21, మార్చి 2024, గురువారం

ఆత్మవిద్యా విలాసము -

 🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

. *🌹శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి🌹*

. *🌹విరచితము🌹*

  *ఆత్మవిద్యా విలాసము - శ్లోకం 16*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹


*శ్లోకం:-*


*దేహేంద్రియాసు హృదయాదిక చైత్యవర్గాత్ ప్రత్యక్చితే ర్విభజనం భవవారి రాశేః |* 

*సంతారణే ప్లవ ఇతి శ్రుతి డిండిమోఽయం తస్మాద్విచారయ జడాజడయో స్స్వరూపమ్ ॥*



*భావం:-*

దేహం, ఇంద్రియాలు, పంచప్రాణాలు, హృదయం మొదలైన చైతన్యంతో కూడిన వర్గం నుండి లోనుండే చితిని విడదీయడమే సంసార సముద్రాన్ని దాటించే పడవ అని ఉపనిషత్తులు చాటిస్తాయి. అందుచేత జడాజడాల స్వరూపాన్ని గురించి విచారణ చేయుము.


*వివరణ:-* 

శిష్యుని హృదయం చాలా పరిపక్వత చెంది వున్నందున శ్రీ గురువు అత్యుత్తమమైన ఆత్మ విచారణా మార్గాన్ని సూటిగా బోధిస్తున్నాడు.


*చైత్యవర్గం :-*

దేహము, అయిదు జ్ఞానేంద్రియాలు అయిదు కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనోబుద్ధి చిత్తాహంకారాలనే నాలుగు అంతఃకరణాలు కలిసిన ఇరవైయింటినీ చైత్యవర్గమంటారు.


ప్రపంచాన్ని గురించిన జ్ఞానాన్ని ఇస్తాయి, కాబట్టి జ్ఞానేంద్రియాలకి ఆ పేరు వచ్చింది. తక్కిన వాటికి వేరే రకమైన చైతన్యం ఉన్నది. దేహం ఎంతో తెలివైయింది. తనకి పడని వాటిని, అక్కరలేని వాటిని వెంటనే బయటకి తోసివేస్తుంది.


 కర్మేంద్రియాలకు, పంచప్రాణాలకి తమ తమ పనులు చేయడానికి తగిన జ్ఞానం ఉన్నది. అంతఃకరణాల వ్యవహారాలన్నీ చైతన్యంతో కూడినవే.


అయితే ఇవి చైతన్యంతో కూడిన జడాలు. వాటికి స్వతహాగా చైతన్యం లేదు, స్థూల సూక్ష్మ రూపాలుగా ఉన్న ఈ ఇరవయింట్లోను చైతన్యం ప్రసరించిన కారణంగా అవి చైతన్యంతో ప్రవర్తిస్తాయి.


 చైతన్య ప్రసారం ఆగిపోగా అవి తిరిగి జడాలవుతాయి, నశించిపోతాయి. చైతన్యంలేనిదే అవి నిలవలేవు, కొండలు, నదులు మొదలైన వాటిలాగా అవి జడాలుగా నిలిచి ఉండవు. కేవలం చైతన్యాన్ని ప్రసరించడానికే అవి ఉపయోగ పడతాయి. అందుకే అవి చైత్యవర్గం అని పిలువబడుతాయి.


*ప్రత్యక్షితి:-*

 అన్నింటికి అంతరంలో ఉండే చితి. బల్బులోకి ప్రవేశించి వెలుగు నిచ్చే కరెంటులాగా, పైన చెప్పిన చైత్యవర్గం లోపల ప్రవేశించి చైతన్యాన్ని ఇస్తుంది.


*విభజనం :-* 

సంసారంలో కొట్టుమిట్టాడే జీవుడు చైతన్యవంతుడు. అందుండి తరించాలని తహతహపడేది కూడా ఈ జీవుడే.


అందువల్ల తనలోని చితిని, చైత్యవర్గాన్ని విడదీసి తన చితి తన చైత్యవర్గంలోకి ప్రవేశించి, బాహ్య విషయాలని చూపుతోందని, చూపిస్తుందని గ్రహించాలి.


అప్పుడే అతడికి తన నిజ స్వరూపం తెలిసి బాహ్య ప్రపంచాన్ని అధిగమిస్తాడు. లోపలి చితిని విడదీసినప్పుడు దానికి బాహ్య ప్రపంచంలోగాని, దాని బాధలతో గాని సంబంధం ఉండదు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: