7, అక్టోబర్ 2023, శనివారం

రామాయణమ్ 347

 రామాయణమ్ 347

...

చిన్నాన్నా! ఏమిటీ పిరికితనము!మనకులములో పుట్టని సామాన్యుడు కూడా ఈ విధముగా మాటలాడడే నీకెచటినుండి వచ్చినదీ బేలతనము ! ఒక సామాన్య రాజపుత్రయువకుని చూసి మనము భయపడుటయా?

.

ముల్లోకములకూ ప్రభువైన దేవేంద్రుని నేను నేలపై పడవేసి ఈడ్వలేదా ! అది నీకు గురుతులేదా! ఐరావతదంతములు ఊడబెరికి దేవతలను భయభ్రాంతులకు గురిచేయలేదా !

.

అంతటి మహాపరాక్రమవంతుడనైన నేను ఆ రామలక్ష్మణులను ఓడించలేనా ? ఎందుకు పినతండ్రీ ఈ అర్ధములేని వ్యర్ధపు పిరికి మాటలు ....అని ఇంద్రజిత్తు విభీషణునితో గర్వముగా పలికెను.

.

అది విని విభీషణుడు ," నాయనా మేఘనాధా ! నీవింకా చిన్నవాడవు ! బుద్ధి పరిపాకము చెందలేదు ! మంత్రాంగమునందు నీకింకా నిశ్చితమైన బుద్ధిలేదు .నీ మాటలు ఆత్మవినాశకారకములు.

.

తీక్షణమైన స్వభావము కల!

 నిన్ను ఈ మంత్రాంగమందిరములోనికి అనుమతించినవాడు దండనార్హుడు.

.

రామబాణములు మృత్యుదేవత ఒడిలోనికి నెట్టివేయు యమదండములు అవి మనజాతికి పెనుగండములు.

.

రాజా ! నా మాట విను సీతమ్మను సర్వరాజలాంఛనాలతో ఆయనకు అప్పగించు. నా మాట విను మన జాతిని కాపాడు అని రాక్షససార్వభౌముని వేడుకొన్నాడు.

.

స్థిరగంభీరముగా హితవుపలికిన విభీషణుని చూసి ఈసడించి, ఛీ ! శత్రువుతోనైనా బ్రతుకవచ్చు

పామును ఒడిలో పడుకొనపెట్టుకొనవచ్చు !...కానీ నీలాంటి బంధువు రూపములోని శత్రువుతో ఒక్క క్షణము కూడా కలిసి ఉండలేము. 

.

జ్ఞాతుల స్వభావమే అంత! వారు తమకన్నా ప్రధానుడు,విద్యావంతుడు,శూరుడు అయిన వానిని తిరస్కరింతురు.

.

ఒక పూవునుండి మకరందము సేకరించు తుమ్మెద ఆ పూవువద్ద కృతజ్ఞతతో ఉండక మరియొక పూవు వద్దకు వెళ్ళును .నీవునూ అట్లే ! 

.

నీవు కాక మరొకడెవ్వడైనా ఇటుల మాటలాడి ఉన్నచో వాని కుత్తుక ఈ పాటికే ఉత్తరింపబడియుండెడిది.

.

ఛీ! కులద్రోహీ వెళ్ళిపో నా ముందునుండి అని తీవ్రముగా హెచ్చరించాడు రావణుడు.

.

ఆ వెనువెంటనే విభీషణుడు గద ధరించి ఆకసములోనికి ఎగురగా ఆయనను నలుగురు సహచరులు అనుసరించిరి.

.

వూటుకూరు జానకిరామారావు 

.


.

కామెంట్‌లు లేవు: