శు భో ద యం🙏
శివుని మెడలో తాళి !
సీ: చిన్ని వెన్నెల ఱేఁడు చెన్నైన సికపూవు ,
పసమించు పులితోలు పట్టుసాలు ,
" చిలువల యెకిమీడు బలుమానికపుఁ దాళి",
వాటంపు తెలిగిబ్బ వారువంబు ;
గఱికి పూజలు మెచ్చు గారాబు కొమరుండు ,
వలిగొండ కూతురు వలపు టింతి ;
జే జే తుటుము లెల్ల ఁ జేరి కొల్చెడు బంట్లు ,
నును వెండి గుబ్బలి యునికి పట్టు ;
గీ: లగుచుఁ జెలువొంద భువనంబు లనుదినంబు
రమణఁ బాలించు నిన్ను నేఁ బ్రస్తుతింతు
బుధనుత విలాస ! పీఠికాపుర నివాస!
కుముదహిత రహిత కోటి సంకాశ! కుక్కుటేశ!
రుక్మిణీకళ్యాణం-- కావ్యావతారిక--కూచిమంచి తిమ్మకవి .
కవులు ఘటనాఘటన సమర్ధులు. వారేమైనా కనగలరు. అనగలరు. కాక పోతే సదాశివుని కంఠసీమ నలంకరించిన
సర్పరాజును తాళిగా చెప్పగలరా? ఎగతాళిగాదిది, అక్షర సత్యం! తిమ్మకవి దానిని తాళిగా పేర్కొనినాఁడు. అదోకవితా విచిత్రం!
తిమ్మకవి విరచిత " రుక్మిణీ కళ్యాణ కావ్యావతారికలో నిపద్యమిది. పిఠాపురంలో నెలకొనిన కుక్కుటేశ్వర స్వామిని ప్రస్తుతిస్తూ , ఇలా అన్నాడాయన. "చందమామే నీకుశిరోభూషణం. పులిచర్మమే పట్టువస్త్రాలు. తెల్లటి ఎద్దే అశ్వం.పన్నగ ప్రభువే నీకంఠహారం .(చిలువల యెకిమీడు బలుమానికపుఁ దాళి) అంటూ వర్ణించు కొచ్చాడు కవి. అంటే పామే తాళిగామారిందని
భావం. ఈ తాళి యనేపదానికి ఉన్న పతకం, హారం ఇత్యాది నానార్ధములను బట్టి తిమ్మకవి యిలాప్రయోగించాడు.
చంద్రభాను చరిత్రం లో చరిగొండ మల్లన , ఉత్తర రామాయణంలో కంకంటి పాపరాజు కూడా హారాన్ని తాళిగా వర్ణిచారు. అన్నట్టు మనం యీమధ్య చూచిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంతో ప్రాచుర్యంలోకివచ్చిన ఒకప్రాచీన పదంకూడా యీపద్యంలో కనిపిస్తోంధి. అదే 'ఎకిమీడు' అనేపదం.దీనితోఁబాటు 'వెన్నెలఱేడు (చంద్రుడు ) పస (కాంతి ) తెలిగిబ్బ (తెల్లనియెద్దు)
వారువం (గుఱ్ఱము) వలిగొండ (మంచుపర్వతం) తుటుము (సమూహము ) వెండిగుబ్బలి(వెండికొండ)లాంటి అచ్చతెలుగు పదాలతోశివుడికి తిమ్మన అక్షరాభిషేకం చేశాడు.
తిమ్మకవి ప్రతిభ అపారం!
స్వస్తి!
🙏🙏🌷🌷🌷🌷👌👌🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి