*భక్తిపరుడు..*
శనివారం సాయంత్రం ఐదు గంటల వేళ ఆయన మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం లో అడుగుపెట్టారు..కుళాయిల వద్దకు వెళ్లి కాళ్ళూ చేతులూ శుభ్రం చేసుకొని..స్వామివారు త్రవ్వించుకున్న బావి లోంచి బకెట్ తో నీళ్లు తోడుకొని..వాటిని చేతిలో పోసుకొని తీర్ధం లాగా కళ్లకద్దుకొని తాగి..మిగిలిన కొద్దీ నీళ్లను తన తలమీద చల్లుకుని..మా సిబ్బంది వద్దకు వెళ్లి కూర్చున్నారు..ఆయనను చూడగానే.."గంగయ్య గారూ..ఎప్పుడు వచ్చారు?.." అంటూ మా సిబ్బంది ఆప్యాయంగా పలకరించుకున్నారు..అక్కడినుంచి లేచి నేను కూర్చున్న చోటుకి వచ్చి.."అయ్యగారూ బాగున్నారా?.." అంటూ నన్ను ప్రశ్నించి..నమస్కారం చేశారు..నేనూ ప్రతి నమస్కారం చేసి.."ఇప్పుడేనా రావడం గంగయ్య గారూ.." అని అడిగాను.."ఇప్పుడే అయ్యా..స్వామివారిని దర్శించుకొని వెళ్లాలని అనిపించింది..వచ్చేసాను..రేప్పొద్దున తిరిగి వెళ్లిపోతాను..వీలుంటే ఏదైనా ఒక రూము ఇప్పించండి..లేకపోయినా బాధలేదు..ఈ మంటపం లోనే పడుకుంటాను..ఆ స్వామి దయ ఎలా ఉంటే అలా.." అని చెప్పారు..రూములేవీ ఖాళీ లేవని చెప్పాను.."పర్లేదు స్వామీ.." అని తన చేతి సంచీని మా సిబ్బంది కూర్చున్న బల్ల ప్రక్కన పెట్టి..మంటపం లోకి వెళ్లి కూర్చున్నారు..
గంగయ్య గారు హైదరాబాద్ లో వుంటారు..వ్యాపారం చేసుకుంటూ వుంటారు..ముగ్గురు సంతానం..అందరికీ వివాహాలు చేసేసారు..ఆయన తన ముప్పయ్యవ ఏట తొలిసారిగా..అంటే..సుమారు 1978, 79 ప్రాంతంలో మొగిలిచెర్ల వచ్చి..స్వామివారి సమాధిని తొలిసారి దర్శించుకున్నారు..ఆరోజు ఆయన కోరుకున్న కోరిక..తాను హైదరాబాద్ వెళ్లి వ్యాపారం చేయాలని అనుకుంటున్నాననీ..తనకు ఏవిధమైన ఇబ్బందులూ కలుగకుండా..తానూ..తన సంసారం చల్లగా వుండేటట్టు చూడమని..స్వామివారి సమాధి వద్ద కోరుకున్నారు..గంగయ్య గారి మంచితనం కావొచ్చు..స్వామివారి ఆశీర్వాదం కావొచ్చు..ఆయన వ్యాపారం లో నిలద్రొక్కుకున్నారు..అక్కడే ఇల్లు కట్టుకున్నారు..పిల్లలను జాగ్రత్తగా పెంచుకున్నారు...వీటన్నింటికీ మొగిలిచెర్ల లో సిద్ధిపొందిన అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆశీస్సులే కారణం అని గంగయ్య గారి ప్రఘాఢ విశ్వాసం..అందుకనే ప్రతి ఏటా..మూడుసార్లు మొగిలిచెర్ల కు వచ్చి..స్వామివారి సమాధిని దర్శించుకొని వెళుతుంటారు..ప్రతిసారీ స్వామివారి మందిర అభివుద్ది కొఱకు కొంత విరాళం గా ఇచ్చి వెళుతుంటారు..
"అయ్యగారూ..పోయినసారి వచ్చినప్పుడు..ఒక చిన్న సమస్యతో వచ్చాను..చిన్నదైనా పెద్దదైనా ఈ స్వామివారికి చెప్పుకుంటే..ఇక భారం ఆయనే భరిస్తాడు కదా అనే నమ్మకం తో వచ్చానయ్యా..మా రెండోవాడి కుమారుడికి ఆరోగ్యం సరిగా లేదు..తరచూ జ్వరం వస్తోంది..హైదరాబాద్ లోని పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో చూపించాము..అన్ని పరీక్షలూ చేశారు..కొన్నాళ్ళు బాగానే ఉంటాడు..నాలుగైదు నెలల తరువాత మళ్లీ అదేరకంగా అనారోగ్యం తో ఉంటున్నాడు..అప్పుడు నా కుమారుడికి సలహా ఇచ్చాను..ఒక్కసారి పిల్లవాడిని తీసుకొని మొగిలిచెర్ల వెళ్లి..ఆ దత్తాత్రేయుడి పాదాలవద్ద నమస్కారం చేసుకొని రండి..ఏవైనా దోషాలుంటే పోతాయి..పిల్లవాడూ బాగుపడతాడూ..అని..నామాట వినలేదు..నేనే ఇక్కడికి వచ్చి స్వామివారి వద్ద గట్టిగా మొక్కుకొని..మీ దగ్గరనుంచి స్వామివారి విభూతి గంధం తీసుకెళ్ళాను..మా కోడలికి చెప్పి..ప్రతిరోజూ పిల్లవాడి నుదుటిన స్వామివారి విభూతి పెట్టమని చెప్పాను..ఆ తరువాత ఈరోజు దాకా వాడిలో అనారోగ్యం అనే మాటే లేదు..ఈరోజు స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చాను.." అన్నారు.."గంగయ్య గారూ కల్మషం లేని భక్తి మీది..మీ కోరిక స్వామివారు తప్పక నెరవేస్తారు.." అన్నాను..ఆ మాట నిజం కూడా..గంగయ్య గారు త్రికరణ శుద్దిగా స్వామివారిని నమ్మారు..అందువల్ల వారిమీద స్వామివారి కృప ఉండటం లో ఆశ్చర్యం లేదు..
ఏనాటికైనా మొగిలిచెర్ల లో గల శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి దగ్గరలో ఒక ఇల్లు కట్టించుకొని..తన శేష జీవితాన్ని స్వామివారి సన్నిధిలో నిరాడంబరంగా గడపాలని గంగయ్య గారి కోరిక..అది నెరవేరే రోజు కోసం ఆయన ఎదురు చూస్తున్నారు..మరి స్వామివారు ఎప్పుడు కరుణిస్తారో చూడాలి..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి