దుర్గముడు దుష్టబుద్ధి కలవాడు..మూర్తీభవించిన తమోగుణ శ్రేష్టుడు.మిక్కిలి సోమరి.అహంకారి..క్రూరుడు.తిండిపోతు..చారుల ద్వారా దేవ దానవుల చరితమును తెలుసుకున్నాడు..దేవతల అహంకారానికి ,బలానికి మూల కారణం వేదాలు అని గ్రహించాడు..ఆ వేదాలను తన స్వాధీనం లోకి తెచ్చుకున్నట్లు ఐతే దేవతలు బలహీనలై నశించి పోతారని భావించాడు..విధాత ఐన బ్రహ్మను గురించి గాలినే ఆహారంగా తీసుకుంటూ వేయి సంవత్సరాలు తీవ్ర తపస్సు చేశాడు..ఆ తపస్సునకు లోకాలన్నీ తల్లడిల్లి పోయాయి..దుర్గముని తపస్సునకు బ్రహ్మ ప్రసన్నుడై "నీకు శుభం కలుగు గాక..ఏం వరం కావాలో కోరుకోమన్నాడు" ..బ్రహ్మ మాటలకు పరమానంద భరితుడైన దుర్గముడు భక్తితో పూజించి వినమ్రుడై "చతురాననా ! విధాతా! నాకు వేద విజ్ఞానాన్ని ప్రసాదించు ..దేవతల దగ్గరా,బ్రాహ్మణుల దగ్గర ఉన్న వేద మంత్రాలన్నీ నాకు ప్రసాదించు..ఆ మంత్రాలు నాకు రాగానే వారు వాటిని మరచి పోవాలి..దేవతలందరినీ జయించే బలం నాకు ప్రసాదించమని కోరాడు..బ్రహ్మ ఆశ్చర్యపోయి , వెను వెంటనే తేరుకుని తధాస్తు అన్నాడు.. ఆ క్షణం నుండి దుర్గమునికి సకల వేద మంత్రాలు స్వాధీన మయ్యాయి..విప్రులు వేదాలను మరచి పోయారు..దానితో స్నానం, సంధ్యావందనం,నిత్యాగ్ని హోత్రాలు,యజ్ఞాలు,జపాలు అన్నీ స్తంభించి పోయాయి..భూమండలం అంతా అల్లకల్లోలం ఐపోయింది.యజ్ఞాల ద్వారా వచ్చే హవిస్సులు అందకపోవడం వలన దేవతలు నిర్వీర్యులు అయ్యారు..జరారహితులు అయినప్పటికీ వారు జరాగ్రస్తులు అయ్యారు..సకాలంలో వర్షాలు కురవక పోవడంతో నేలలు బీటలు వారాయి..నూతులు, బావులు,చెరువులు,నదులు నీళ్ళు లేక ఎండి పోయాయి..భూమండలం అంతా అనావృష్టి ఏర్పండింది..అసంఖ్యాక ప్రజలు, పశు పక్ష్యాదులు దుర్మరణం పాలయ్యాయి..చివరకు కొందరు బ్రాహ్మణులు, ము,ఋషులు అమ్మవారి అనుగ్రహం తో బ్రతికిన వారు హిమాలయాలకు వెళ్లి ,కొండ గుహల యందు చేరి శక్తి స్వరూపిణి అయిన జగన్మాతను ప్రార్థిస్తూ" నీవే మాకు దిక్కు..ఈ ఘోర సంకటం నుంచి మమ్మల్ని ఉద్ధరించు..కరుణ చూపించు..నీవు తప్ప మమ్మల్ని కాపాడే వారు ఎవరూ లేరు..మమ్మల్ని అనుగ్రహించు తల్లీ ":అని కోరినారు..వీరి ప్రార్థనలను విని కరుణతో జగదాంబ ఐన మహేశ్వరి వారి ఎదుట ప్రత్యక్ష మైనది.. సర్వ శక్తులనూ సమకూర్చింది..దేవ బ్రాహ్మణులు జయజయ ధ్వానాలు చేశారు.. దుర్గమునితో జరిగిన యుద్ధ సమయంలో దేవి శరీరం నుండి కామాక్షి,మోహిని,చిన్నమస్త, గుహ్యకాళి అనే శక్తులు ఉద్భవించాయి..దుర్గముని సైన్యాన్ని 11 రోజులు యుద్ధం చేసి ఓడించింది.."ఈ వేదాలు నా దివ్య శరీరం.వేదాలున్న చోట నేనుంటాను..వీటిని మీరు నిరంతరం అభ్యసించినంత కాలం ఎవరూ ఈ వేదాలను అపహరించలేరని పలికి వారిని తన చల్లని చూపులతో ఆశీర్వదించి అదృశ్యమైంది..ఆది పరాశక్తి,పరాశక్తి ఐన దుర్గాదేవిని అందరం భక్తి శ్రద్ధలతో పూజించి ,మాత ఆశీస్సులను పొంది జీవితాలను పొంది ధన్యం చేసుకుందాము..సర్వే జనాః సుఖినో భవంతు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి