25, నవంబర్ 2023, శనివారం

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 10*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 *10. గుంగులియ క్కలయ నాయనారు*


చోళదేశంలో 'తిరుక్కడవూరు' అనే గ్రామం ఒకటి ఉంది. ఆ గ్రామంలో కలయనార్ అనే ఒక వైదిక బ్రాహ్మణుడు నివసిస్తున్నాడు. 

అతడు పరమేశ్వరునికి నిత్యమూ పరిమళ భరితమైన గుగ్గులిని (గుంగులి) ధూపం

వేసే పనిలో నిమగ్నమై ఉండడం వలన ప్రజలందరూ ఇతనిని గుంగులియ

కలయనారు అని పిలవడం ప్రారంభించారు. శివుడు ఒక పర్యాయం

కలయనారు భక్తిని పరీక్షించదలచుకొన్నాడు. పరమేశ్వరుని లీలా విలాసాల

 కారణంగా అతనికి దారిద్ర్యం సంక్రమించింది. 


అయినప్పటికీ కలయనారు

ధూపం వేసే పవిత్ర కైంకర్యాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. కొంత కాలానికి అతడు తన సంపదలన్నీ కోల్పోయాడు. బంధువులతో, భార్యాబిడ్డలతో

ఆహారంలేక ఆకలితో బాధపడవలసి వచ్చింది ఇంట్లో తినడానికి ఏ

పదార్ధమూ లేదు. 


రెండు రోజులు వరుసగా ఆహారం లేకుండా సొమ్మసిల్లి

పోయిన పిల్లలను చూసి కలయనాయరు భార్య తన బంగారు

మంగళసూత్రాన్ని తీసి భర్తచేతికి ఇచ్చి “దీనికి వడ్లు తీసుకురండి" అని

కోరింది.

కలయనారు ఆ బంగారు తాళిబొట్టును తీసుకొని వడ్లు కొనడానికై

బయలుదేరాడు. అప్పుడు అతని కెదురుగా ఒక వర్తకుడు గుగ్గిలపు మూటతో

వచ్చాడు. కలయనారు ఆ వర్తకుని చూసి “నేను బంగారు ఇస్తాను. మీరు

దానికి ఈ గుగ్గిలాన్ని ఇవ్వండి” అని అడిగాడు. 


వర్తకుడు దానికి

అంగీకరించగా కలయనారు తన భార్య బంగారు తాళిబొట్టును అతని

చేతిలో పెట్టాడు. వర్తకుడు దానిని తీసుకొని గుగ్గులిమూట ఇచ్చాడు.

కలయనారు ఆ మూటను తీసుకొని పరమేశ్వరుని దేవాలయానికి వేగంగా

వెళ్లాడు. 


స్వామి భండారంలో ఆ గుగ్గులిమూటను భద్రపరచి పరమేశ్వరుని

తిరుచరణాలను అర్చిస్తూ అక్కడే ఉండిపోయాడు. కలయనారు ఈ విధంగా

దేవాలయంలో ఉండగా పరమేశ్వరుని కరుణాకటాక్షాలచే అతని గృహం

ధనధాన్యాలతో, సువర్ణ రత్నాభరణాలతో, అపూర్వమైన సంపదలతో

నిండిపోయింది. 


వడ్లకోసం కాచుకొని ఉన్న కలయనారు భార్యబిడ్డలు

ఆకలితో సొమ్మసిల్లి నిద్రపోయారు. అప్పుడు తపోనిధి అయిన కలయనారు

భార్య కలలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై గృహమంతటా నిండి ఉన్న సంపదను

తెలియజేశాడు. ఆమె నిద్రనుండి లేచి "పరమేశ్వరుడే మనకు దీనిని అనుగ్రహించాడు" అని రెండు చేతులూ మోడ్చి భగవంతునికి

నమస్కరించింది. 


తరువాత తనభర్తకు, పిల్లలకు భోజనం తయారు

చేయసాగింది. అక్కడ దేవాలయంలో ఉన్న కలయనారుకు స్వామి కలలో

కనిపించి "నీవు ఆకలితో ఉన్నావు. ఇంటికి వెళ్లి నీ ఆకలిని తీర్చుకో” అని

చెప్పాడు. పరమేశ్వరుని ఆజ్ఞను శిరసావహించి కలయనారు తన ఇల్లు

చేరుకున్నాడు. 


ఇంటిలోపల ధనధాన్య రాశులు చూసి “ఇవన్నీ ఎలా

వచ్చాయి” అని భార్యను ప్రశ్నించగా ఆమె “పరమేశ్వరుని అనుగ్రహంతో

లభించింది” అని జవాబు చెప్పింది. గుంగులి కలయనారు పరమేశ్వరుని

కరుణాకటాక్షాలను తలచుకొని చేతులను శిరసుమీద మోడ్చి స్తుతించాడు.

యథాప్రకారం పరమేశ్వరునికి గుగ్గులిధూపాన్ని సమర్పించే కైంకర్యాన్ని

చేస్తూ వచ్చాడు. 


     *పదవ చరిత్ర సంపూర్ణం*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

కామెంట్‌లు లేవు: