శు భో ద యం🙏
పోతనగారి కవితా మాధుర్యం!
మందార మకరంద...
మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీవీచికల దూగు
రాయంచ చనునే తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు
కోయిల జేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక
మరుగునే సాంద్ర నీహారములకు
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పాన విశేష మత్త
చిత్త మేరీతి నితరంబు జేర నేర్తు!
వినుత గుణశీల, మాటలు వేయునేల?
పోతన భాగవతంతో కాస్తంత పరిచయం ఉన్న ఎవరికైనా ఈ పద్యం తప్పకుండా తెలుస్తుంది. భక్తప్రహ్లాద సినిమా చూసినవాళ్ళకి కూడా ఇది తెలిసే ఉంటుందండోయ్! ప్రహ్లాదుడు మన తెలుగువాళ్ళ హృదయాల్లో నిలిచిపోడానికి ముఖ్య కారణం పోతనంటే అది అతిశయోక్తి కాదు. ఇందులో ఎన్నెన్ని ఆణిముత్యాల్లాంటి పద్యాలు తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరంగా నిలిచిపోయాయో!
కవిత్వంలో, చెప్పే విషయం ఎంత గొప్పదైనా, అది చెప్పే విధానంకూడా అంతగొప్పదీ అయితేనే పాఠకుల మనసులకి హత్తుకుంటుందనడానికి ఈ పద్యం ఒక చక్కని ఉదాహరణ.
విష్ణు భక్తిని వదలడం తన సాధ్యం కాదని చెప్పడం ఈ పద్యం సారాంశం. దాన్ని చక్కని నాలుగు ఉదాహరణల్తో సమర్ధిస్తున్నాడు ప్రహ్లాదుడు. ఆ తీసుకున్న ఉదాహరణల్లో ఎంతో ఔచిత్యం ఉంది. తేనెటీగ, హంస, కోయిల, చకోరం - ఇవన్నీ పురుగులూ, పక్షులూను. వాటికి ఇష్టమైన ఆ వస్తువులు భౌతికమైనవి, అశాశ్వతమైనవి. అలాటి ప్రాణులకే అలాటి వస్తువులమీద అంత వదల్లేని అనుబంధం ఉంటే, ఇంక మనుషులకి, అందులోనూ అమృత ప్రాయమైన హరి చింతన వదిలిపెట్టడం సాధ్యమౌతుందా? సాధ్యమవదు అన్న జవాబు మళ్ళీ ఆ ఉదాహరణల్లోనే దొరుకుతుంది. మందారాల తేనె, గంగా ప్రవాహము, మావిడి చిగురు, వెన్నెల - వీటితో తుమ్మెద, హంస, కోయిల, చకోరాలకి ఉన్న సంబంధం అతి సహజమైనది. ప్రకృతి సిద్ధమైనది. వాటికి తెలియకుండానే పుట్టుకతో వచ్చింది. ప్రహ్లాదుని భక్తి కూడా అలాంటిదే! అందుకే దాన్ని వదులుకోడం అసాధ్యం!
పద్యం ఎత్తుకోడంతోనే అందమైన పదాలకూర్పుతో చదివేవాళ్ళ, వినేవాళ్ళ మనసులని వశం చేసుకోడం ఒక నేర్పు. ఈ పద్యంలో మరింత లోతైన కూర్పు నేర్పు కూడా చూపించాడు పోతన. ఇష్టమైన వస్తువులను ఎక్కువ పదాలతో వర్ణించి, ఇష్టపడని వస్తువులను ఒకటి రెండు పదాలతో చెప్పి ఊరుకున్నాడు. మదనములు - ఉమ్మెత్త చెట్లు. తరంగిణులు - సెలయేళ్ళు. కుటజములు - (వానాకాలంలో పూసే)కొండ మల్లె చెట్లు. సాంద్ర నీహారము - దట్టని మంచు. అయితే వీటిగురించి చెడు విశేషణాలేవీ వాడకపోవడం ఒక విశేషం. ప్రహ్లాదుడు దేనిగురించీ చెడ్డగా మాట్లాడే వాడు కాదు కదా!వాడిన క్రియలుకూడా చెప్పిన ప్రాణులకీ వస్తువులకీ ఉన్న గాఢమైన అనుబంధాన్ని చెప్పేవే - తేలు, తూగు, సొక్కు, స్ఫురితము (చుంబించబడిన).
అంతా చెప్పి చివరికన్న మాట చూడండీ! "అయినా నువ్వు గొప్ప గుణాలున్న శీలవంతుడివి. నీకు నేనింతగా చెప్పాలా!" ఇదేదో ప్రహ్లాదుడు గడుసుగా అన్న మాటలు కావు. అతనికి తండ్రి మీదున్న అచంచలమైన గౌరవమే!
ప్రహ్లాదుని భక్తి మాట అటుంచి, కనీసం అతని సౌశీల్యాన్నయినా ఆదర్శంగా తీసుకుంటే, పిల్లలు మంచి మనుషులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అది మనందరి చేతుల్లోనే ఉంది!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి