7, అక్టోబర్ 2023, శనివారం

నవగ్రహ పురాణం - 73 వ అధ్యాయం*

 *నవగ్రహ పురాణం - 73 వ అధ్యాయం*

🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷


*కుజగ్రహ చరిత్ర - 3*


*"అమ్మా ! నేను మంగళవారం జన్మించాను ! నాకు నువ్వు నేడు - అంటే మంగళవారమే దర్శనం అనుగ్రహించావు. నా పేరు మంగళుడు ! ఈ 'మంగళ' శబ్దం మనిద్దరినీ కలిపి ఉంచాలి. నా నామధేయం నీ నామధేయంతో కలిసి పరమపావనం కావాలి ! అనుగ్రహించు !"*


*“తథాస్తు ! నీ ఆలోచనా సరళి నన్ను అలరిస్తోంది."* పార్వతి చిరునవ్వులు చిందిస్తూ అంది. *"నువ్వు ఆవిర్భవించింది మంగళవారం ! నేను నీ ముందు అవతరించింది మంగళవారం ! నీ పేరు మంగళ... నా పేరు కూడా మంగళను స్వీకరిస్తుంది. 'చండిక' అయిన నేను ఈనాటి నుండి 'మంగళ చండిక'గా వ్యవహరింపబడతాను !”*


*"ధన్యోస్మి మాతా, మంగళ చండికా !”*


*"ఇంకా ఏం కావాలో కోరుకో కుమారా !”*


*“అమ్మా ! నీకు ఇష్టమైన వరం ప్రసాదించు !"* కుజుడు వినయంగా అన్నాడు.


*"నీ వినయం , నీ ఆప్యాయతా నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. పరమేశ్వరుల స్వేదపుత్రుడుగా జన్మించావు , నా నామధేయాన్ని నీ నామధేయంతో పొదుగుకున్నావు. పేరును అంటిపెట్టుకుని నీ పేరు ఉన్నట్టే - నా సమీపాన నువ్వు ఎప్పుడూ ఉండేలా వరమిస్తున్నాను...”*


*“అమ్మా !”*


*"ఔను ! ఈ మంగళచండిక గ్రామ దేవతగా ఎక్కడెక్కడ నెలకొని ఉంటుందో , అక్కడ నువ్వు నెలకొని ఉంటావు ! నాతో బాటుగా పూజలు అందుకుంటావు !"*


*“ధన్యోస్మి మాతా !”* కుజుడు చేతులు జోడించాడు.


*"మంగళా ! నీకు మరొక వరం కూడా ఇస్తున్నాను. నిన్ను ఆరాధించే వాళ్ళకు నా అనుగ్రహం లభిస్తుంది !"* మంగళచండిక చెయ్యెత్తి దీవిస్తూ అంది. 


కుజుడు భక్తి పారవశ్యంతో చండిక చరణాల ముందు సాగిలపడి , సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇందాక ఆ ప్రాంతాన్ని ఆవరించిన మనోహర సుగంధం దూరంగా వెళ్తున్నట్టు అనిపించింది కుజుడికి. మెల్లగా పైకి లేచాడు.


అంబ అప్పటికే అంతర్థానమైంది.


*"చాలా సంతోషం నాయనా ! ఊహకు అందని దివ్యమైన వరం కోరావు !"* భూదేవి మెచ్చుకుంటూ అంది. *"నీ మాతృభక్తి నీకు తెలియకుండానే , చిగురు తొడిగింది. నీ జనకులు పరమేశ్వరులు నీ జనన సమయంలో ప్రసాదించిన పేరులో ఈ అమ్మ భూదేవి మిళితమై ఉంది. ఆ తండ్రికి ఇల్లాలైన ఆ చండిక కూడా నీ పేరులో మిళితమైంది. ఇందులోని అద్భుతమైన విశేషమేమిటో నీకు తెలుసా , కుజా ?"*


కుజుడు మంత్రముగ్ధుడిలా తల అడ్డంగా ఊపి , తనకు తెలియదని తెలియజేశాడు.


భూదేవి చిరునవ్వు నవ్వింది. *“నీ నామధేయంతో తమ నామధేయాలను కలిపి అల్లుకున్న తల్లులిద్దరిలో ఎవ్వరూ నిన్ను కన్నతల్లి కాదు. అంటే ఈ భూమాత నిన్ను కనలేదు. ఆ చండికామాతా నిన్ను కనలేదు ! అంటే , గర్భవాసక్లేశం అనేది లేకుండా... జన్మించిన మహా అదృష్టం నీది ! నీ జననంలోని విశేషం ఇదే ! అలాగే గర్భభార క్లేశమూ , ప్రసవ వేదన , ప్రసవమూ అనేవి లేకుండా నీకు తల్లులైన అదృష్టం ఆ దేవిదీ , నాదీ !"*


*"అమ్మా , నీ మాటలు వింటూంటే నేను మహాభాగ్యశాలి ననిపిస్తోంది !"* కుజుడు ఆనందంగా అన్నాడు.


*"అందుకు సందేహం లేదు నాయనా ! నిన్ను సేవించే వాళ్ళకూ ఆ మహద్భాగ్యం కలుగుతుంది. ఇప్పుడు నీకు సేవలు చేయడానికి పత్ని కావాలి. తగిన వధువును అన్వేషించు ! పార్వతీపరమేశ్వరుల ఆశీస్సులతో వివాహం జరిపిస్తా !”* అంది భూదేవి.


*"అలాగే , అమ్మా ! వధూన్వేషణ ప్రారంభిస్తాను. ఆశీర్వదించు !"* కుజుడు. నమస్కరించాడు.


*"విజయోస్తు ! కళ్యాణమస్తు !"* భూదేవి ద్విముఖంగా ఆశ్వీరదించింది.


భూమాత దీవించినట్లే కుజుడు - వధువు కోసం సాగించిన అన్వేషణలో విజయం సిద్ధించింది. 'శక్తి' అనే సౌందర్యవతి లభించింది. ఆమెతో కుజుడి కళ్యాణం వైభవంగా జరిగింది. పార్వతీపరమేశ్వరులూ , లక్ష్మీ విష్ణువులూ , సరస్వతీ బ్రహ్మలూ నూతన దంపతులను దీవించారు.


*“నాయనా , త్రిమూర్తుల ఆదేశం ప్రకారం విశ్వకర్మ నీకు మందిరం నిర్మించాడు. సతీసమేతంగా నీ మందిరంలో నివాసం ప్రారంభించు !”* భూదేవి కుజుడితో అంది. కుజుడు విచారంగా ఆమె వైపు చూశాడు. *"నిన్ను వదిలి వెళ్ళను !"* అన్నాడు నిష్కర్షగా.


భూదేవి చిరునవ్వు నవ్వింది. *"తప్పదు నాయనా ! నువ్వు కారణజన్ముడివి. నీ ఆవిర్భావానికి ఒక ఉద్దేశం , ఒక మహాలక్ష్యం ఉన్నాయి. ఆ లక్ష్యం నెరవేరాలంటే నువ్వు నీ స్థానంలో ఉండి తీరాలి. నువ్వు నన్ను వదిలి ఎక్కడికీ పోలేవు. ఎక్కడ ఉన్నా నన్ను దర్శించకుండా ఉండలేవు. నేను విపులను ! విపులమైన విస్తారమైన పృథ్విని కదా నేను !"*


కుజుడి ముఖం మీద చిరునవ్వు పరుచుకుంది. *“ఎక్కడ ఉన్నా నీ దగ్గరే ఉన్నప్పుడు నీ ఆజ్ఞ ప్రకారం అక్కడికే వెళ్తాను !”* అంటూ కుజుడు భూమాతను కౌగిలించుకున్నాడు. శక్తి కళ్ళల్లో ఆనందబాష్పాలు నిండుతున్నాయి.



*“గురువుగారూ , నవగ్రహాల చరిత్రలు విన సొంపుగా ఉన్నాయి ! ప్రతీ చరిత్రలోనూ ఒక పరమార్థం ఉంది !"* చిదానందుడు ఉత్సాహంగా అన్నాడు. కుజుని చరిత్ర ముగించిన నిర్వికల్పానందతో. 


*"అవును ! ఇప్పుడు మీరు ఆలకించబోయే బుధుడి చరిత్ర ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది. అది అద్భుతాలకు ఆటపట్టు !"* నిర్వికల్పానంద అన్నాడు. 


*"పితామహులైన అత్రి మహర్షి వద్ద విద్యాభ్యాసం చేస్తూ బుధుడు పెరుగుతున్నాడని విన్నాం !"* సదానందుడు గుర్తు చేసుకున్నాడు..


*"అత్రీ అనసూయల పెంపకంలో బుధుడు యువకుడయ్యాడు. అతడు స్వయం సాధనలో , స్వయం పోషణలో జీవించాల్సిన సమయం వచ్చినట్టు గుర్తించాడు అత్రి మహర్షి. ఆ విషయాన్ని సతీమణి అనసూయతో చర్చించాడు...”* నిర్వికల్పానంద కథనం ప్రారంభించాడు...




*రేపటి నుండి బుధగ్రహ చరిత్ర ప్రారంభం*

కామెంట్‌లు లేవు: