అద్వితీయాలు
“మాత్రా సమం నాస్తి శరీరపోషణం
చింతా సమం నాస్తి శరీరశోషణం
భార్యా సమం నాస్తి శరీర తోషణం
విద్యాసమం నాస్తి శరీరభూషణమ్."
“శరీరపోషణ విషయంలో తల్లికి సాటియైనవారు లేరు. శరీరాన్ని శుష్కింపజేయటంలో చింతతో సమమైనది లేదు. శరీరానికి సంతోషం కలిగించటంలో భార్యతో సమానులు లేరు.శరీరాన్ని భూషింపజేయటంలో విద్యకు సాటివచ్చేది లేదు " అని ఈ శ్లోకానికి అర్థం.
సృష్టిలో ఏజీవియైనా ప్రథమంగా మాతృపోషణలోనే ఎదుగుతుంది. మాతృమూర్తి స్తన్యమే అమృతప్రాయమై పసి జీవుల ప్రాణదీపాలను నిలుపుతుంది. అందుకే తీర్చుకోలేని ఋణాలలో మాతృఋణం మొదటిది. తాను తిన్నా, తినకపోయినా తన బిడ్డతినటమే ఆమెకు ముఖ్యం. అన్నం తిననని మారాం చేసే బిడ్డను బ్రతిమాలి, లేదా దండించియైనా అన్నం పెడుతుంది అమ్మ. మల, మూత్రాలను తొలగించి , పరిశుభ్రమైన బట్టలు కట్టటంలో, బిడ్డకు అవసరమైన ఔషధాలు వాడి ఆరోగ్యాన్ని కాపాడటంలో తల్లి అనన్యమైన శ్రద్ధ తీసుకుంటుంది.
చింత మనిషిని క్రుంగదీస్తుంది.
“చితా చింతా సమా ప్రోక్తా బిందుమాత్రం విశేషతా,
సజీవం దహతే చింతా, నిర్జీవం దహతే చితా "
(చిత, చింత - రెండూ సమానమే. బిందువే భేదం. చింత – జీవించి ఉన్నవారిని దహిస్తుంది. చిత (చితి) నిర్జీవులను దహిస్తుంది.) అనేది అనుభవజ్ఞులమాట. మనోవ్యాధికి మందులేదంటారు.మనస్సులో ఒక చింత ఉంటే అది శరీరాన్ని రోజురోజుకూ శుష్కింపజేస్తుంది.
భార్య తన భర్తకు అవసరమైన వస్తువులను సమకూర్చి సంతోషాన్ని కలిగిస్తుంది. అతని ఇష్టానిష్టాలను బట్టి ఆహారాన్నిసిద్ధంచేస్తుంది. అలసిన, అధైర్యపడిన సమయాల్లో వానికి అండగా నిలబడుతుంది. ముఖ్యగృహ బాధ్యతలను తాను స్వీకరించి అతని శారీరక, మానసికారోగ్యాలను అనితర సాధ్యంగా సంరక్షిస్తుంది.
విద్య - జ్ఞానహేతువై ముక్తిని ప్రసాదిస్తుంది. ధర్మసాధనమైన దేహానికి విద్య చేకూర్చే పవిత్రతను మించిన భూషణం మరొకటి ఏముంటుంది ? అందుకే విద్య నరులకు అలంకారమని, ప్రచ్ఛన్నమైన గుప్త ధనమని, అది భోగాన్ని, కీర్తిని కలిగిస్తుందని, విద్యా విహీనుడు పశుతుల్యుడని భర్తృహరి చెప్పాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి