి స్వప్నంలో ఇదిగో మీకు సేవ సాయించుచున్నాము చూడండి అనిపలికినారట.
మరునాడు తీర్థ కైంకర్యం పూర్తి చేసికొని అడివారమునకు రాగానే అక్కడ ఒక చింతచెట్టు క్రింద ఒక బండమీద స్వామి పాదములు దర్శనమిచ్చినవి.
శ్రీరామానుజులు తమ ఆచార్యులద్వారా ఆ అద్భుత వృత్తాన్తాన్ని విని అచట ఆలయాన్ని నిర్మించి ఆళ్వార్లను కూడా అందు ప్రతిష్ఠింపజేసి నిత్యారాధన జరిగేలాగున ఆదేశించారట. అందే శ్రీమద్రామాయణ కాలక్షేపం పూర్తిగావించారు.
తిరుమల శ్రీనివాసునిపై ప్రముఖ గ్రంథములు
భగవద్రామానుజులు తిరుమల శ్రీనివాసుని యెదుటనే వేదార్దసంగ్రహమును ఉపన్యసించారు.
అఖిల భువన జన్మ స్థేమ భంగాది లీలే
విసత వివిధభూత వ్రాత రక్షైక దీక్షే
శ్రుతి శిరసి విదిప్తే బ్రహ్మణి శ్రీనివాసే
భవతు మమ నరస్మిన్ శేముషీ భక్తిరూపా||
అని ఈస్వామి ప్రార్థనతో శ్రీభాష్య రచనకు ఇచటనే శ్రీకారం చుట్టారు. కావుననే శ్రీభాష్యకారుల ఆలయం ఈ ఆలయ ప్రాకారంలో ఉన్నతంగా దర్శనమిచ్చు చున్నది. మరియు ఇచట వారు జ్ఞానముద్రతో వేంచేసియున్నారు.
వీరు శ్రీవేంకటాచలాదీశ శంఖచక్ర ప్రదాయకులు గదా!
ఈస్వామిని స్తుతించు స్తోత్రాలలో శ్రీవేంకటేశ ఘంటావతారంగా ప్రసిద్దులైన శ్రీవేదాన్త దేశికులవారి "దయాశతకమ్" అగ్రగణ్యమైనది
.తొలుత శ్రీవేదాన్త దేశికుల వారికిని, తర్వాత మణవాళ మహామునులకును కరుణైక పాత్రమ్" అని కీర్తింపబడుచు శ్రీమన్మణవాళ మహామునుల అష్టదిగ్గజములలో నొకరైన "శ్రీప్రతివాది భయంకరం అణ్ణన్" అను ఆచార్య తల్లజులు ఈస్వామిని గూర్చి సుప్రభాత, స్తోత్ర, ప్రపత్తి; మంగళాశాసన శ్లోకాలను అనుగ్రహించారు.
ఇవినేడును అనుదినం ఉష:కాల సేవలో స్వామియొద్ద అనుసంధింపబడును బహుళప్రచారం పొందియున్నవి.
శ్రీగోవిందరాజాచార్యులు అనే మహనీయులు, శ్రీమద్రామాయణమునకు "గోవిందరాజీయమ్" అనే వ్యాఖ్యను ఇచటనే వ్రాసినారు.
శ్రీమత్పరమ హంసేత్యాది శ్రీశ్రీశ్రీ పరకాల మఠం జీయర్స్వామివారు (మైసూర్) "అలంకారమణిహారం" అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని అనుగ్రహించారు. అందు ఉదాహరణ శ్లోకాలను శ్రీశ్రీనివాసుని స్తుతించునట్లు వ్రాసియున్నారు.
పదకవితా పితామహుడైన శ్రీతాళ్లపాక అన్నమాచార్యులవారు తమగేయాలలో శ్రీవేంకటాచలపతిని మైమరచి తనివి తీర కీర్తించారు.
తామ్రపత్రములపై లిఖింపబడిన ఆగీతాలను తి.తి.దేవస్థానం వారు స్వర పరచి చక్కగా ముద్రించి ప్రజలకు అందించారు. ఇట్లే అన్నమాచార్యుల వారి కుటుంబ సభ్యులును వేంకటా చలపతిని వేనోళ్ళ కీర్తించారు.
పురందరదాసు, త్యాగరాజు మున్నగు గాయక సార్వభౌములెందరో తమ తమ మాతృభాషలలో స్వామిని కీర్తించి తరించారు.
మహాభక్తురాలగు తరిగొండ వేంగమాంబ యీస్వామి వైభవమును కావ్యముగా రచించుటయేగాక స్వామి మహిమలను ప్రత్యక్షముగా నిరూపించింది.
*శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి