యువతకు భగవద్గీత ఏ విధంగా ఉపయోగపడుతుంది?
భగవద్గీత జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు ప్రధానంగా గోచరించే విషయం 1.ఇన్ద్రియ నిగ్రహం 2 స్వధర్మాచరణ 3. హృదయదౌర్బల్యమును విడనాడుట!
క్లైభ్యం మాస్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే।
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరన్తప।।(2/3)
క్లైభ్యమనగా చేతకానితనం మరియు పిరికితనము! ఇది హృదయదౌర్బల్యమును కలిగించును. హృదయదౌర్బల్యమనగా (Depression). ఇది క్షుద్రము అనగా పరమ నీచమైనది!
కనుక ఈ నీచమైన హృదయదౌర్బల్యమైన పిరికితనమును వదిలి కర్తవ్యోన్ముఖుడవు కమ్ము!
‘స్వధర్మమపి చావేక్ష్య న వికమ్పితుమర్హసి’(2/31)
స్వధర్మాచరణమున చలింపరాదు!
‘స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః(3/35)
ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా, లోపాలతో కూడి ఉన్నా సరే, తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము. పరధర్మాచరణ మిక్కిలి భయంకరమైనది!
పైన చెప్పిన మూడు శ్లోకాలను పరిశీలిద్దాం!
పైన చెప్పిన మూడు విషయాలు నేటి యువతకు మరీ ప్రత్యేకించి విద్యార్ధులకు వర్తిస్తాయి! నేటి యువత ప్రతీ చిన్న విషయానికి హృదయదౌర్బల్యమునకు (depression and mental imbalance) లోనవుతున్నారు! మరి ఇది పూర్వపు రోజులలో లేదా? అంటే లేదనే చెప్పవచ్చు! పూర్వం గురుకులాలలో విద్యనభ్యసించేవారు! అక్కడ విద్యార్ధి కొన్ని కఠిన నియమములకు లోబడి ఇన్ద్రియనిగ్రహంతో ఉండేవారు! ఉదాహరణకు, తెల్లవారుఝామున బ్రాహ్మీముహుర్తాన లేవడం, గురు శుశ్రూష చేసి విద్యను అభ్యసించడం, గురువుగారి ఆజ్ఞ అయిన తరువాతనే భుజించడం వగైరా క్రమశిక్షణతో మెసలుకొనోవారు! గురుసేవ మరియు విద్యనభ్యసించడమనే విద్యార్థియొక్క స్వధర్మమును పాటించేవారు. వారికి మిగిలిన విషయాలపై దృష్టి ఉండేదికాదు! అలాగుననే, మొదటి ర్యాంకే రావాలని తల్లిదండ్రుల ఒత్తిడి ఉండేదికాదు! అటువంటి ఒత్తిడి లేని వాతావరణంలో మనస్సు దౌర్భల్యమునకు లోనవదు! కనుక వారు నియమములతో కూడిన క్రమశిక్షణతో ప్రశాంతంగా విద్యనభ్యసించేవారు! వారివారి బుద్ధి పరిణితినిబట్టి కొందరు వేగం మరికొందరు కాస్త ఆలస్యంగా మొత్తం విద్యనభ్యసించి వారు సమాజానికి చాలా ఉపయోగపడేవారు!
మరి నేటి యువత? చదువుకునే విద్యార్థికి దేశ రాజకీయాలతో ఏం పని? ఉదాహరణ ఢిల్లీ యూనివర్శిటీ ఘఠనలు! రాజకీయం వారి స్వధర్మం కాదు! పరధర్మము ఎప్పుడూ భయానకమేయని గీతాబోధ! అదే ప్రస్తుతం జరుగుతోంది! విద్యార్థులలో నియమములు లేవు, ఇన్ద్రియనిగ్రహణ లేదు, క్రమశిక్షణ లేదు, గురువుల పట్ట గౌరవంలేదు. మీదుమిక్కిలి, పరస్పర లింగాకర్షణ! ఆ ఆకర్షణకు ప్రేమయని పేరు! అది సఫలీకృతమైనా కాకపోయినా విద్యార్థి లక్ష్యం దెబ్బతినడం తప్పదు! ఇది వికటిస్తే, ఇన్ద్రియనిగ్రహణ లేకపోవడం వలన హృదయదౌర్భల్యమునకు లోనయి, అయితే ఎదుటివారిని హింసించడం లేక తాను పిరికివాడయితే (క్లైభ్యం) ఆత్మహత్య చేసుకోవడం మనం రోజూ చూస్తున్నాము! ఇటువంటి వారు సమాజానికి ఎలా మేలు చెయ్యగలరు?
అయితే, మనం మరల గురుకులాల వ్యవస్థకు వెళ్లగలమా? సాధ్యం కాదు! కనుక, మన పాఠ్యాంశాలలో గీత, రామాయణ, భారతంలోని ప్రధానమైన విషయాలను బోధించాలి! రామాయణం వలన కుటుంబవ్యవస్థ, సౌభ్రాతృత్వం, మంచి నడవడిక అబ్బుతాయి. భారతం వలన సమాజంలో మన చుట్టూయున్నవారితో ఏ రకంగా మెసలుకోవాలో తెలుస్తుంది. గీత వలన ఇన్ద్రియనిగ్రహము, స్వధర్మాచరణ తెలిసి ప్రతి చిన్నవిషయానికి ఉద్వేగానికి లోనవకుండా, మరియొకరికి హాని తలపెట్టకుండాయుండడం తెలుస్తుంది!
కనుక నేటి యువత భగవద్గీతను అధ్యయనం చేయడం వలన, ఇటువంటి బలహీనతలకు లోనవకుండా తనను తాను ఉద్ధరించుకుంటూ, మెరుగైన సమాజాన్ని తయారు చేయగలదు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి