6000లపై ఓ కవి చమత్కారం
🌹🌹🌹
ఒక కవి అనవేమారెడ్డి కొలువుకు వెళ్లి, ఆయన్ని కీర్తిస్తూ ఈ పద్యం చదివాడట.
*అనవేమ మహీపాల స్వస్త్వస్తు తవ బాహవే*
*అహవే రిపుదోర్దండ చంద్రమండల రాహవే*
(శత్రువులను అంతమొందించడంలో అనవేమ ప్రభువు చంద్రమండలంలోని రాహువు లాంటివాడని అర్థం.)
రాజు సంతోషించి, కవికి మూడువేల వరహాల బహుమానం ప్రకటించాడు. అప్పుడు కవి, ‘ప్రభూ, మీకు నేను నాలుగు ‘వే’లిచ్చాను. మీరు నాకు మూడు వేలివ్వడం ధర్మమా?’ అన్నాడు.
రాజు కవి చమత్కారానికి మళ్లీ సంతోషించి, ‘అయితే నాలుగు వేల వరహాలు పుచ్చుకోండి’ అన్నాడు. ‘నేను మీకిచ్చినంతే మీరు నాకు ఇస్తే మీ గొప్పేమిటి?’ అన్నాడు కవివర్యుడు.
రాజు పెద్దగా నవ్వి, బహుమానాన్ని అయిదు వేల వరహాలకు పెంచాడు. దానికి కూడా ఆ కవిపుంగవుడు, ‘నేను ఆరువేల నియోగిని మహాప్రభూ’ అన్నాడట.
కవి సమయస్ఫూర్తికి మెచ్చి, ఆరువేల వరహాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు రాజు. కానీ కవీంద్రడు ఊరుకున్నాడా! ‘నా దగ్గర వున్నదే నాకు ఇస్తే మీ ఘనత ఏమిటి ప్రభూ’ అన్నాడు.
కవి యుక్తి రాజుకు నచ్చి, ఏడు వేల వరహాలు చేశాడు బహుమానాన్ని. ఊహూ! ‘ఏడు అంకె శుభసూచకం కాదుగా’ అన్నాడు ఆ కవి.
చివరకు అనవేమారెడ్డి అక్షరాలా ఎనిమిది వేల వరహాలతో ఆ కవికేసరిని సత్కరించాడట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి