25, నవంబర్ 2023, శనివారం

 🕉️ ఆలోచనాలోచనాలు 🕉️( అక్షరరూపం దాల్చిన ఒక సిరాచుక్క; లక్ష మెదళ్ళకు కదలిక)                  ***** నీ తోటి ప్రజలతో సద్భావనలతో జీవించు. అదే నీవు ఈ లోకానికి ఇచ్చిపోగల అద్భుతమైన, అత్యంత విలువైన "" వీలునామా.""                             ***** మీరు వద్దన్నా మీ వయసు పెరుగుతూనే ఉంటుంది. వరుసగా రోజులు, నెలలు ఆపై సంవత్సరాలు. మీరేమో వయస్సును దాచడానికి జుట్టుకు రంగులు, కట్టుడు పళ్ళు, సౌందర్యసాధనాలైన లిప్ స్టిక్స్, ఆపై ప్లాస్టిక్ సర్జరీలు మరియు విగ్గులతో ప్రయత్నం చేస్తుంటారు. విచిత్రంగా ఉంది కదూ!            ***** ఆ రెండు (౼) మైనస్ లు. ఒకదానికి, ఒక అడ్డుపడితే ఒక (+) ప్లస్ అయికూర్చుంటుంది. మీ వద్దనున్న వ్యతిరేక భావనలను ఒకదానిని రెండవ దానితో ఖండించుకోనివ్వండి. మీరు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నట్లు లెక్క.                                     ***** మనం రోజువారీ రంగు,రంగుల అధునాతన ఫ్యాషన్ దుస్తులను జనం గుర్తుంచుకోవడం కష్టం. కానీ మీ మనస్సు ధరించే మేలైన, అద్భుతమైన గుణశీలాలను జనాలు వద్దన్నా ఎక్కువ కాలం అప్రయత్నంగా గుర్తుంచుకొంటారు.               ***** తమాషా ఏమిటంటే ఎల్లప్పుడూ, ఎవరినో ఒకరిని లక్ష్యంగా తప్పులెన్నుకుంటూ బ్రతుకుతున్నావంటే, నీకు నువ్వే నేను మిగిలిన వారికంటే ""ఉత్తముడను"" అని కారెక్టర్ సర్టిఫికెట్ ఇచ్చుకొంటున్నానని అర్థం. కాకపోతే ఈ" ధృవీకరణ పత్రాని"కి దిగువన ఎవరి సంతకం ఉండదు. ఆపనేదో నీవే చేసుకొని ఆత్మతృప్తిని పొందాలి.           ***** పందొమ్మిది పర్యాయాలు ఓటమిపాలైనా, ఇరువదవ పర్యాయం ప్రయత్నించి గెలుపు గుఱ్ఱాన్ని అధిరోహించడానికి ప్రయత్నించు. చివరిదానినే లోకం గుర్తుంచుకొంటుంది.     ***** అందరం ఒకే ఆకాశం క్రింద బ్రతుకుతున్నాం. అందరి ఆలోచనా ఉన్నతి మాత్రం ఒకే ఎత్తులో (Horizon) ఉండదు. అదే ఈ లోకంలోని విచిత్రం.                ***** ఉన్నది తక్కువ భూమి. చల్లింది తక్కువ గింజలు. ఎక్కువ పంటను ఆశించడం దురాశ మాత్రమే కాదు. కపట వ్యవహారం కూడా!                      ***** ఒక పని కాకూడదని మన మనస్సులో నిశ్చయం ఉంటే, వెంటనే మనం చెయ్యవలసిన తెలివైన పని ఏమిటంటే దానికొక కమిటీ వేసి, నిర్ణీత కాలాన్ని ప్రకటించకపోవడం.                ***** ఈ విశ్వంలో మరేవ్యక్తి ప్రవేశించని విధంగా ఎవరూ ఊహించని నూతన పథంలో అడుగులు ముందుకు వెయ్యడమే జీవితవిజయరహస్యం.        ***** ఒక సమస్య వచ్చిందని నీవెందుకు కంగారు చెందుతున్నావ్! సోదరా! అది నిన్ను నీవు లోకానికి అద్భుతంగా ప్రదర్శించుకొనే మేలైన అవకాశం.( A problem is a chance for you to do your best.).                       ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~                                       తెలుగు నుడికారం ( సామెతలు మరియు జాతీయాలు)                         1* అమ్మ పెట్టదు; అడుక్కుతిననియ్యదు.          2* తోచీతోచనమ్మ తోడికోడలు పుట్టింటికి ప్రయాణం అయ్యిందట!        3* అయ్యవారు ఏంచేస్తున్నారంటే; చేసిన తప్పులను తీరుబడిగ దిద్దుకొంటున్నారు.                 4* అయిపోయిన పెళ్ళికి బాజాలెందుకు?                     5* ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అధికం.                6* ఉట్టికెక్కలేనమ్మ ఏకంగా స్వర్గానికి పాకుతానందిట!       7* ఒక్క రోజు బాగోతానికి మూతి మీసాలు గొరిగించుకొన్నట్లు.               8* పిచ్చి కుదిరింది, తలకు రోకలి చుట్టమన్నాడుట!         9* దరిద్రానికి ఆకలి ఎక్కువ! తద్దినానికి కూరలెక్కువ.                         10* ఆ మాల్( సరుకు) మంచిదైతే ఆ అంగట్లో( సంతలో) నే అమ్ముడు పొయ్యేది.              తేది 25--11--2023, శనివారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: